Sports

వన్డేలకు 50ఏళ్లు

వన్డేలకు 50ఏళ్లు

క్రికెట్ అనగానే ఈ తరం అభిమానులకు గుర్తుకొచ్చేది వన్డే, టీ20 మ్యాచ్‌లు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం వన్డే ఫార్మాట్ అంటే ఎవరికీ తెలియదు. వన్డే ఫార్మాట్ పుట్టి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. క్రికెట్‌లో వన్డే ఫార్మాట్ పుట్టుక కూడా విచిత్రంగా జరిగింది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. అయితే వర్షం కారణంగా ఏడో టెస్టు నిలిచిపోయింది. కానీ ఉన్నట్లుండి టెస్టు మ్యాచ్ బదులు 40 ఓవర్ల వన్డే మ్యాచ్ నిర్వహించేందుకు ఇరు జట్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ విషయంపై ఆటగాళ్లకు తెలియకుండానే నిర్ణయం తీసుకున్నాయి. దాంతో మొదటిసారిగా దాదాపు 50 వేల మంది ప్రేక్షకుల ఎదుట తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనతో 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. అయితే ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకుని తొలి అంతర్జాతీయ వన్డేలో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీని తరువాత రెండో వన్డే జరిగేందుకు సుమారు ఏడాది కాలం పట్టింది. 1972లో రెండో వన్డే కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యనే జరిగింది. ఎడ్జ్‌బాష్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను ఓడించి పగ తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే 1973లో వన్డే ప్రపంచకప్ నిర్వహించే విధంగా ఇంగ్లాండ్ ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ మండలి)కి ప్రతిపాదించింది. దీంతో తొలి అంతర్జాతీయ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 1975లో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో వివియన్ రిచర్డ్స్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ గెలుపొందింది.