Editorials

తైవాన్‌పై సైనికదాడికి చైనా సిద్ధం

తైవాన్‌పై సైనికదాడికి చైనా సిద్ధం

తైవాన్‌పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు సమాచారం. డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల్ని మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఫుజియాన్‌, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్‌ ఫోర్స్‌, మెరైన్‌ కార్ప్స్‌ స్థావరాల్ని సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్‌ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పేర్కొంది. తూర్పు, దక్షిణ థియేటర్లలోని క్షిపణి స్థావరాల్ని గత కొన్నేళ్లలో రెండింతలకు పెంచినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తైవాన్‌పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది. ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల్ని సైతం పెంచింది. ఇటీవల డ్రాగన్‌కు చెందిన 40 యుద్ధ విమానాలు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను దాటి వెళ్లాయి. ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బలగాల మోహరింపులు, సైనిక స్థావరాల విస్తరణ, జిన్‌పింగ్‌ ప్రకటనని బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడిచేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

తైవాన్‌పై చైనా దాడికి సిద్ధమవుతున్న అంశాన్ని అమెరికా రక్షణ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. చైనా దండయాత్రకు తైవాన్‌ సిద్ధంగా ఉండాలని శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ సూచించారు. ఇటు భూసరిహద్దులతో పాటు, జలమార్గాల్లోనూ డ్రాగన్‌ సేనల్ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాలతో తైవాన్‌ సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. చైనా-అమెరికా మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో డ్రాగన్‌పై అగ్రరాజ్యం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తైవాన్‌ విషయంలోనూ చైనా వైఖరిని అమెరికా బహిరంగంగానే తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చైనా దాడికి దిగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా డ్రాగన్‌ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తైవాన్‌పై దాడి చేయడం చైనాకు అంత సులభమైన పనేమీ కాదని ఓబ్రయాన్‌ అభిప్రాయపడ్డారు. డ్రాగన్‌ సేనల్ని కదిలించే ముందుకు అమెరికా వైఖరిని కూడా బీజింగ్‌ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా హెచ్చరించారు. ఒకవేళ అమెరికానే కలగజేసుకుంటే చైనా పరిస్థితి ప్రమాదకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. క్షిపణులతో తైవాన్‌ను అణచివేసే సామర్థ్యం చైనాకు ఉన్నప్పటికీ.. దానికి వల్ల ఒరిగేదేంటని ప్రశ్నించారు. తైవాన్‌కు మద్దతుగా ఇటీవల అమెరికా దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తోంది. అలాగే తైవాన్‌ భారీ స్థాయిలో ఆయుధాలు, డ్రోన్ల వంటి అత్యాధుని సామగ్రిని సైతం సమకూరుస్తోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ‘గ్రే జోన్‌ ఆపరేషన్‌’ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. అంటే నేరుగా యుద్ధానికి దిగకుండా లక్షిత దేశాలపై వీలైనంత మేరకు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తారు. చైనా ఈ వ్యూహాన్నే ఎన్నుకున్నట్లు ఓబ్రయాన్‌ అభిప్రాయపడ్డారు.