WorldWonders

₹5కోట్లు గెలిచాడు. జీవితం నాశనం అయింది.

₹5కోట్లు గెలిచాడు. జీవితం నాశనం అయింది.

రూ. 5 కోట్లు గెలిచాక జీవితం దారుణంగా తయారైంది: సుశీల్ కుమార్

మోస్ట్ పాపులర్ గేమ్‌షో కౌన్ బనేగా క్రోర్ పతిలో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గురించి దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. కేబీసీ సీజన్ 5లో 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న సుశీల్ కుమార్ తాజాగా తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించిన విషయాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. రూ. 5 కోట్లు గెలిచిన తర్వాత ఎవరి జీవితమైనా ఎంత గొప్పగా ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు. అయితే, సుశీల్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. కేబీసీలో విజేతగా నిలిచి తర్వాత తన జీవితం దారుణంగా తయారైందని సుశీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎదుర్కొన్న కష్టనష్టాల గురించి పూర్తిగా వివరించాడు. 

మందు, సిగరెట్లకు పూర్తిగా అలవాటుపడిపోయానని, మోసగాళ్ల చేతిలో పడి దారుణంగా మోసపోయానని పేర్కొన్నాడు. కొన్ని చెత్త నిర్ణయాలు తన జీవితాన్ని సర్వనాశనం చేశాయని, తన భార్యతో సంబంధాలు దెబ్బతిన్నాయని వివరించాడు. 2015-2016 మధ్య జీవితం ఎంతో కఠినంగా గడిచిందన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. 

కేబీసీలో రూ. 5 కోట్లు గెలిచిన తర్వాత తనను అందరూ ఫంక్షన్లకు పిలిచేవారని, బీహార్‌లో నెలకు 15 రోజులు ఫంక్షన్లకు వెళ్లేవాడనన్నాడు. ఫలితంగా తన చదువు చెట్టెక్కిందన్నాడు. దీనికి తోడు ఇంటర్వ్యూలు, అప్‌డేట్లతో మీడియా ఎప్పుడూ తన వెనక పడేదన్నాడు. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టానని, వాటిలో దారుణంగా నష్టపోయానని పేర్కొన్నాడు. 

ఆ తర్వాత సుశీల్ కుమార్ దానాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రతీ నెల వివిధ కారణాలతో రూ. 50 వేల వరకు దానం చేసేవాడు. ఆ తర్వాత తాను మోసానికి గురవుతున్నట్టు తెలుసుకున్నాడు. సుశీల్ చెడుమార్గం పడుతున్నాడని తెలుసుకున్న భార్య అతడిని హెచ్చరించింది. అతడు పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. చివరికి విడాకులు తీసుకున్నారు. 

తన జీవితంలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయని గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన కొన్ని విద్యార్థి బృందాలతో అతడికి పరిచయమైంది. వారి ద్వారా ప్రపంచం గురించి తెలుసుకున్నాడు. కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. అయితే, ఆ వెంటనే వ్యవసనాలకు కూడా బానిసయ్యాడు. మందు, సిగరెట్లు అలవాటయ్యాయి. వారితో ఎప్పుడు కలిసినా మద్యం, సిగరెట్ తప్పనిసరిగా మారింది. 

సినిమాలంటే పిచ్చితో ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గంటలు గంటలు గడిపేసేవాడు. సినిమాల ప్రభావంతో దర్శకుడిగా మారాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం ముంబైలో వాలిపోయాడు. అయితే, తొలుత టీవీ రంగంలో పనిచేయాలని కొందరు సలహా ఇచ్చారు. ఓ సినిమాకు స్క్రిప్టు రాశాడు. దానిని అమ్మితే రూ. 20 వేలు వచ్చాయి. ఇంట్లో రోజంతా సినిమాలు చూస్తూ గడిపేసేవాడు. సిగరెట్ల పొగతో ఇల్లు నిండిపోయేది. ఈ క్రమంలో ఒకరోజు అతడిలో పరివర్తన కలిగింది. తాను వచ్చింది ఫిల్మ్ మేకర్ కావడానికి కాదని, తనను తాను పారిపోయి ముంబై వచ్చినట్టు గుర్తించాడు. 

ఇకపై మనసు ఏం చెబితే అదే చేయాలని నిర్ణయించుకున్నాడు. అహాన్ని ఎప్పుడూ సంతృప్తి పరచలేమని గుర్తెరిగాడు. ఓ ప్రముఖ వ్యక్తిగా ఉండడం కంటే మంచి మనిషిగా ఉండడం వేల రెట్లు గొప్పదని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే ముంబైలోని ఇంటికి  తిరిగొచ్చాడు. టీచర్‌గా తిరిగి జీవితాన్ని మొదలుపెట్టాడు. 2016లో తన వ్యసనాలను పక్కనపెట్టేసినట్టు సుశీల్ కుమార్ వివరించాడు.