Politics

పట్టాభిపై పక్కా ప్రణాళికతో దాడి

Attack On TDP Leader In Vijayawada Was Planned

మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది. ప్రముఖులు ఉండే అంబేడ్కర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో పట్టాభిపై విచక్షణరహితంగా దాడి చేసిన దుండగులు నిమిషాల్లో పరారయ్యారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తన ఇంటినుంచి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి కారులో బయలుదేరారు. మలుపు తిరిగాక కొద్దిదూరంలో స్పీడ్‌బ్రేకర్‌ ఉండటంతో వాహన వేగం తగ్గింది. అక్కడే కాచుకుని ఉన్న దుండగులు ఒక్కసారిగా దాడిచేశారు. తొలుత ముందు అద్దంపై రాళ్లు విసిరారు. కారులో ఉన్న పట్టాభి తేరుకునేలోగానే ఆరుగురు వచ్చి కారును చుట్టుముట్టి దాడిచేశారు. కారు తలుపు లాగి, పట్టాభిని ఇష్టారాజ్యంగా కొట్టారు. ఈ దాడిలో పట్టాభికి ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, తొడ భాగంలో దెబ్బలు తగిలాయి. కారు అద్దాలు పగిలి తలపై గుచ్చుకున్నాయి. డ్రైవర్‌ మురళికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెద్దగా అరిచేసరికి దుండగులు పారిపోయారు. అనంతరం డ్రైవర్‌ కారును ఇంటికి తీసుకొచ్చారు. షాక్‌లో ఉన్న పట్టాభి ఇంటికి వచ్చి.. నొప్పులు తాళలేక ఆవరణలోని మంచంపైనే పడుకున్నారు. నగర సెంట్రల్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పటమట సీఐ సురేష్‌రెడ్డి, మాచవరం సీఐ వినయ్‌మోహన్‌ తదితరులు ఘటనా స్థలానికి వచ్చారు. ధ్వంసమైన కారు, ఘటనాస్థలంలో దుండగులు వాడిన కర్రలు, పెద్ద రాళ్లను క్లూస్‌ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.