DailyDose

మళ్ళీ ట్రంపే అధ్యక్షుడు-తాజావార్తలు

Secretary Of State Mike Pompeo Predicts Trump Will Be The Next President

* అమెరికాలో అధికార మార్పిడికి ససేమిరా అంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో బాసటగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పలికారు. రెండో దఫా అధికారం చేపట్టబోతున్న ట్రంప్‌ పాలనా యంత్రాంగానికి అధికార మార్పిడి సజావుగా సాగుతుందని వ్యాఖ్యానించారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికాలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం గమనిస్తోందన్నారు. అన్ని ఓట్లను లెక్కించాల్సిందేనన్నారు. విదేశీ వ్యవహారాల్ని బైడెన్ యంత్రాంగానికి అప్పగిస్తారా లేక జాప్యం చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు 37 రోజులు పట్టిందని పాంపియో గుర్తుచేశారు. అదే తరహాలో ఈసారి కూడా ప్రతి చట్టబద్ధమైన ఓటు లెక్కిస్తారని భావిస్తున్నామన్నారు. చట్టబద్ధంకాని ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దన్నారు. ఓవైపు ఎన్నికల ఫలితాలపై రగడ కొనసాగుతుండగానే.. ఆయన ఏడు రోజుల విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో సుస్థిర శాంతిస్థాపన దిశగా.. ఆయా దేశప్రభుత్వాలతో చర్చలు జరగనున్నాయన్నారు.

* ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పైచేయి సాధించింది. జేడీయూ కన్నా భాజపాకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ సంకీర్ణాల చాణుక్యుడిగా పిలవబడే నీతీశ్‌కే మరోసారి సీఎం పీఠం దక్కడం విశేషం. అయితే, ఈ ఎన్నికల్లో 7లక్షల మందికి పైగా ఓటర్లు ఏ అభ్యర్థి పట్లా ఆసక్తి ప్రదర్శించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 7,06,252 (1.7శాతం) మంది ఓటర్లు ‘నోటా‘ (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) మీట నొక్కడం అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. అలాగే, ఈ ఎన్నికల్లో లండన్‌ నుంచి వచ్చి ప్లూరల్స్‌ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన 28 ఏళ్ల పుష్పమ్‌ ప్రియ చౌధురి ఘోరంగా ఓటమి చవిచూశారు. రెండు స్థానాల నుంచి పోటీచేసిన ఆమె ప్రత్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఒకచోట నోటా కన్నా తక్కువ ఓట్లు రాగా.. మరో స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కలేదు.

* ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇప్పటి వరకు 6,828 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో 1,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.20 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,915కి చేరింది.

* బిహార్‌ 2020 ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్‌ ఆధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. అయినా.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. పార్టీకి పెద్ద దిక్కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అందుబాటులో లేకపోయినా.. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించింది. ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ తండ్రి లాలూ నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. నితీశ్‌పై పదునైన అవినీతి ఆరోపణలు చేస్తూ భవిష్యత్తులో భాజపాను ఎదుర్కోగలననే సందేశం పంపారు.

* ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బొనాంజా కింద ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం తాజాగా మరో శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ ఎఫ్‌ఏక్యూలో పేర్కొంది. అంతేగాక, ఎల్‌టీసీ పథకం వినియోగించకుండా అక్టోబరు 12 తర్వాత కొనుగోలు చేసిన వస్తువులకు కూడా రియంబర్స్‌మెంట్‌ పొందవచ్చని స్పష్టం చేసింది.

* అంతర్జాతీయంగా కొవిడ్‌-19 కేసులు ఇప్పటికే ఐదుకోట్ల మార్కును దాటాయి. ప్రపంచమంతా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తోంది. చైనా ఇప్పటికే తమ దేశంలో టీకా పంపిణీ చేస్తుండగా.. రష్యా మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ వైపు దూసుకుపోతోంది. అసలు కొవిడ్‌ టీకా ఆవిష్కరణ ఒక ఎత్తు కాగా.. దాని సక్రమ పంపిణీ మరో ఎత్తు. కోట్లాది ప్రజలకు అతి శీతల పరిస్థితిలో టీకాలను సరఫరా చేయటం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల ముందున్న పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తల పరిశోధన ఆశాజనకంగా ఉంది.

* కుమురం భీం జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో ఓ యువకుడిపై పెద్దపులి దాడి చేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్ ‌(23) తండ్రితో కలిసి వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా హఠాత్తుగా పులి దాడి చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది. అడవిలో అతడిని తీవ్రంగా గాయపర్చి హతమార్చింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

* జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా రెడ్డివారి పల్లెకు చెందిన ఆర్మీ జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ వేకువజామున ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. వీర జవానును కడసారి చూసేందుకు రెడ్డివారిపల్లెకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిమంది అశ్రునయనాల మధ్య అధికారిక లాంఛనాలతో ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల సమయంలో ప్రవీణ్‌ భార్య రజిత విలపించిన తీరు అక్కడున్నవారికి కంటతడి పెట్టించింది. అంతకుముందు జవాన్‌ ఇంటి నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ప్రవీణ్‌ పార్థివదేహానికి జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, ఆర్డీవో రేణుక, తహసీల్డార్‌ బెన్ను రాజు తదితరులు నివాళులు అర్పించారు.

* భారత్‌-చైనాలు వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. గత వారం చుషూల్‌-మాల్దో పోస్టులో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ బలగాల ఉపసంహరణ కూడా త్వరలో పూర్తికావచ్చని తెలుస్తోంది.