Business

ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న నిస్సాన్-వాణిజ్యం

Nissan Expanding Widly In India-Business News

* బీఎండబ్ల్యూ సరికొత్త ఎక్స్‌5 ఎమ్‌ కాంపిటీషన్‌ స్పోర్ట్‌ వినియోగ వాహనాన్ని (ఎస్‌యూవీ) ఆవిష్కరించింది. ధర రూ.1.95 కోట్లు. కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌గా ఈ కార్లను దిగుమతి చేసుకుని, దేశ వ్యాప్తంగా విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్‌ వీ8 పెట్రోల్‌ ఇంజిన్‌తో, 600 హెచ్‌పీ సామర్థ్యంతో రూపొందింది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ దీని సొంతం. 3.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోవడమే కాకుండా, గంటకు గరిష్ఠంగా 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. వచ్చే నెల 31లోపు ఆన్‌లైన్‌లో (http:hop.bmw.in) కార్లు బుక్‌ చేసుకునే వారికి బీఎండబ్ల్యూ ఎక్స్‌లెన్స్‌ క్లబ్‌, ఇస్ప్రావా లగ్జరీ విల్లాస్‌ సంయుక్తంగా అందిస్తున్న ఆతిథ్య ప్రయోజనం అందుతుందని కంపెనీ పేర్కొంది.

* భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించినా వంటగ్యాస్‌పై సబ్సీడీ కొనసాగుతుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ‘వంటగ్యాస్‌పై రాయితీ అనేది నేరుగా వినియోగదారుల ఖాతాలకే బదిలీ చేస్తున్నాం. మధ్యలో ఏ కంపెనీలు ఉండవు. అందువల్ల చమురు సంస్థ ప్రభుత్వ రంగానికి చెందినదా? లేదా ప్రైవేటుదా? అనేది ఇక్కడ అనవసరం. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా భారత్‌ పెట్రోలియం వినియోగదారులకు ఎల్పీజీ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రదాన్‌ వెల్లడించారు.

* భారత్‌లో నిస్సాన్‌ ఇండియా డీలర్‌షిప్‌లను విస్తరించనున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. దీంతోపాటు సర్వీస్‌ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేస్తామని పేర్కొంది. కొత్తగా 20 విక్రయ కేంద్రాలు, 30 సర్వీస్‌ అవుట్‌లెట్లను ప్రారంభించనుంది. భారత్‌లో నిలదొక్కుకొని స్థిరంగా వృద్ధి సాధించే వ్యూహంలో భాగంగా నిస్సాన్‌ ఈ నిర్ణయం తీసుకొంది.

* అనురాగ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ సంస్థను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎగవేతదారుగా ప్రకటించింది. ఇప్పటికే ఆ సంస్థకు ట్రేడింగ్ హక్కులను కూడా రద్దు చేసింది. దీంతోపాటు బ్రోకరేజి హౌస్‌ మెంబర్‌షిప్‌ను కూడా తొలగించింది. ఎన్‌ఎస్‌ఈ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మెంబర్‌షిప్‌ను తొలిగించిన కొన్నాళ్ల తర్వాత మరో బ్రోకింగ్‌ సంస్థపై కూడా అదే విధమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

* నేటి నుంచి లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ శాఖలు మొత్తం సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ భారతీయ విభాగాల కిందకు వచ్చాయి. దీంతో ఈ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇప్పుడు రూ.25,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవచ్చు.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 119 పాయింట్లు నష్టపోయి 44,139 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 25 పాయింట్లు ఎగబాకి 12,966 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద కొనసాగుతోంది.