Politics

ఢిల్లీ పోలీసులకు స్టీల్ లాఠీలు-తాజావార్తలు

ఢిల్లీ పోలీసులకు స్టీల్ లాఠీలు-తాజావార్తలు

* పోలీసులు లోహ లాఠీలు, తొడుగులు ధరించి ఉన్న చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది దిల్లీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో..వాటి వాడకానికి సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇటీవల రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పాటు..ఈ ఘటనలో కత్తులు కూడా వెలుగుచూశాయి. అలాగే కత్తి దాడిలో ఓ పోలీసు గాయపడ్డారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు దేశ రాజధానిలోని ఓ ప్రాంతానికి చెందిన పోలీసులు ఈ సొంత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు స్టీల్ లాఠీలిచ్చే ఆలోచన ఏదీ లేదు అని దిల్లీ పోలీసు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

* దేశవ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020 సెప్టెంబర్‌ నాటికి 63 జిల్లాల్లో రక్తనిధి కేంద్రాలు లేవని తెలిపింది. దేశంలోని అన్ని జిల్లాల్లో రక్తనిధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వనీ చౌబే రాజ్యసభలో సమాధానం చెప్పారు. ప్రజారోగ్యం రాష్ట్రాలకు చెందిన అంశమని, వారి అవసరాలకనుగుణంగా రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత అన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి జాతీయ ఆరోగ్యమిషన్‌ కింద సహకరిస్తున్నట్టు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. 63 జిల్లాల్లో రక్తనిధి కేంద్రాలు లేవని, వీటిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో 14 జిల్లాలు ఉండగా.. అసోం, బిహార్‌లో ఐదు చొప్పున, మణిపూర్‌లో 12, మేఘాలయాలో 7, నాగాలాండ్‌లో 9 జిల్లాల్లో బ్లడ్‌ బ్యాంకులు లేవని వివరించారు. దేశవ్యాప్తంగా 3321 లైసెన్స్‌ పొందిన బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయని, 2019-20లో 1.27 కోట్ల యూనిట్ రక్తాన్ని సేకరించాయన్నారు.

* ఏపీ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు. సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,323 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

* ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి కోటబొమ్మాళి కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది. ఈ ఉదయం నిమ్మాడలో ఆయన్ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి కరోనా సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోటబొమ్మాళి సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 15 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో అచ్చెన్నాయుడును శ్రీకాకుళం సమీపంలోని అంపోలులో ఉన్న జిల్లా జైలుకు తరలించారు.

* నగరంలోని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్ వరకు చేపట్టిన గుండె తరలింపు కార్యక్రమం విజయవంతం అయ్యింది. మెట్రోలో గుండెను గమ్యస్థానానికి చేర్చారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మెట్రోలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కామినేని హాస్పిటల్ నుంచి నాగోల్ వరకు రోడ్డు మార్గంలో గుండెను తరలించగా, అక్కడి నుంచి మెట్రోలో జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వరకు తీసుకువచ్చారు. మళ్లీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ సమన్వయంతో పని చేశారు. డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో గుండెను దానం చేసేందుకు రైతు కుటుంబం ముందుకొచ్చింది.

* ఏపీ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు.

* వైకాపా అధికారంలో ఉండేది రెండేళ్లే.. సర్పంచిగా గెలిస్తే అయిదేళ్లు అధికారంలో ఉంటారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామం నుంచే పోరాటం ప్రారంభించాలి, రౌడీల పాలన అంతానికి తొలిమెట్టు ఇదే కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల తొలి, రెండో దశలకు సంబంధించి తెదేపా నేతలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాత్‌లోనూ ఆన్‌లైన్‌ నామినేషన్లకు అనుమతించారు, ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలి దశకు ముందే అనేకసార్లు అడిగినా.. వైకాపా ప్రభుత్వం అనుమతించలేదు. తర్వాత దశల్లో అయినా ఆన్‌లైన్‌ నామినేషన్లను అనుమతించాలని కోరాం’ అని వివరించారు.

* కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు 20వేల బస్సులు అందజేయాలని కేంద్రం తాజా బడ్జెటులో ప్రతిపాదించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో వాటిని కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఉపాధి కల్పనతో పాటు ప్రైవేటు పెట్టుబడిదారులను రవాణా రంగంలో మరింతగా భాగస్వాములను చేసేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నది కేంద్రం వ్యూహం. ఆ 20వేల బస్సులను ఏయే రాష్ట్రాలకు ఎన్నేసి కేటాయించేదీ, వాటిలో తెలంగాణకు ఎన్ని దక్కేదీ స్పష్టత లేదు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,004కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,156 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 147మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,651కి చేరింది.

* ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా ప్రజలు అందించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారం భద్రంగానే ఉంటుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 6,30, 478 గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని కేంద్రం తెలిపింది.

* రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంగళవారం కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం విపక్షాల ఆందోళనలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దీంతో 5 గంటలకు ప్రారంభమైన జీరో అవర్‌లో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను చర్చించేందుకు కేంద్రం పార్లమెంటు బయట, లోపల ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందన్నారు.

* నూతన సాగు చట్టాలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళన సమాచారంతో ఉన్న ఖాతాలను ట్విటర్‌ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్‌.. ‘మోదీ స్టైల్‌ పాలన ఇదే’నంటూ ఎద్దేవా చేశారు. ట్విటర్‌ ఖాతాల నిలిపివేతకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని ట్వీట్‌ చేసిన రాహుల్‌.. ‘మోదీ స్టైల్‌ పాలన.. ఆందోళన చేస్తున్న వారి గొంతులు నొక్కేయడం.. వాళ్లని వేరు చేయడం.. వారిని అణగదొక్కడం’ అంటూ ప్రధానిపై విమర్శలు చేశారు.

* ముంబయిలోని గోరెగావ్‌లో ఓ ఫిల్మ్‌ స్టూడియోలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎనిమిది అగ్నిమాపకయంత్రాల సాయంతో మంటలను ఆర్పేశారు. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ‘ఆది పురుష్‌’ చిత్రీకరణ ఈరోజు అదే స్టూడియోలో ప్రారంభమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్‌, సైఫ్‌ అక్కడ లేరని చిత్ర బృందం తెలిపింది.

* విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మే 4 నుంచి జూన్‌ 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో ప్రకటించారు. మే 4 నుంచి జూన్‌ 7వరకు జరిగే పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అలాగే, మే 4నుంచి జూన్‌ 11 వరకు జరిగే 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు.

* ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడంతో కివీస్‌ తుదిపోరుకు చేరింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్‌ వేదికగా తెలిపింది. లార్డ్స్‌ మైదానంలో జరగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కివీస్‌ బెర్తు సాధించిందని వెల్లడించింది. అయితే కివీస్‌ ప్రత్యర్థి స్థానం కోసం భారత్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతునున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న భారత్×ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్‌ ఫలితంతో తుదిపోరుకు చేరే మరో జట్టు ఎవరనేది తేలనుంది.