Business

తిరిగి వచ్చిన జాక్ మా-వాణిజ్యం

తిరిగి వచ్చిన జాక్ మా-వాణిజ్యం

* చైనా పాలకుల ఆగ్రహానికి గురై గత కొన్ని నెలలుగా బయటి ప్రపంచానికి కనిపించని ఇ-కామర్స్‌ దిగ్గజం, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. బుధవారం గ్రామీణ ఉపాధ్యాయులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్‌ మా పాల్గొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ పత్రిక చీఫ్‌ రిపోర్టర్‌ కింగ్‌కింగ్ చెన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘జాక్‌ మా అదృశ్యమవలేదు. బుధవారం ఉదయం 100 మంది గ్రామీణ టీచర్లతో మా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ‘కొవిడ్‌ అంతమైన తర్వాత మనమంతా మళ్లీ కలుద్దాం’ అని ఆయన టీచర్లకు చెప్పారు’’ అని రాసుకొచ్చారు. ఇదే వీడియోను గ్లోబల్‌ టైమ్స్‌ కూడా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

* కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో పింఛను మొత్తాన్ని కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి చేర్చింది. దీంతో 60 నుంచి 80 ఏళ్ల మధ్యలోని సీనియర్‌ సిటిజన్ల ఆదాయం 3 లక్షలు దాటితే.. అదే 80 ఏళ్లకు పైబడిన వారి ఆదాయం రూ.5లక్షలు మించితే చట్టప్రకారం పన్ను విధించేవారు. ఆ బడ్జెట్‌ సమయంలో ఆదాయాలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైన సవాలు. ఎందుకంటే అప్పటికే కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం పూర్తిగా కుదురుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించడం.. లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజల ఆదాయ వనరులు గణనీయంగా పడిపోయాయి.

* బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పుత్తడి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. బుధవారం రూ.347లు పెరగడంతో దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల పసిడి ధర రూ.48,758గా పలికింది. అటు వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తాజాగా రూ.606లు పెరగడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,814 పలికింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రకారం.. ప్రపంచంలో విలువైన లోహాల ధరల్లో పెరుగుదలే ఇందుకు కారణం. ఇకపోతే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,854 డాలర్లు, ఔన్సు వెండి ధర 25.28 డాలర్లుగా ఉంది.

* కొవిడ్‌ కారణంగా బ్యాంకుల్లో ఎన్‌పీఏలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని పలు నివేదికలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటికే తీవ్రమైన మొండిబకాయిలతో అవస్థలు పడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది నిజంగా పిడుగుపాటే. దీంతో మోదీ సర్కారు ఈ సారి వీటికి అండగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు బలహీనపడితే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే వ్యవసాయ రంగం వంటి వాటికి రుణాలను పీఎస్‌బీలే అధికంగా సమకూరుస్తాయి. ఇది దేశ ప్రయోజనాలకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ బ్యాంకుల్లోకి మూలధనం చొప్పించే అవకాశం ఉంది.

* ప్రభుత్వం పల్లెల్లో రోడ్లపై దృష్టిపెడితే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ సహజంగానే పెరుగుతుందని అసోచామ్‌ (ది అసోసియేటెడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) పేర్కొంది. అంతేకాదు జీఎస్టీ రేట్ల సవరణ, విద్య,వైద్యంపై వ్యయాల్ని పెంచడం వంటి పలు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. వచ్చే బడ్జెట్‌లో ద్రవ్యలోటును నిస్పంకోచంగా పక్కనపెట్టి తయారు చేయాలని పేర్కొంది. భారత్‌లో వ్యయాలను పెంచడానికి, ఎగుమతులను పెంచడానికి రవాణ రంగం ప్రధానంగా ఉపయోగపడుతుందని ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, అసోచామ్‌ అధ్యక్షుడు వినీత్‌ అగర్వాల్‌ తెలిపారు.

* వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి. కొనుగోళ్ల అండతో కొత్త రికార్డులను నెలకొల్పాయి. అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు కాబోయే ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ ప్రకటనతో ఆసియా మార్కెట్లు రికార్డు స్థాయిల గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇది దేశీయ సూచీలకు కూడా కలిసొచ్చింది. దీనికి తోడు ఐటీ, ఫార్మా రంగాలలో వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలను మరింత ముందుకు నడిపించాయి. దీంతో నేడు సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు ఎగబాకి 50వేల మైలురాయికి చేరువగా.. నిఫ్టీ 14,600 పైన స్టిరపడింది.