DailyDose

వేలమందికి అమెరికన్లకు ఇన్ఫోసిస్ ఉద్యోగాలు-వాణిజ్యం

వేలమందికి అమెరికన్లకు ఇన్ఫోసిస్ ఉద్యోగాలు-వాణిజ్యం

* మారిటోరియం సమయంలో వాయిదా వేసిన ఈఎమ్‌ఐలపై వడ్దీ రద్దు చేయలేమని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రాలకే విరుద్ధమని పేర్కొంది. వడ్దీ రద్దు చేస్తే .. మారిటోరియం సమయంలో సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసిన వారమవుతామని కోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం పేర్కొంది. సెప్టెంబర్‌ 1కి కూడా రుణాలు చెల్లించలేమని ఎవరైనా భయపడితే వారిని ఎన్‌పీఏలుగా ప్రకటించి.. రెండేళ్ల మారిటోరియం అవకాశాన్ని కల్పిస్తూ.. ఇప్పటికే ఆగస్టు 6న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అలాంటివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కోర్టుకు విన్నవించింది. మారిటోరియం సమయంలోని ఈఎమ్‌ఐల వడ్దీ అంశాన్ని సమీక్షించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. మంగళవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆర్థిక మంత్రిత్వశాఖ అఫిడవిట్‌ సమర్పించింది. ‘‘మారిటోరియంతో రుణగ్రహీతలకు లాభాలూ ఉన్నాయి. ఖర్చులూ ఉన్నాయి. రెండింటిని బేరీజు వేసుకొని రుణగ్రహీతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీ మాఫీ చేస్తే క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి అన్యాయం చేసినవారమవుతాం’’ అని ప్రమాణపత్రంలో కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. వడ్డీ మాఫీ చేస్తే బ్యాంక్‌ డిపాజిటర్లు కూడా ఇబ్బందులు పడతారని అఫిడివిట్‌లో హెచ్చరించింది. ఎవరైనా వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే.. ఆ మొత్తానికి తాజాగా రుణం కూడా బ్యాంకుల నుంచి తీసుకోవచ్చని ప్రమాణపత్రంలో ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. కేసును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

* కరెంటు ఖాతాలకు సంబంధించి భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాలు విదేశీ బ్యాంకులకు ఇబ్బందికరంగా మారాయి. మెరుగైన సేవలు అందించే సాకుతో కార్పొరేట్‌ సంస్థల నుంచి సున్నా వడ్డీకి డిపాజిట్లు సేకరించటం ఇకపై సాధ్యం కాదు. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా కార్పొరేట్‌ సంస్థకు కరెంటు ఖాతా తెరిచిన పక్షంలో…, ఆ సంస్థకు రూ.50 కోట్లకు పైగా అప్పు ఉంటే, అందులో కనీసం 10 శాతాన్ని కరెంటు ఖాతా తెరిచిన బ్యాంకు ఇచ్చి ఉండాలి. విదేశీ బ్యాంకులు కంపెనీలకు ఎటువంటి అప్పు ఇవ్వకుండానే ఆ కంపెనీల కరెంటు ఖాతాలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో కంపెనీలకు అప్పులు మాత్రం దేశీయ బ్యాంకులు ఇవ్వాల్సి వస్తోంది. ఎటువంటి అప్పు ఇవ్వకుండా, డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా దేశీయ కంపెనీలకు చెందిన పెద్ద మొత్తాలను మెరుగైన సేవలు అందించే నెపంతో విదేశీ బ్యాంకులు సమీకరించగలుగుతున్నాయి- అని ఒక బ్యాంకు అధికారి వివరించారు. ఆర్‌బీఐ నూతన నిబంధనలతో ఈ పద్ధతికి స్వస్తి పలికినట్లు అయింది. దీనివల్ల కార్పొరేట్‌ సంస్థలకు పెద్దఎత్తున రుణాలు ఇచ్చే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

* అమ్రపాలి గ్రూపు వద్ద ఇళ్లు కొనుగోలు చేసిన వేలాది మంది వినియోగదార్లకు శుభవార్త. ఎస్‌బీఐ క్యాప్‌ వెంచర్స్‌కు చెల్లించాల్సిన వడ్డీ వ్యవహారాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రకటించిన ‘స్ట్రెస్‌ ఫండ్‌’ ను ఎస్‌బీఐ క్యాప్‌ నిర్వహిస్తోంది. ఈ సంస్థ, అమ్రపాలికి చెందిన నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయిన 7,000 నివాస యూనిట్లు కల ఆరు ప్రాజెక్టులకు రూ.625 కోట్లు సమకూర్చటానికి ముందుకు వచ్చిన ఎస్‌బీఐ క్యాప్‌కు 12 శాతం ఐఆర్‌ఆర్‌ (ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌) చెల్లించేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారు చేసి నాలుగు వారాల్లో దాఖలు చేయాల్సిందిగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు ఉదయ్‌ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. నిలిచిపోయిన ఈ ప్రాజెక్టులను ఎన్‌బీసీసీ (నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌) తో పూర్తి చేయించాలని, దీనిపై న్యాయస్థానం నియమించే కమిటీ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. వీటిని పూర్తిచేయటానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు బ్యాంకుల కన్సార్టియమ్‌ను ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలపై భారత రిజర్వు బ్యాంకును సంప్రదించాలని కోర్టు రిసీవర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణికి సూచించింది. అదేవిధంగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైన మొత్తం నిధులను అందించే అంశాన్ని పరిశీలించాలని ఎస్‌బీఐ క్యాప్‌ వెంచర్స్‌ను కూడా కోరింది. న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఎంతో కాలంగా ఎటూ తేలకుండా అమ్రపాలి గ్రూపు వ్యవహరంలో కదలిక వచ్చినట్లు అవుతోంది. నిలిచిపోయిన ఆరు అమ్రపాలి ప్రాజెక్టుల్లో సిలికాన్‌ వ్యాలీ-1, సిలికాన్‌ వ్యాలీ-2, క్రిస్టల్‌ హోమ్స్‌, సెంచూరియన్‌ పార్క్‌ లోరైజ్‌, సెంచూరియన్‌ పార్క్‌ ఓ2 వ్యాలీ, సెంచూరియన్‌ పార్క్‌ ట్రాపికల్‌ గార్డెన్‌ ఉన్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 10.9 శాతంగా నమోదుకావొచ్చని ఎస్‌బీఐకి చెందిన పరిశోధన పత్రం ఎకోరాప్‌ తన అంచనాలను సవరించింది. అంతక్రితం ఇదే నివేదిక ఈ వాస్తవ జీడీపీని -6.8 శాతంగా అంచనా కట్టింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం మేర రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో సవరణలు చోటు చేసుకున్నాయి.

* దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 9:51 గంటల సమయంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లు ఎగబాకి 38,981 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 11,502 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.26 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఆసియా మార్కెట్లూ సానుకూలంగా కదలాడుతున్నాయి. మారటోరియం వ్యవధిలో వడ్డీ చెల్లింపులపై నేడు సుప్రీం కోర్టు ఇవ్వనున్న తీర్పుపై మదుపర్లు దృష్టి సారించారు.

* వచ్చే రెండేళ్లలో 12,000 మంది అమెరికన్‌ ఉద్యోగుల నియమకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మంగళవారం వెల్లడించింది. ఐదేళ్లలో అమెరికాలో 25,000 మంది నియామకానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. రెండేళ్లలో 10,000 మంది అమెరికన్ల నియామకాలను చేపట్టాలని 2017లో ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. అనంతరం అమెరికాలో ఏకంగా 13,000 ఉద్యోగాలిచ్చింది. వీటికి అదనంగా తాజాగా వివిధ బాధ్యతల్లో 12,000 మందిని తీసుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అనుభవజ్ఞులైన టెక్నాలజీ వృత్తినిపుణులతో పాటు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి తాజా పట్టభద్రులకు కూడా అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. హెచ్‌1బీ వీసాదారులకు వర్క్‌ వీసాలకు సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వం అనేక నిబంధనలు విధించిన తరుణంలో ఇన్ఫోసిస్‌ ఈ ప్రకటన చేసింది. 2020 జూన్‌ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 2,39,233 మంది ఉద్యోగులున్నారు. గత మూడేళ్లుగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్‌ బాగా దృష్టి సారించిందని, ఈ సంఖ్యను విస్తరిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి ఆర్థికంగా కల్లోలం రేపుతున్న తరుణంలోనూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ రవికుమార్‌ తెలిపారు. కాగా అమెరికాలో 6 ‘టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాల’ను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.

* కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణగ్రహీతలపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాకూడదని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌(ఎంఫిన్‌) సూచించింది. రుణ మారటోరియం వ్యవధి ముగిసిన నేపథ్యంలో వ్యవహరించాల్సిన విధానాలను సూచిస్తూ.. సూక్ష్మ రుణ సంస్థలకు చెందిన ఈ సంఘం మంగళవారం తన సభ్యులకు కొన్ని సూచనలను జారీ చేసింది. ఆదాయాలు తగ్గిపోవడంతో రుణగ్రహీతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారు కాస్త కుదుటపడేదాకా ఓపిక పట్టాలని ఎంఫిన్‌ సీఈఓ అలోక్‌ మిశ్రా పేర్కొన్నారు. మారటోరియాన్ని ఎంపిక చేసుకొని, ఇప్పుడు చెల్లించేందుకు సిద్దపడేవారికి అవసరమైన పత్రాలు, వడ్డీ మొత్తం, రుణ పునర్‌వ్యవస్థీకరణ, రుణ చెల్లింపు వ్యవధి, మొత్తంలో మార్పులు తదితర అంశాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

* బొగ్గును వెలికితీయడం, తరలింపు, శుద్ధి చేసే సాంకేతికత అభివృద్ధి తదితర ప్రాజెక్టుల కోసం 2023-24 నాటికి ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా (సీఐఎల్‌) రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంగళవారం వెల్లడించారు. మంగళవారం సీఐఎల్‌ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన వాటాదార్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2023-24 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గును వెలికితీయడమే లక్ష్యమని వివరించారు. పెట్టుబడుల్లో భాగంగా.. బొగ్గు తరలింపునకు రూ.32,696 కోట్లు, గనుల మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 25,117 కోట్లు, ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 29,461 కోట్లను వెచ్చించేందుకు సీఐఎల్‌ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. అలాగే విస్తరణ, శుద్ధిచేసే టెక్నాలజీలకు గాను రూ.32,199 కోట్లు, సామాజిక వసతులకు రూ. 1,495 కోట్లు, వెలికితీత పనులకు రూ.1,893 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 500 ప్రాజెక్టుల కోసం సీఐఎల్‌ ఈ పెట్టుబడులు పెడుతుందని వివరించారు. మరోవైపు బొగ్గు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సీఐఎల్‌ మొత్తం 15 కొత్త ప్రాజెక్టులను (మైన్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ విధానంలో) చేపట్టేందుకు గుర్తించినట్లు తెలిపారు. కీలక రైల్వే రవాణా వసతుల అభివృద్ధికి రూ.16,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు.