NRI-NRT

పెళ్లి పేరిట తెనాలి ఎన్నారైని మోసం చేశారు

పెళ్లి పేరిట తెనాలి ఎన్నారైని మోసం చేశారు

పెళ్లి సంబంధం పేరుతో ఎన్‌ఆర్‌ఐకి టోకరా ఇచ్చిందో ముఠా. గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగు చూసిందీ ఘరానా మోసం. బాధితుల కథనం మేరకు తెనాలి చెంచుపేటకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమొనీని ఆశ్రయించగా, 12 రోజుల క్రితం తెనాలిలోని యువకుడి తాతయ్యను మైనేని శ్రీనివాస్‌, దేవి అనే ఇద్దరు సంప్రదించారు. తాము చెన్నైలో ప్రొఫెసర్లమని, తమ కుమార్తె సముద్ర న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోందని, జీతం లక్షా 10 వేల డాలర్లని చెప్పారు. హెచ్‌-1 వీసా కూడా ఉందన్నారు. నాయనమ్మ ఆరోగ్యం సరిగా ఉండటం లేదని, సంక్రాంతి తరువాత పెళ్లి చేసేద్దామని, ఈ నెల 25నే పసుపుకుంకాలు పెట్టుకుందామని నమ్మించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు తమ స్వగ్రామమని, అక్కడ సముద్ర పేరిట 25 ఎకరాల పొలం ఉందని నమ్మించారు. వరుడికి సముద్ర ఫోన్‌ నెంబరు కూడా ఇచ్చి మాట్లాడించారు. ఎంగేజ్‌మెంట్‌కు 7.22లక్షల బంగారు ఆభరణాలు, దుస్తులను తెనాలిలో కొనుగోలు చేయగా, యువకుడు అమెరికా నుంచే ఆన్‌లైన్‌లో ఆయా దుకాణాలకు చెల్లింపులు చేశారు. బుధవారం తమ ఊరు వస్తే అన్నీ మాట్లాడుకుందామని వారు చెప్పడంతో వరుడి తాత, కుటుంబసభ్యులు బుధవారం ఉలవపాడు వె ళ్లారు. వారిచ్చిన నంబరుకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. గ్రామంలో విచారించగా ఆ పేర్లతో ఎవరూ లేరని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.