DailyDose

కూతురు కావాలంటే డీజిల్ పోయించమన్న పోలీసులు-నేరవార్తలు

Crime News - Lucknow Police Demands Fuel To Search For Missing Girl

* కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను వెతికే విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై ఓ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతుర్ని వెతకాలంటే..పోలీసులు తమ వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారంటూ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

* ఆక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఆటో పట్టుకుని మద్యంను స్వాధీనం చేసుకుని జిల్లా యస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిణీ మాలిక్ గార్గ్ సమక్షంలో కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన డి.యస్పీ నాగేశ్వర రెడ్డి సీ.ఐ సతీష్

* హైదరాబాద్‌ శివారు గుర్రంగూడలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్‌ కాలనీకి చెందిన వివాహితపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాహుల్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో రాహుల్‌పై వివాహిత వేధింపుల కేసు పెట్టింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు అప్పట్లో నిర్భయ కేసు నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపారు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది. రూ.54 లక్షల విలువైన విదేశీ నగదును కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు వద్ద ఈ డబ్బును అధికారులు గుర్తించారు. ఇక్కడ నుంచి నగదును దుబాయ్‌ తీసుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.

* ఆన్‌లైన్‌ మోసగాడిని సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు రిమాండుకు తరలించారు. నిందితుడిది రాజస్థాన్‌ రాష్ట్రం కావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారం రోజులు అక్కడే మకాం వేసి అదుపులోకి తీసుకుని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ తెలిపిన వివరాలు.. 2020 సంవత్సరం సెప్టెంబరు నెలలో నూర్జహాన్‌ బేగం ఖాతా నుంచి ఆమె ప్రమేయం లేకుండానే రూ.4.47 లక్షలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ సైదులు పరిశోధన బాధ్యతలను ఎస్‌ఐ రాజేశ్‌కు అప్పగించగా సాంకేతికతతో బాధితురాలి డబ్బు పలు బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. గూగుల్‌/ఫోన్‌ పే (యూపీఐ) అనుబంధంగా ఏ బ్యాంకుకు సొమ్ము చేరిందనేది తెలుసుకున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఓ బ్యాంకులో సదరు నిందితుల ఖాతాలు ఉన్నట్లు గుర్తించి వారి జాడను తెలుసుకునేందుకు సీసీఎస్‌ సీఐ నరసింహారావు, ఎస్‌ఐ రాజేశ్‌, ఐడీ పార్టీ సిబ్బంది రాంజీ, రాము, గణేశ్‌ ప్రత్యేక బృందంగా ఏర్పడి అక్కడికి జనవరి 25న వెళ్లారు. వారం రోజులు అక్కడే మకాం వేసి రాజస్థాన్‌ రాష్ట్రంలోని తెలియన్‌ మొహిల్ల గ్రామానికి చెందిన రవిశంకర్‌ భార్గవ్‌ను నిందితుడిగా తేల్చారు. అక్కడి కోర్టు అనుమతితో అతన్ని సిద్దిపేటకు తీసుకువచ్చారు. దర్యాప్తులో నిందితుడు, మరికొంతమందితో కలిసి జాతకాలు చెబుతామంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల ద్వారా ప్రచారం చేస్తూ అమాయకులను ఆకర్షిస్తున్నట్లుగా తేలింది. అలా మోసం చేసి పేటీఎం, గూగుల్‌ పే ద్వారా నగదును ఖాతాల్లో వేయించుకుంటున్నారు. నూర్జహాన్‌ బేగం కుటుంబానికి జాతకం చెప్పేందుకు పలు దఫాలు బాధితురాలిని ఏమార్చి నగదు రాబట్టినట్లు..’ తెలిపాడు. ఈ కేసులో రవిశంకర్‌ భార్గవ్‌ను అరెస్టు చేయగా మరో నిందితుడిని గుర్తించామని, సంబంధం ఉన్న వారందరినీ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ప్రత్యేక బృందాన్ని అభినందించడంతో పాటు త్వరలో పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ చేతులమీదుగా రివార్డులు అందజేస్తామని తెలిపారు. మాయగాళ్ల ఉచ్చులోపడి ఖాతా, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.