DailyDose

కరోనాకు టీకా అక్కర్లేదు-TNI బులెటిన్

కరోనాకు టీకా అక్కర్లేదు-TNI బులెటిన్

* ప్రపంచమంతా కరోనా వైరస్‌తో విలవిల్లాడుతూ.. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ అవసరం లేకుండానే కరోనా వైరస్‌ దానంతట అదే పోతుందన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యాక్సిన్ లేకుండానే కరోనా దానంతట అదే కాలంతో పాటే పోతుంది. మీలో హెర్డ్ మెంటాలిటీ అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అది పోతుంది’ అని ట్రంప్‌ అన్నారు. మామూలుగా వైద్య నిపుణులు కరోనా వచ్చిన దగ్గరి నుంచి వాడుతున్న పదం హెర్డ్ ఇమ్యూనిటీ. కానీ ట్రంప్‌ వాడిన పదం హెర్డ్ మెంటాలిటీ. హెర్డ్‌ ఇమ్యూనిటీకి బదులు ఆయన హెర్డ్‌ మెంటాలిటీ అన్నారా? ఆయన చెప్పిన దానికి ఇంకేమైనా అర్థం ఉందో ఆయనకే తెలియాలి.

* దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ.దేశ వ్యాప్తంగా 50 లక్షలు దాటినా కోవిడ్ కేసులు.దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 50,20,360 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.గడచిన 24 గంటల్లో 90,123పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,290 మంది మృతి.9, 95, 933 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 39,42,361 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 82,066 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 82.961 మంది బాధితులు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78.53%, మరణాల రేటు 1.63%.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 55,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,273 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,62,844కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 996కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,260 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,31,447కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 22,76,222కి చేరింది.

* కోవిడ్-19 వైరస్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హెచ్చరించింది. సాధారణంగా వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువ ఉండటం వల్ల వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నోవెల్ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మన ఇంట్లో 50ఏళ్లకు పైబడిన వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఇదివరకే జారీ చేసింది. అదే సమయంలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సూచించింది.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు చివర్లో సూచీలు రాణించేందుకు దోహదపడ్డాయి. డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లయితే 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ (స్పుత్నిక్‌-వి)ను భారత్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థకు విక్రయిస్తామని రష్యా పేర్కొనడం మదుపరుల్లో ఆశలు రేపింది. దీంతో రెడ్డీస్‌ షేర్లు రాణించాయి. రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ వంటి షేర్లతో పాటు ఆటో, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించడం వరుసగా మార్కెట్లు రెండో రోజూ లాభాల్లో ముగిశాయి.

* దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిత్యం 90వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దీంతో సెప్టెంబర్‌ 16నాటికి కరోనా కేసుల సంఖ్య 50లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 95వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సెప్టెంబర్‌ ఐదో తేదీన పాజిటివ్‌ కేసుల సంఖ్య 40లక్షలు దాటగా అనంతరం 11రోజుల్లోనే 10లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో తొలి కరోనా కేసు నుంచి మొత్తం లక్ష కేసుల మార్కును చేరడానికి 110రోజులు పట్టింది. అదే 100వ కేసు నుంచి కేవలం 64 రోజుల్లోనే లక్షకు చేరిందంటే దీని వ్యాప్తి వేగం అర్థం చేసుకోవచ్చు.

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 75,013 నమూనాలను పరీక్షించగా 8,835 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,92,760కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 10,845 మంది కోలుకోగా.. 64 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణా 4, తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,06,879 నమూనాలను పరీక్షించారు.

* ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షలు చేయించగా సెప్టెంబరు 9న పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చిందని ఆయన స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని చెప్పారు. తనకు పూర్తి స్థాయిలో కరోనా లక్షణాలు లేవని, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 22తో రెండు వారాల క్వారంటైన్‌ కాలం పూర్తవుతుందని తెలిపారు. తరచూ సీటీ స్కాన్‌ తీయించుకుంటున్నానని.. ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలూ లేవన్నారు. సెప్టెంబరు 21న తన పుట్టినరోజు నేపథ్యంలో చాలా మంది పాత్రికేయులు ఇంటర్వ్యూల కోసం ఫోన్‌ చేస్తున్నారని, క్వారంటైన్‌లో ఉన్నందున లిఫ్ట్‌ చేయడం లేదని వివరించారు. ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నానని చెప్పారు. ఈ కాలాన్ని స్క్రిప్టులు రాయడానికి ఉపయోగిస్తున్నానని చెప్పారు.