Business

ఎంత పని జరిగింది జాక్ మా!-వాణిజ్యం

ఎంత పని జరిగింది జాక్ మా!-వాణిజ్యం

* అనవసరంగా నోరుజారి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా. ఇప్పటికే ఆయన కంపెనీలపై డ్రాగన్‌ గట్టి నిఘాపెట్టగా….తాజాగా ఆయనను టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా పక్కనబెట్టేశారు. చైనా అధికారిక మీడియా సంస్థ షిన్జువా న్యూస్‌ ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీ న్యూస్‌ పత్రిక మంగళవారం తమ దేశ టెక్‌ దిగ్గజాలపై ఓ కథనం ప్రచురించింది. అయితే ఇందులో జాక్‌ మా పేరు లేదు. అదే సమయంలో అలీబాబా ప్రత్యర్థి సంస్థ అయిన టెన్సెంట్‌ సీఈవో పోనీ మా పై మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. సాంకేతికతలో పోనీ మా చరిత్ర తిరగరాస్తున్నారంటూ షాంఘై సెక్యూరిటీస్‌ రాసుకొచ్చింది. జాబితాలో బీవైడీ కో. ఛైర్మన్‌ వాంగ్‌ చువాన్‌ఫు, షావోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్‌, హువావే అధినేత రెన్‌ జెంగ్‌ఫెయ్‌ తదితర దిగ్గజ వ్యాపారవేత్తల పేర్లున్నాయి.

* దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో బడ్జెట్‌ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 9.43కు సెన్సెక్స్‌ 1,311 పాయింట్లు పెరిగి 49,911 వద్ద, నిఫ్టీ 381 పాయింట్లు పెరిగి14,662 వద్ద ట్రేడవుతున్నాయి. ఫినోలెక్‌ ఇండస్ట్రీ, ఐఐఎఫ్‌ఎల్‌ ఫినాన్స్‌, ఎంఎస్‌టీసీ, చోళమండలం ఫినాన్స్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా….నూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌, హెచ్‌ఈజీ, ఫిలిప్స్‌ కార్బన్‌, మంగళూరు రిఫైన్‌, కెన్నామెటల్‌ ఇండియా వంటి సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ నేడు 50వేల మార్కును కూడా మరోసారి దాటింది.

* బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం పసిడి ధర రూ. 480 తగ్గడంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పుత్తడి రూ. 47,702 పలికింది. క్రితం సెషన్‌ ముగింపు సమయానికి ఈ ధర రూ. 48,182గా ఉంది. కాగా.. సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఇక వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. రూ.3,097 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.70,122కు పడిపోయింది.

* దలాల్‌ స్ట్రీట్‌లో బడ్జెట్‌ సంబరాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలతో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు…మంగళవారం కూడా అదే జోరు ప్రదర్శించాయి. ఆటో, బ్యాంకింగ్‌ షేర్ల అండతో భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ దాదాపు 1200 పాయింట్లు ఎగబాకగా….జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 14,600 మార్క్‌ దాటింది.

* ఒత్తిడికి గురైన బ్యాంకుల డిపాజిటర్లు తమ నిధులను పొందటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చ‌ర్య‌ల కోసం వేచి చూడాల్సిన అవ‌స‌రం లేకుండా ముందే తీసుకోవ‌చ్చు. బడ్జెట్ 2021, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ యాక్ట్, 1961, (డిఐసిజిసి యాక్ట్)ను సవరించాలని ప్ర‌తిపాదించింది. ఒక బ్యాంకు డిపాజిట‌ర్ల ఇవ్వాల్సిన‌ బాధ్యతలను నెరవేర్చలేకపోతే వారికి నిధులు పొందటానికి వీలు కల్పించేలా ఈ స‌వ‌ర‌ణ ఉంటుంద‌ది.