DailyDose

దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా-తాజావార్తలు

దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా-తాజావార్తలు

* విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదాపడింది. ఈనెల 18(శుక్రవారం)న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, నిన్న నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటి నుంచి అనుమతిస్తున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

* కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం రాత్రి మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం డిశ్చార్జి చేశారు. సోమవారం నుంచి ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 2న అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఎయిమ్స్‌‌లో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యంతో తిరిగి ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు.

* సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..రాష్ట్ర మంత్రి తలసాని వెంట రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు వెళ్లారు. నిన్న శాసనసభలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణంపై ఇరువురు నేతల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

* భాజపా ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యల్ని అడ్డుపెట్టుకుని ఎంపీ జయా బచ్చన్‌ రాజకీయాలు చేస్తున్నారని ప్రముఖ నటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణం మంగళవారం పార్లమెంటులో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని వారు కూడా మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను జయా బచ్చన్‌ ఖండించారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చవద్దని.. నటుడైన ఓ ఎంపీ పరిశ్రమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ నేపథ్యంలో పలువురు నటీమణులు జయా బచ్చన్‌కు మద్దుతు తెలిపారు. కంగనా రనౌత్‌తో సహా పలువురు నెటిజన్లు ఆమెను వ్యతిరేకించారు.

* సొంతపార్టీ లోక్‌సభ సభ్యుడిపైనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన ఫిర్యాదు అందజేశారు. నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేశ్‌ అసభ్య పదజాలంతో దూషించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై సభాహక్కుల కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

* జీఎస్టీ బకాయిలపై ప్రాంతీయ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెరాసతో పాటు మరో 9 పార్టీల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెరాస ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గాంధీ విగ్రహం సాక్షిగా ధర్నా చేశామన్నారు. కేంద్రం నుంచి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సుమారు రూ.9వేల కోట్ల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయని చెప్పారు. ఈ సమయంలో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి.. రావాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడతామని చెప్పారు. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చామని.. చర్చ కోసం పట్టుబడతామని నామా స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కోరామన్నారు.

* కర్ణాటక భాజపా ఎంపీ అశోక్‌ గస్తీ (55) ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 15 రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున వచ్చిన వార్తలపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్య చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశాయి. భాజపా నేతగా ఉన్న అశోక్‌ గస్తీ ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. అయితే, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అనేకమంది రాజకీయ ప్రముఖులు ట్విటర్‌లో సంతాపాలు కూడా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతున్న మణిపాల్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సుదర్శన్‌ బల్లాల్‌ స్పందించారు. గస్తీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనీ.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో లైఫ్‌ సపోర్టుపై వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్టు స్పష్టంచేశారు.

* తెలంగాణ విలీన దినోత్సవం విషయంలో భాజపా, ఎంఐఎం పార్టీలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌ సంస్థానం విలీనంలోనూ కాంగ్రెస్‌ పార్టీకే సంబంధం ఉందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 17వ తేదీకి, ఆరెండు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పెత్తనం పెరిగిందని విమర్శించారు.

* అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం జగన్‌కు భయం పట్టుకుందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని హైకోర్టుల నుంచి ఈతరహా కేసుల కార్యాచరణ కూడా సుప్రీంకోర్టు సిద్ధం చేయమందని గుర్తు చేశారు. దేశంలో 4వేల కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 2500 కేసులు రాజకీయ నేతలవేనని వివరించారు. వీటిలో 12 ఛార్జ్‌షీట్లు సీబీఐ కోర్టులో జగన్‌పై దాఖలు చేసినవేనని పేర్కొన్నారు.

* విధి నిర్వహణలో ఉన్న ఒక హోంగార్డు వరద నీటిలో చిక్కుకున్న శునకాన్ని కాపాడి మానవత్వాన్ని చాటాడు. మనుషులకు రక్షణ కల్పించడమే తన విధి కాదని ఆపదలో ఉంటే జంతువులను కూడా కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలియజేశాడు ఈ హోంగార్డు. బుధవారం కురిసిన వర్షానికి నాగర్‌కర్నూల్‌ కేసరి సముద్రం చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. పట్టణం వైపున్న అలుగుతో పాటు ఎండబెట్ల వైపు ఉన్న అలుగు కూడా గురువారం ఉద్ధృతంగా పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

* ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుం నిర్ణయిస్తూ ఇటీవల జారీ చేసిన 131 నంబరు జీవోను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీతోపాటు చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, సభ్యులు జగ్గారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద తదితరులు ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై చర్చించారు.

* ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి రథం వెండి సింహాలు చోరీ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఈవో సురేశ్‌బాబు ఫిర్యాదు అందజేశారు. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని..17 నెలల తర్వాత ఇంజినీరింగ్‌ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు గుర్తించామని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన నేపథ్యంలో విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. వెండి సింహాల మాయంపై ఈవో ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తున్నట్లు చెప్పారు.

* భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి రాజ్యసభలో చేసిన ప్రకటనపై పలువురు ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో గస్తీ‌ అంశంపైనే చైనాతో వివాదం నెలకొంది. పెట్రోలింగ్‌ నుంచి ప్రపంచంలో ఏ శక్తీ భారత సైనికులను అడ్డుకోలేదని స్పష్టంచేశారు.

* దేశంలో కరోనా మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.64 శాతంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ మరణాల రేటు ఇదేనని తెలిపారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 78-79 శాతంగా ఉందని కేంద్రమంత్రి చెప్పారు.

* అమెరికాలో టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా కార్యకలాపాలను ఒరాకిల్‌ సంస్థ చేజిక్కించుకోనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్‌.. మెజారిటీ యాజమాన్య హక్కులు చైనా కంపెనీ చేతిలోనే ఉండటం తనకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు.

* కరోనా వ్యాక్సిన్‌పై ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం ఓ వైపు పరిశోధనలు జరుగుతుండగా.. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి వైద్య నిపుణుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగమే యాంటీబాడీ థెరపీ. ఇప్పటికే పలుచోట్ల దీనిని అమలు చేస్తున్నప్పటికీ, అంతగా ప్రయోజనం లేదనే వాదన ఉంది. యాంటీబాడీ థెరపీతో వైరస్‌ తీవ్రత తగ్గించే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.