Agriculture

ఈ ఏడాది చలి విపరీతంగా ఉంటుంది

Weather Dept States Winter Will Be Worse In India

* జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హర్యాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై కోర్ కోల్డ్ వేవ్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
*ఈ సంవత్సరం శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఈసారి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఇప్పటికే దిల్లీలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం 11.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ. అక్టోబరు నెల వరకు చూసుకుంటే.. గత 58ఏళ్లలో, ఈ సంవత్సరంలోనే దిల్లీలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గత నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీలే కావడం విశేషం.
*ఏ రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండవచ్చు?
జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హర్యాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై కోర్ కోల్డ్ వేవ్ (CW) ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల చలి తీవ్రత సాధారణంకంటే ఎక్కువగా ఉంటుంది.
*కారణాలేంటి?
రానున్న మూడు నెలల్లో దేశంలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని IMD చెబుతోంది. ఈ సంవత్సరం ఆగస్టు నుంచే పసిఫిక్ మహాసముద్రం వద్ద ఏర్పడిన బలహీనమైన లానినా (La Nina) పరిస్థితులు మన భూభాగంపై ప్రభావం చూపిస్తున్నాయి. దీని వల్ల వర్షాలు ఎక్కువగా వచ్చాయి. చలికాలంలోనూ దీని ప్రభావంలో శీతల గాలులు వ్యాపించే అవకాశం ఉంది.
*లానినా వల్ల చలిగాలులు
ఈ సంవత్సరం భారత్‌పై లానినా ప్రభావం ఎక్కువగా ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్రా చెబుతున్నారు. ‘బలహీనమైన లా నినా పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీని ప్రభావంతో దేశంలోని ఉత్తర భాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. శీతాకాలం మరింత చల్లగా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. లా నినా.. కోల్డ్ వేవ్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఎల్ నినో పరిస్థితులు దీనికి భిన్నంగా వేడి వాతావరణాన్ని సృష్టిస్తాయి.
*ఎందుకు ఏర్పడతాయి?
లానినా అనేది పసిఫిక్ సముద్ర జలాల్లో ఏర్పడే చల్లని వాతావరణ నమూనా. ఎల్ నినో వల్ల అసాధారణ వేడితో సముద్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ రెండు అంశాలూ మన దేశంలో రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయి. భారతదేశంలో ఎల్ నినో కరువు లేదా బలహీనమైన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది. లా నినా వల్ల రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు వస్తాయి. దీంతో పాటు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. లా నినా వల్ల బంగాళాఖాతంలో తీవ్రమైన తుఫానులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ సంవత్సరం చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయనే భావన సరికాదని మృత్యుంజయ్ చెప్పారు. వాతావరణ మార్పులు అస్థిర వాతావరణానికి దారితీస్తాయని ఆయన వివరించారు.