NRI-NRT

తానా పెద్దలకు గుణపాఠం తప్పదా..!? – TNI ప్రత్యేకం

USA Telugu TANA 2021 Elections Notification - TANA Elections 2021 Contestants - TANA Telugu Elections 2021 - Will The Contest Be Democratic?

అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా విరాజిల్లుతున్న తానాలో ఎన్నికల రాజకీయం రసకందాయకంలో పడింది. ఇప్పటి వరకు తానా పెద్దలుగా, అధిష్టానవర్గంగా చెల్లుబాటవుతున్న ముగ్గురు పెద్దల ఆధిపత్యానికి గండికొట్టాలని, వారు ప్రదర్శిస్తున్న ఏకపక్ష ధోరణులను ఎదుర్కోవాలని తానాలో మెజారిటీ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. తానా మాజీ అధ్యక్షులుగా పని చేసిన వేమన సతీష్, కోమటి జయరాం, నాదెళ్ళ గంగాధర్ లు ఇప్పటి వరకు తానా వ్యవహారాలలో చక్రం తిప్పారు. ఇప్పటి వరకు తానాలో ఉన్న సభ్యులు కూడా వీరి మాటలకు గౌరవం ఇచ్చి వారు చెప్పినట్లుగానే నడుచుకున్నారు.

*** మా మాటే చెల్లాలంటున్న పెద్దలు
ఇప్పటి వరకు తానాలో తమకు ఎదురు లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన ఈ పెద్దలు తానాపై శాశ్వతంగా తమ పట్టు ఉండాలని ఈ మధ్య పావులు కదపడం ప్రారంభించినట్లు తానా వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. తానా సెలక్షన్ కమిటీగా తామే ఉంటామని ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్ధులే పోటీ చేయాలని ఈ ముగ్గురు పెద్దలు ఇటీవల పావులు కదపడం ప్రారంభించారు. దీనితో అమెరికా నలుమూలలా ఉన్న తానా సభ్యుల్లో నిరసనలు రాజుకుంటున్నాయి.

*** సొంత వర్గంలోనే తిరుగుబాటు
తానా పెద్దల ఏకపక్ష ధోరణుల కారణంగా వీరి వ్యతిరేక వర్గంలోనే కాకుండా వారి సొంత అనుచరవర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోమటి జయరాంకు ప్రియశిష్యులుగా పేరుపొందిన ప్రస్తుత తానా కోశాధికారి వేమూరి సతీష్, సహాయ కోశాధికారి కొల్లా అశోక్‌లు తమ గురువు మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరు ఇరువురు కోమటి జయరాం వ్యతిరేక వర్గంతో చేతులు కలిపి సతీష్ కార్యదర్శి పదవికి, అశోక్ కోశాధికారి పదవికి పోటీ చేస్తున్నారు. 2008లో ప్రవాస విద్యార్థుల సేవా విభాగ అధ్యక్షుడిగా తానాలోకి ప్రవేశించిన అశోక్ అంచెలంచెలుగా ఎదిగి సహాయ కోశాధికారి పదవిని అలంకరించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో పాటు తనను గల్లీ నాయకుడంటు విమర్శలకు దిగడంతో తన సత్తా చాటాలని అశోక్ బరిలో దిగుతున్నట్లు సమాచారం. మరో పక్క నాదెళ్ళ గంగాధర్ ముఖ్య అనుచరుడు, ఆయన ఆశీస్సులతో తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా రెండుసార్లు ఎన్నికైన డెట్రాయిట్‌కు చెందిన శృంగవరపు నిరంజన్ ఈ పర్యాయం నాదెళ్ళ గంగాధర్ పై తిరుగుబాటు చేశారు. అధ్యక్ష పదవికి రంగంలోకి దిగారు. తన ప్యానల్ ను కూడా ఎంచుకొని ఎన్నికల రణరంగంలో ప్రస్తుత తానా అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ మద్దతుతో ముందుకు వెళుతున్నారు.

*** వేమన సతీష్‌కు “శృంగభంగం” తప్పదా?
తానా అధ్యక్షుడిగా పని చేసిన వేమన సతీష్ వ్యవహార శైలిపైన తానాలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన సదస్సుకు బోర్డ్ సభ్యుల అనుమతి లేకుండా ఎక్కువ ఖర్చుపెట్టారనే అభియోగం ఉంది. దాని ప్రభావం ప్రస్తుతం ఆయన అభ్యర్ధిగా తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నరేన్ కొడాలిపైన పడింది. మంచి వ్యక్తిగా, పెద్దమనిషిగా పేరు ఉన్న కొడాలి నరేన్ అభ్యర్ధిత్వాన్ని వేమన సతీష్ గట్టిగా సమర్థిస్తూ ఉండటంతో చాలా మంది నరేన్ అభ్యర్ధిత్వాన్ని అంగీకరించడం లేదని సమాచారం. దీనికి తోడు కోమటి జయరాం కూడా తన మద్దతు కొడాలి నరేన్‌కేనంటూ బహిరంగంగా ప్రకటించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు వాషింగ్టన్ డీసీలో జరిగిన గత తానా సదస్సులో వేమన సతీష్ తన స్థాయికి మించి ప్రకటనలు చేశాడని తానా సభ్యులు అంటున్నారు. తాను రాయలసీమ నుండి తానా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తినని, తన తర్వాత రాయలసీమలో తానా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే సత్తా ఉన్న నేత ఎవరూ లేరని తానే రాయలసీమ నుండి ఎన్నికైన మొదటి, చివరి అధ్యక్షుడనని సవాల్ విసిరారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శృంగవరపు నిరంజన్ రాయలసీమకు (కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ) చెందిన వ్యక్తి. నిరంజన్ ను అధ్యక్షునిగా ఎన్నుకొని వేమన సతీష్ తో పాటు ఇతర తానా పెద్దలకు శృంగభంగం చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

*** ఇద్దరు తానా అధ్యక్షులు ఏకమవుతున్నారా?
తానా పెద్దల ఆశీస్సులతో తానా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన లావు అంజయ్య చౌదరి తన భవిష్యత్తు కోసం బాటలు వేసుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ తో ఆయన చేతులు కలుపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు తానా పెద్దలుగా చలామణీ అవుతున్న పెద్దల ఆధిపత్యానికి గండికొట్టాలని, తానాకు తాను సమర్ధుడైన అధ్యక్షుడిగా స్వతంత్రంగా వ్యవహరించాలని అంజయ్య చౌదరి పావులు కదుపుతున్నట్లు సమాచారం . దీనిలో భాగంగా తానా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇరువురిని అట్లాంటాకు పిలిపించి రాజీ ప్రయత్నాలు ప్రారంభించారని కొడాలి నరేన్ ను పోటీ నుండి తప్పుకొని ఎన్నికలు సజావుగా సాగేటట్లు చూడాలని అంజయ్య చౌదరితో పాటు ఆయన అనుచర వర్గం కూడా కోరినట్లు సమాచారం. ఇప్పటికైనా తానా పెద్దలు దిగివచ్చి తానాలో ప్రజాస్వామ్య పద్ధతులను పునరుద్ధరించాలని లేని పక్షంలో శృంగభంగం తప్పదని తానా వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్

########

TANA 2021 Election Notification Can Be Seen Below.

TANA Telugu USA 2021 Election Notification
TANA Telugu USA 2021 Election Notification
TANA Telugu USA 2021 Election Notification