Business

హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ గిరాకీ-వాణిజ్యం

హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ గిరాకీ-వాణిజ్యం

* గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్‌లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడించింది. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇది అధికంగా ఉందని తెలిపింది. విక్రయాలతో పాటు, నూతన ప్రారంభాలూ అక్టోబరు-డిసెంబరు 2020లో కనిపించాయని పేర్కొంది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులలో ఈ మూడు నగరాల్లోనే 43 శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది. మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపింది. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో అత్యధిక ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభం కాగా.. 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీసు కార్యకలాపాల పరంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, గిరాకీ అధికంగా ఉంది. హైదరాబాద్‌లో ఏడాదిలో 5 శాతం వరకు ధరలు పెరిగాయని పేర్కొంది.

* జనవరి 7న ఎలన్‌ మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘యూజ్‌ సిగ్నల్‌’ అనే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తరహాలో ‘సిగ్నల్‌’ కూడా ఒక సామాజిక మాధ్యమం. దాన్ని వినియోగించాలని కోరుతూ మస్క్‌ ఓ సందేశాన్ని ఉంచారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న మదుపర్లు ‘సిగ్నల్‌ అడ్వాన్స్‌’ అనే పేరు మీదున్న ఓ చిన్న వైద్యపరికరాల తయారీ కంపెనీపై దృష్టి సారించారు. బహుశా దీన్నే మస్క్‌ ప్రమోట్‌ చేస్తున్నారనుకుని ఆ కంపెనీ షేర్లపై పడ్డారు. దీంతో ఆ కంపెనీ షేర్ల విలువ జనవరి 7న ఆరింతలైంది. మూడు రోజుల్లో అమాంతం 5,100శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ 390మిలియన్‌ డాలర్లకు చేరింది. మస్క్‌ ట్వీట్‌పై గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. శుక్రవారం సిగ్నల్‌ అడ్వాన్స్‌ షేర్లు 885శాతం ర్యాలీ అయ్యాయి.

* బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అత్యంత ప్రాచుర్యం పొందిన, ఇష్ట‌ప‌డే పెట్టుబ‌డి సాధ‌నాల్లో ఒక‌టి. ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు, పెన్ష‌న‌ర్లు న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డి సాధ‌నం కాబ‌ట్టి బ్యాంక్ ఎఫ్‌డీల‌నే ఆశ్ర‌యిస్తారు.దేశంలో ప్ర‌ముఖ, అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్ల‌ను స‌వ‌రించింది. ఎఫ్‌డీల‌ను ట‌ర్మ్ డిపాజిట్లు అని కూడా అంటారు.8 జ‌న‌వ‌రి 2021 నుండి సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ. 2 కోట్లు, ఇంత‌క‌న్నా త‌క్కువ డిపాజిట్ల‌కు ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.7 రోజుల నుండి 45 రోజుల వ‌ర‌కు – 2.9%.46 రోజుల నుండి 179 రోజుల వ‌ర‌కు – 3.9%.180 రోజుల నుండి 210 రోజుల వ‌ర‌కు – 4.4%.211 రోజుల నుండి 1 సంవ‌త్స‌రం క‌న్నా త‌క్కువ – 4.4%.1 సంవ‌త్స‌రం నుండి 2 సంవ‌త్స‌రంల క‌న్నా త‌క్కువ – 5%.2 సంవ‌త్స‌రాల నుండి 3 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ – 5.1%.3 సంవ‌త్స‌రాల నుండి 5 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ – 5.3%.5 సంవ‌త్స‌రాలు మ‌రియు 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు – 5.4%.ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బిపిఎస్ వ‌డ్డీ రేటును అందిస్తుంది. తాజా వ‌డ్డీ రేట్ల స‌వ‌ర‌ణ త‌ర్వాత సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల‌లో మెచ్యూరిటీ చెందుతున్న ఎఫ్‌డీల‌పై 3.4% నుండి 6.2% వ‌ర‌కు వ‌డ్డీని పొందుతారు.

* దేశీయ మార్కెట్లు తాజాగా మరోసారి జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం ఊగిసలాట మధ్య మొదలైన సూచీలు చివరకు లాభాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 248 పాయింట్లు లాభపడి 49,517 వద్ద ముగియగా, 78 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,563 వద్ద స్థిరపడింది.

* జనవరి 10 అర్ధరాత్రి వరకు 31 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలు చేశారు. వీటిలో దాదాపు 2 లక్షల ఐటిఆర్‌లను చివరి గంటలో దాఖలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు (10 జనవరి 2021) 17,97,625 ఐటీఆర్‌లు దాఖలు చేయగా, సాయంత్రం 5-6 గంటల మధ్య 2,39,013 రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయ‌ పన్ను శాఖ తెలిపింది. ఐటిఆర్ దాఖలు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం జనవరి 10 వరకు, కంపెనీలకు ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.