NRI-NRT

గురజాడపై “టాంటెక్స్” నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు

TANTEX Tribute To Gurajada In Dallas - Telugu Texas NRI NRT News

గురజాడపై “టాంటెక్స్” నెలనెలా తెలుగు వెన్నెల
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ విచ్చేసి “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం మీద ప్రసంగించారు. తెలుగు వెన్నెల నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో సభ సాగింది. సాహితి, సింధూరలు “శివుడు తాండవము సేయునమ్మా” భక్తి గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది. ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ గురజాడ కేవలం వైతాళికుడే కాక, ముందు చూపు గలిగిన గొప్ప తాత్వికుడు అని గుర్తుచేశారు. పీడనకు గురైన స్త్రీ జాతిని మొదటగా జాగృతం చేసిన ఒక యోధుడుగా ఆయనను కీర్తించారు. “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు, పొడుపు కథల పరంపరను యు.నరసింహారెడ్డి, ఉపద్రష్ట సత్యం పద్య సౌగంధం శీర్షికన మల్లిఖార్జున భట్టు విరచిత భాస్కరరామాయణంలోని శార్దూల పద్యాన్ని, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా సెప్టెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను, లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్ గురజాడ వారిని స్మరిస్తూ చేసిన ప్రసంగాలు అలరించాయి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, స్థానిక సాహిత్య ప్రియులు మాధవి రాణి, శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ, శ్రీనివాస్ బసాబత్తిన, ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, పూర్వాధ్యక్షుడు చినసత్యం వీర్నపు, సునిల్ కుమార్, తవ్వా వెంకటయ్య, సుబ్బారాయుడు, బసవ రాజప్ప తదితరులు హాజరయ్యారు.