DailyDose

మీకో దణ్ణం…నేను రాను. నన్ను అడగొద్దు-తాజావార్తలు

Mudragada Refuses To Lead Kapu JAC - Telugu Breaking News

* మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు.

* ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌లో టీడీపీ నేత నారా లోకేష్‌ బాబు అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. తండ్రి శాఖలో ఫైల్‌పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్‌లు భారీ కుంభకోణం చేశారన్నారు. అమరావతిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. టీడీపీ నేతలు, ఓ సామాజికవర్గం వాళ్లే అక్కడ భూములు ఎందుకు కొనగలిగారని ప్రశ్నించారు. అమరావతి చంద్రబాబుకి ఏటీఎం అని ప్రధాని మోదీనే చెప్పారని, అందుకే ప్రధాని మోదీని సీబీఐ విచారణ వేయాలని కోరుతున్నామన్నారు.

* నూత‌న రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర స‌మాచారంతో రావాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రెవెన్యూ రికార్డుల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

* మ‌హారాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు శివసేన నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారును కూల్చేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆ పార్టీ ఆరోపించింది. అధికారుల్లో కొందరు ప్ర‌భుత్వానికి శత్రువులుగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని సామ్నా ప‌త్రిక వేదిక‌గా విమ‌ర్శ‌లు చేసింది. అధికారులు బీజేపీతో కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్రలు చేస్తున్నార‌ని శివసేన మండిపడింది. అధికారులు ఇంకా ఫడ్న‌వీస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న భ్రమల్లో ఉన్నారని, ప్రభుత్వంలోని కీలక శాఖల ఉన్న‌తాధికారుల‌తోపాటు పోలీస్‌ కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల లాంటి కీలకమైన వారి అపాయింట్‌మెంట్లను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తున్న‌ది విమ‌ర్శించింది.

* ఉప్ప‌ల్ ప‌రిధిలోని బీర‌ప్ప‌గ‌డ్డ‌లో నూత‌న గ్రంథాల‌యం నిర్మాణ ప‌నుల‌కు మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జ‌నార్ధ‌న్ రెడ్డి, రాష్ర్ట గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ శ్రీధ‌ర్ పాల్గొన్నారు.

* కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్‌ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆగస్టు18న హాంకాంగ్ ఎయిరిండియా విమానాలను ఆగస్టు 31వరకు సస్పెండ్ చేసింది. ఇది రెండో నిషేధం.

* ఒకానొక సమయంలో తన గురించి వచ్చిన ట్రోలింగ్స్‌ చూసి మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని నటి వితిక అన్నారు. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన వితిక.. పలు ప్రత్యేక వీడియోలతో తరచూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె.. తన జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని నెటిజన్లకు తెలియజేస్తూ సరికొత్త వీడియోను విడుదల చేశారు. గతేడాది తన భర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి వితిక ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సదరు రియాల్టీ షో చూసిన ప్రేక్షకులు ఆమెను నెగటివ్‌గా అర్థం చేసుకుని విపరీతంగా ట్రోల్స్‌ చేశారట. దీంతో తన కుటుంబం కొంతకాలం ఇబ్బందిపడిందని వితిక తెలిపారు.

* దేశ చరిత్రలోనే తొలిసారిగా భారతీయ నేవీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకల్లో ఉండే అత్యాధునిక మల్టీరోల్‌ హెలికాప్టర్లలో సేవలందించేందుకు ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. సబ్‌ లెఫ్టినెంట్‌ త్యాగి, సబ్‌ లెఫ్టినెంట్‌ రితి సింగ్‌లకు భారత నేవీ సోమవారం పోస్టింగ్‌లు జారీ చేసింది. వారిద్దరూ కొచ్చిలోని దక్షిణ నావల్‌ కమాండ్‌ నుంచి నేవీ నిఘా విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. ఇక నుంచి వారు యుద్ధనౌకల్లో ఎంహెచ్‌ 60ఆర్‌ హెలికాప్టర్‌ల బాధ్యతలను తీసుకోనున్నారని.. వాటితో సముద్ర జలాలపై పర్యవేక్షిస్తూ శత్రు దేశాల ఓడల్ని పసిగట్టాల్సి ఉంటుందని నేవీ వెల్లడించింది. ఈ నూతన అధ్యాయం భవిష్యత్తులో మరింత మంది మహిళలు యుద్ధ నౌకల్లో చేరేందుకు మార్గం సుగమం చేస్తుందని నేవీ తెలిపింది.

* నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాలనీలు మునిగిపోతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకి అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు.

* దేశ రైతుల శ్రేయస్సు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయా బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా ఆయన దేశ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్‌లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘ఇంటింటికీ ఫైబర్’‌ సహా పలు ప్రాజెక్టులను మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం దేశ రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

* బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు.

* హైడ్రోజన్‌ ఆధారంగా ప్రయాణించే విమాన తయారీపై పరిశోధనలను ఎయిర్‌బస్‌ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 200 మంది ప్రయాణికులతో 2,000 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించే విమానం డిజైన్లను సిద్ధం చేసింది. దీనిలో హైడ్రోజన్‌ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేసిన గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇటువంటి మొత్తం మూడు డిజైన్లను సిద్ధం చేసింది. 2035 నాటికి విమానాలను ఉద్గార రహితంగా మార్చేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో భాగంగా దీనిని సిద్ధం చేస్తున్నారు.