Politics

తెరాసపై ఈటెల తిరుగుబాటు-తాజావార్తలు

News Roundup - Eetela Will Revolt Against TRS Says Jeevan Reddy

* మంత్రి ఈటల రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్‎పై తిరుగుబాటు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలు లేకుండా ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉనికి కోల్పోతుందని మంత్రి ఈటల హెచ్చరించారని తెలిపారు. అయితే..రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాల అంశంపై బీజేపీకి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని జీవన్‌రెడ్డి నిలదీశారు.

* తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. అలాగే 1608 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

* నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ శనివారం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ రెన్స్ పాల్గొన్నారు.“మేక్ ఇన్ ఇండియా” లో భాగంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చడం ముఖ్యమని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం రోడ్డు, రవాణా మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, మానవ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడం, వైద్య, ఆరోగ్య, న్యూట్రిషన్ రంగాలలో మౌళిక మార్పులకు ప్రాధాన్యం ఇవ్వడం, తదితర అభివృద్ధి అంశాలపై ఈ వీడియో కాన్ఫ రెన్స్ ను నిర్వహించినటు తెలిపారు.

* గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. పాలకవర్గ పదవీకాలం ముగిసే సమయం సమీపిస్తుండగా అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. మహానగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల పునర్విభజన కీలక ఘట్టం కానుంది. ఆ దిశగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్‌ వరంగల్‌లోనూ ఇదే విధానం కొనసాగనుంది. ఇప్పుడు ఉన్న 58 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తారు. ఈనేపథ్యంలో వార్డులు, కాలనీల తీసివేతలు, కూడికలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేడో, రేపో పునర్వి భజన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి.

* కేంద్రం బడ్జెట్‌పై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు సంతోషంగా ఉన్నారంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో తెలంగాణ న్యాయం జరిగింది కాబట్టే విమర్శలు చేయటం లేదని ఆయన అన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. బడ్జెట్‎పై రాజకీయా విమర్శలు ఆపి.. సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అధోగతి పాలు చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. బంగారు తెలంగాణలో భవిష్యత్ కోసం యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‎పై వాస్తవ పరిస్థితులు వివరించటానికే పర్యటించామని సంజయ్ తెలిపారు.

* రేపు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రుల నుంచి జడ్పీ చైర్మన్‌ల వరకూ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు. కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రచారం నేపథ్యంలో సమావేశానికి ఎన్నడూ లేనంత ప్రాధాన్యత నెలకొంది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యల నేపథ్యంలో నాయకత్వ మార్పుపై కేసీఆర్ సంకేతాలిస్తారా? అని ఆసక్తికరంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడం విశేషం. పట్టబధ్రుల ఎన్నికలు, సాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. ఈ నెల 17న కేసీఆర్ 67 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయనున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది.

* విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ తాను తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజకీయేతర ఐకాస ఏర్పాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అనేకమంది ప్రాణత్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇలాంటి సమస్య వస్తే అప్పటి ప్రధాని వాజ్‌పేయీని కలిసి అడ్డుకోగలిగామన్నారు. విశాఖ స్టీల్స్‌ పరిశ్రమ నష్టాలకు ముఖ్యకారణం సొంత గనులు లేకపోవడమేనన్న ఆయన.. పరిశ్రమకు సొంత గనులు కేటాయించి లాభాల బాట పట్టించాలని కేంద్రాన్ని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఏపీఎన్జీవోల సంఘం మద్దతు ప్రకటించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్టు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. కేంద్రంపై పోరుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

* పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని, ఎలాంటి అభద్రత అవసరం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ రక్షణ కవచంలో ఉంటారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎస్‌ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దీనిపై సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు.

* పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ వివాదాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదో జరగరానిది జరుగుతుందనడం, అధికారులను బెదిరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికారుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేసిన సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికి పరిమితం చేయడం తగదన్నారు.

* కరోనా వైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కొవిడ్‌-19 పరీక్షల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడించింది. ‘దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 20కోట్ల మైలు రాయిని దాటింది. వాటిలో 7.40లక్షల టెస్టులు గడిచిన 24 గంటల్లో చేసినవే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 2,369 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉండగా.. వాటిలో 1,214 ప్రభుత్వానివి కాగా.. మరో 1,155 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రయోగశాలల సామర్థ్యం మెరుగ్గా ఉన్నందువల్లే పరీక్షల సంఖ్య కూడా భారీగా పుంజుకుంది. అదేవిధంగా పరీక్షల సంఖ్య పెరగడం వల్లే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి’ అని కేంద్రం స్పష్టం చేసింది.

* పశ్చిమ బెంగాల్‌ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరని అన్యాయం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు కాకుండా అడ్డుకున్నారన్నారు. కేవలం అహం, గర్వంతోనే ఆమె ఇలా చేశారని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది రైతులు అన్యాయానికి గురయ్యారన్నారు. ఏడాదికి కేంద్రం ఇస్తున్న రూ.6000 ఆర్థిక సాయాన్ని కోల్పోయారన్నారు.

* అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. ఇందులో బన్ని పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. కాగా, ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ షెడ్యూల్‌ పూర్తయింది. దీంతో, అల్లు అర్జున్‌ సహా చిత్ర బృందం హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అల్లు అర్జున్‌ కారవాన్‌కు ఖమ్మం సమీపంలో ప్రమాదం జరిగింది.

* నూతన వ్యవసాయ చట్టాల ద్వారా దేశానికి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్‌ చేయడంతో పాటు సరిహద్దుల్లో తమపై వేధింపులు ఆపాలంటూ శనివారం రైతులు దేశవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ‘చక్కాజామ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా 12-3 గంటల మధ్య రహదారులను దిగ్బంధిస్తామని వారు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌ చేసి, రైతులకు మద్దతు తెలిపారు.

* అనుకున్నదే జరిగింది..! విధ్వంసకర ఫామ్‌లో ఉన్న జోరూట్‌ ద్విశతకం బాదేశాడు. తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. టీమ్‌ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఆసియా గడ్డపై తనను మించిన విదేశీ ఆటగాడు మరొకరు లేరని చాటాడు. చెపాక్‌లో అతడిని ఔట్‌ చేయడానికి కోహ్లీసేన ఎన్ని కష్టాలు పడిందో..? ఎంతగా శ్రమించిందో..? మరి ఇంగ్లాండ్‌ సారథిని పెవిలియన్‌ ‘రూట్‌’ పట్టించడం ఎందుకంత కష్టమో తెలుసా..?

* కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ..భారత్‌ తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ‘కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకోవడంలో భారత్‌ గొప్ప పురోగతి సాధించింది. చిన్నపాటి ప్రజారోగ్య పరిష్కారాలను పాటించగలిగితే..వైరస్‌ను ఓడించవచ్చని ఇది మనకు చూపిస్తోంది. ఈ క్రమంలో టీకాలను జోడించడంతో, మనం మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు’ అని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

* ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ నోట్ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు,రిటర్నింగ్ అధికారులు అభద్రతకు లోను కావద్దు…ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారు..ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటీ ఈసీ అనుమతి తప్పనిసరని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది..కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుంది..బెదిరింపులకు గురిచేసేలా ఎంతటి పెద్దవారు ప్రకటన చేసినా అధికారులు భయబ్రాంతులకు గురికావద్దు.ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అనైతికం.ఉద్యోగుల పట్ల దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు.వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే…వ్యవస్థలు మాత్రమే శాశ్వతం.

* ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పర్యటిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పెట్రోలింగ్‌ జరుగుతోంది. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తాం. రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం. సామాజిక మాధ్యమాలపై కూడా దృష్టి పెట్టనున్నాం. మద్యం, నగదు అక్రమ రవాణాపై తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశాం’ అని అన్నారు.

* మోహన్‌లాల్‌ కథానాయకుడిగా మలయాళంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘దృశ్యం’. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టిందా సినిమా. అంతేకాదు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్‌ అయి ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా మలయాళంలో ‘దృశ్యం2’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దృశ్యం’లో క్లోజ్‌ అయిపోయిన కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేశారా?లేక ఇది ఇంకో సమస్యా?అయితే, అదేేంటి? మరి ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అందుకు జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్‌) ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు ఆగాల్సిందే!

* తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఆ రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు సంతోష్ కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు.