Business

రైతులకు RBI శుభవార్త-వాణిజ్యం

* సహకార బ్యాంకుల పనితీరును ప్రక్షాళన చేసేందుకు రిజర్వుబ్యాంకు(ఆర్‌బీఐ) కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్‌ 1) నుంచి కొత్త ఆదేశాలను అమల్లోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటికే గత సెప్టెంబరు ఒకటి నుంచి పట్టణాలు, నగరాల్లోని అర్బన్‌ సహకార బ్యాంకుల నియంత్రణ బాధ్యతను ఆర్‌బీఐ తీసుకుంది. రైతులకు, వ్యవసాయానికి సేవలందించే గ్రామీణ సహకార బ్యాంకులను సంస్కరించాలని నిర్ణయించింది. కేంద్రం తెచ్చిన బ్యాంకుల సంస్కరణల బిల్లు ప్రకారం సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల రిజర్వుబ్యాంకు తెలిపింది. కేంద్రం కూడా ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయ ప్రయివేటు రంగ అతిపెద్ద బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికరలాభం 18.09శాతం పెరిగి రూ. 8,758.29కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 7,416.68కోట్లుగా ఉంది.

* వచ్చే రెండు త్రైమాసికాల్లో (4-6 నెలల్లో) 20,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఆర్డర్ల రాక గణనీయంగా పెరగడం, డిజిటల్‌ సేవలను అందిపుచ్చుకోవడం వేగవంతమైన నేపథ్యంలో అవసరాలకు తగ్గట్లుగా సిబ్బందిని పెంచుకోవాలని కంపెనీ భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇందులో 15 శాతం ఆన్‌షోర్‌ నియామకాలు కాగా.. మిగిలినవి ఆఫ్‌షోర్‌ నియామకాలు..ఫ్రెషర్స్‌తో పాటు నైపుణ్య అనుభవం ఉన్న వాళ్లను నియమించుకోనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఇక అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలను కంపెనీ ప్రకటించింది. నికర లాభంలో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసింది. 2019లో ఇదే కాలంలో నికర లాభం రూ.3,037 కోట్లు కాగా.. సమీక్షా త్రైమాసికంలో రూ.3,982 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా రూ.18,135 కోట్ల నుంచి 6.4 శాతం అధికమై రూ.19,302 కోట్లకు చేరింది. డిజిటల్‌, ఉత్పత్తుల విభాగంలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో మరిన్ని ఆర్డర్లు సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన (జులై-సెప్టెంబరుతో పోలిస్తే) స్థిర కరెన్సీ ప్రకారం.. హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆదాయం 3.5 శాతం పెరిగింది. కంపెనీ స్వీయ అంచనా అయిన 1.5-2.5 శాతం కంటే కూడా ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2021 జవనరి- మార్చి త్రైమాసికానికి ఆదాయ వృద్ధి అంచనాను 2-3 శాతానికి (డీడబ్ల్యూఎస్‌ సంస్థ ఆదాయంతో కలుపుకొని) సవరించింది. ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సొల్యూషన్ల సంస్థ డీడబ్ల్యూఎస్‌ను హెచ్‌సీఎల్‌ టెక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

* భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ఎగుమతుల పరంగా మరో కీలక అడుగు వేసింది. బ్రిటిష్‌ సైన్యంతోపాటూ ప్రపంచ రక్షణ దళాలు వినియోగిస్తున్న స్టార్‌స్ట్రీక్‌ క్షిపణి వ్యవస్థ ఉత్పత్తిలో భాగస్వామిగా మారింది. సాయుధ హెలికాప్టర్లతో పాటు గగనతల లక్ష్యం ఏదైనా చేధించే సామర్థ్యం కల్గిన అత్యంత వేగవంతమైన క్షిపణి ఇది. ఈ క్షిపణిని యూకేకు చెందిన థెలెస్‌ సంస్థతో కలిసి హైదరాబాద్‌ యూనిట్లో ఉత్పత్తి చేసి యూకే, ఇతర దేశాలకూ ఎగుమతి చేసేలా బీడీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌, బ్రిటిష్‌ ప్రభుత్వాల మద్దతుతో ఈ మేరకు బృంద ఒప్పందంపై సంతకం చేసినట్లు బీడీఎల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
రక్షణ ఎగుమతులతో ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న బీడీఎల్‌కు తాజా ఒప్పందం ఊతమిస్తుంది. స్టార్‌స్ట్రీక్‌ క్షిపణి గ్లోబల్‌ సప్లై చైన్లో బీడీఎల్‌ భాగం అయ్యేందుకు అవకాశాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో కొత్త దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుంది. ఈ సాంకేతికత బదిలీతో భారత్‌లో తయారీకి మార్గం సుగమం అయ్యింది. 60 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి భారత్‌ రక్షణ దళాలకు ఈ క్షిపణిని అందించవచ్చు. భారత్‌, యూకే మధ్య పారిశ్రామిక సహకారానికి అవకాశం కల్పిస్తుంది.

* భారత్‌లో ‘స్పుత్నిక్‌ వి’ టీకా మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతులు ఇచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. దేశంలో 1500 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. రెండో దశ క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన డేటాను డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు(డీఎస్‌ఎమ్‌బీ) ఈ వారం మొదట్లో సమీక్షించింది. మూడో దశకు సిఫారసు చేసింది. భద్రతపరంగా ఎటువంటి ప్రతికూలతలు కనిపించలేదని.. ప్రాథమికంగా అన్ని ప్రమాణాలను ఈ పరీక్షల్లో పాటించినట్లు తన నివేదికలో డీఎస్‌ఎమ్‌బీ పేర్కొంది. ‘టీకా పరీక్షల్లో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఈ నెలలోనే మూడో దశ పరీక్షలను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. భారత ప్రజలకు అత్యంత భద్రమైన, సమర్థవంతమైన టీకాను తీసుకురావడానికి మా వేగవంతమైన చర్యలను కొనసాగిస్తామ’ని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. సెప్టెంబరు 2020లో ఈ కంపెనీ భారత్‌లో పంపిణీ హక్కుల నిమిత్తం స్పుత్నిక్‌ వి టీకాకు క్లినికల్‌ పరీక్షలను నిర్వహించడానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

* ల్యాండ్‌లైన్‌ నుంచి మీరు ఎవరి మొబైల్‌ ఫోనుకైనా కాల్‌ చేస్తున్నారా? అయితే ఫోను నంబరు డయల్‌ చేసేటప్పుడు ఆ నంబరుకు ముందు తప్పకుండా సున్నా చేర్చండి. టెలికాం విభాగం ఆదేశాలను అనుసరించి ఈ నెల 15వ తేదీ నుంచి మొబైల్‌ నంబరుకు సున్నా చేర్చడాన్ని తప్పనిసరి చేస్తూ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు కంపెనీలు సమాచారం ఇస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే సమాచారం ఇవ్వడాన్ని ప్రారంభించగా.. రిలయన్స్‌ జియో సంక్షిప్త సందేశాలను (ఎస్‌ఎమ్‌ఎస్‌లు) పంపిస్తోంది.