Food

ఉలవలు తింటున్నారా?

ఉలవలు గురించి తెలియని వారుండరు. ఉలవలతో కాచుకునే చారుని ఒక్కసారి రుచిచూస్తే జీవితంలో విడిచిపెట్టం. ఉలవచారు అంత మంచి రుచిని కలిగి ఉంటుంది మరి. వీటిని తరచూ తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఐరన్‌, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్‌ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది. కఫం తగ్గుతుంది. రుతు సమయంలో వచ్చే సమస్యల నుంచి స్త్రీలకు ఉపశమనం దొరుకుతురది. ఎక్కిళ్లు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి, దృష్టి మెరుగుపడుతుంది. వీటిని తరచూ తింటుంటే శరీరంలో కొవ్వు కరిగి, అధిక బరువు నుంచి త్వరగా బయటపడతారు. కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు పోసి, కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి, తీసుకుంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. దీంతో పాటు ఆకలిని పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశయంలో తయారయ్యే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా జరుగుతాయి. కళ్లల్లో నీరు కారటం, పుసులు కట్టడం సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం మంచిది. కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలను తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది.