Politics

ఎంపీల సబ్సిడీలపై కోత-తాజావార్తలు

ఎంపీల సబ్సిడీలపై కోత-తాజావార్తలు

* పార్లమెంట్ క్యాంటీన్ లో ప్రస్తుతం ఎంపీ లకు వున్న సబ్సిడీ భోజన సదుపాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.

* కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లుకాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటార్ల కొనుగోళ్ల విషయంలో 5,662 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్యాకేజీ 6,8,10,11 లలో పంపులు మోటార్లకు భేళ్ సప్లై చేసిన ధర 16వందల 86 కోట్లు మాత్రమేనని అన్నారు.

* కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. చలో రాజ్ భవన్ కు బయలు దేరిన భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని భట్టి గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్రస్థాయిల అన్యాయం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని భట్టి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయత్వం చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నాయకులందరినీ పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసు సమయంలో భట్టి విక్రమార్క రోడ్డుపై బైఠాయించి గట్టిగా నినాదాలు చేశారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎల్పీ కార్యాలయం నుంచి భట్టి విక్రమార్క ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు సంఘటితంగా లుంబినీ పార్క్ వద్దకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భట్టిని కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడుగడుగునా పోలీసులును మొహరించింది.

* ట్యాంక్‌బండ్‌పై రియల్‌ హీరో.ప్రముఖ సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించారు.ట్యాంక్‌ బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్యలు చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను కలిసి సోనూ సూద్‌ అభినందించారు. ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన నగదుతో శివ ఇటీవల ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసి ‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌’ అని పేరు పెట్టాడు. ఈ వాహన ప్రారంభోత్సవానికి రియల్‌ హీరో సోనూసూద్‌ను ఆహ్వానించాలని నిర్ణయించాడు.శివ కోరిక మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన సోనూసూద్‌ ట్యాంక్‌బండ్‌ వద్దకు వెళ్లాడు. అక్కడున్న అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అంబులెన్స్‌ సేవలను ప్రారంభించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

* జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశమవుతాయని వెల్లడించారు. సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లలో సమావేశాలు కొనసాగుతాయని ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని చెప్పారు.

* కాళేశ్వరం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వకుండానే ఇస్తున్నట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం సందర్శన నేపథ్యంలో బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో కేవలం 17.50 లక్షల ఎకరాలే చూపించిన రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరందిస్తున్నట్లు చెబుతూ మోసం చేస్తోందన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అడిగిన డీపీఆర్‌లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని.. ప్రాజెక్టుకు సంబంధించి మూడో టీఎంసీ డీపీఆర్‌ ఇస్తే సీఎం బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు.

* కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌ నుంచి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదలయ్యారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఉమాను పోలీసులు అరెస్ట్‌ చేసి పమిడిముక్కల స్టేషన్‌కు తరలించారు. విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కొడాలి నానిపై విమర్శలు చేశారు. కొడాలి నానికి చదువుతోపాటు సంస్కారం కూడా లేదని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

* భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఈ కేసులు నమోదు కానప్పటికీ.. మంగళవారం కొత్తగా 25 కొత్త రకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన మొత్తం యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 141కు చేరింది. దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావడం, కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జనంలో బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు పెరగడం కలవరం రేపుతోంది.

* వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ సారథ్యంలో 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయాలతో ఆసీస్‌ సిరీస్‌కు దూరమైన ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు.

* రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుకొనేలా ఐఆర్‌సీటీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికులకు రెడీ-టు-ఈట్‌ మీల్స్‌ అందించేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ ఇప్పటికే హల్దీరామ్స్, ఐటీసీ, ఎంటీఆర్‌, వాఘ్‌బక్రి వంటి ప్రముఖ ఆహార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై కేంద్రం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

* ఆస్ట్రేలియాపై భారత్‌ చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆసీస్‌ను మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్‌ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

* ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ సారి ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 5 నుంచి 10శాతం వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు జాబితాలో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు వంటి దాదాపు 50 రకాల వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీటిపై చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకొంటున్నారు.

* మెగా హీరోలు పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌ చిత్రం త్వరలో పట్టాలెక్కబోతుందా? అదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా.. ఒక ప్రముఖ నిర్మాత ఇదే పనిలో ఉన్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోలు కలిసి నటిస్తున్న సినిమాలు బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్‌ యువహీరోలందరితో కలిసి వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు.

* దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల కంటే ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,54,049 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, ప్రస్తుతం దేశంలో 2,00,528 క్రియాశీల కేసులున్నట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరగడంతో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గటం వల్ల గణాంకాలు త్వరగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 2,23,669 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు.

* వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో ఇటీవల చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన ఈ మార్పులు ఆమోదయోగ్యమైనవి కాదని తెలిపింది. ఈ మేరకు వాట్సాప్‌ సీఈవోకు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రిత్వశాఖ మంగళవారం ఘాటు లేఖ రాసింది. వాట్సాప్‌కు ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారని గుర్తుచేసింది. అలాగే, ఆ సంస్థ సర్వీసులకు అతి పెద్ద మార్కెట్‌ స్థావరంగా భారత్‌ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ ప్రతిపాదించిన ప్రైవసీ పాలసీలో దేశ పౌరుల్లో వ్యక్తిగత గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నట్టు తెలిపింది. సమాచార గోప్యత, ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ, డేటా సెక్యూరిటీకి సంబంధించి రూపొందించిన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది.

* తెరాస ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని ప్రముఖ సినీనటి, భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. విచ్చల విడిగా దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ నాగోల్‌లో భాజపా తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ‘‘ప్రజలు కోరుకున్నది ఇలాంటి తెలంగాణ కాదు. నా తెలంగాణ ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. నా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలన్నా.. అభివృద్ధి తెలంగాణ కావాలన్నా మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధి, ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన భాజపాతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని విజయశాంతి చెప్పారు.