WorldWonders

గాడిదల సంఖ్య తగ్గిపోయింది

Donkey Count Has Reduced In India

*ఒకప్పుడు 50 వేల దాకా గాడిదలు ఇప్పుడు 5 వేలలోపే!
*మాంసం కోసం గార్దభ సంహారం
*ఆహారం జాబితాలో లేకున్నా వధ
*ఇతర రాష్ట్రాల నుంచీ దిగుమతి
*కిలో రూ.600 వరకు విక్రయం
*అశాస్త్రీయమైన నమ్మకాలతో
*పెరుగుతున్న వినియోగం
*క్రమంగా గాడిదలు కనుమరుగు
******మేక, గొర్రె, కోడి, చేప, రొయ్య, పీత… ఇంకా రకరకాల మాంసాహారాలు! అధికారికంగా అనుమతించిన జంతు మాంసంలో గాడిద లేదు. కానీ… రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మాంసం కోసం గాడిదలను వధిస్తున్నారు. ‘ఇచ్చట గాడిద మాంసం అమ్మబడును’ అని బోర్డులు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ధోరణి బాగా పెరుగుతోంది.
*గాడిద పాల నుంచి మాంసానికి…
‘కడివెడైననేమి ఖరము పాలు’ అని వేమన చెప్పినా… గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీనికోసం ఇంటింటికీ గాడిదలను తిప్పి… అక్కడికక్కడే వాటి పాలు విక్రయించే వారు చాలామందే ఉన్నారు. ఇక… గాడిద రక్తం తాగి, పరిగెత్తి, జీర్ణం చేసుకోగలిగితే పోలీసు దెబ్బలను కూడా తట్టుకోవచ్చునని నమ్మే నేరస్థులూ ఉన్నారు. అయితే.. విచిత్రంగా ఇటీవలి కాలంలో గాడిద మాంసానికీ బాగా గిరాకీ పెరిగింది. మార్కెట్లో మటన్‌ ధర కిలో రూ.760 నుంచి 800 వరకు ఉంది. అదే గాడిద మాంసాన్ని కిలో రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు. గాడిద మాంసానికి ఇంత డిమాండ్‌ ఉందా అని మాంసం ప్రియులే ఆశ్చర్యపోతున్నారు. తాడేపల్లిలో ప్రతి ఆదివారం, బుదవారం గాడిదల వధ జరుగుతోంది. సుమారు 15 నుంచి 20 గాడిదల మాంసాన్ని విక్రయిస్తోన్నారు. గుంటూరు నగరంలోని వెంకటప్పయ్య కాలనీరోడ్డు, నల్లపాడు శివారులోనూ గాడిద మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల వద్ద కొంతమంది మహిళలు గాడిదలను కొనుగోలు చేసి, వాటి మాంసాన్ని విక్రయించడం చేస్తున్నారు.
*మాయమైపోతున్నాయి..
ఒకప్పుడు రజకులు, అడవుల్లో వంటచెరుకు, కలప కోసం వెళ్లేవారు గాడిదలను ఉపయోగించేవారు. ఎక్కువ బరువును మోయడం గాడిదల ప్రత్యేక లక్షణం. అయితే… మెల్లమెల్లగా ఆయా వృత్తుల్లో గాడిదల వినియోగం తగ్గిపోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో 40 వేల నుంచి 50వేల వరకు గాడిదలు ఉండేవని అంచనా. ఏడేళ్లలోనే వాటి సంఖ్య 5వేలలోపునకు పడిపోయినట్లు చెబుతున్నారు. విజయవాడలో ఒకనాడు ఎటుచూసినా గాడిదలే కనిపించేవి. ఇప్పుడు… కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా గాడిదలు తిరుగాడుతున్నాయి. ఇప్పుడు.. గాడిదలను మాంసం కోసం చంపేస్తుండటం తో వాటి సంఖ్య వేగంగా తరిగిపోతోంది.తెలంగాణతోపాటు పలు ఇతర రా ష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని మరీ గాడిదలను చంపేస్తున్నారు. మరికొందరైతే ముంబై దాకా పోతున్నారు. ఏపీకి తెస్తున్న 8 గాడిదలను ముంబై పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకొన్నారు. శనివారం రాజస్థాన్‌ నుంచి గుంటూరు జిల్లాకు 39 గాడిదలను రవాణా చేస్తుండగా దాచేపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. గాడిదల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొన్ని పోలీస్‌ స్టేషన్లలో కేసు లు కూడా నమోదయ్యాయి. మనుషుల ఆహారానికి వినియోగించే జాబితాలో గాడిద లేదు. అంటే… వాటిని మాంసం కోసం వధించడం చట్టరీత్యా నేరం. అయినా.. అనేకచోట్ల యథేచ్ఛగా గాడిద మాంసాన్ని విక్రయిస్తున్నారు.
*ఏమిటి కారణం?
‘‘గాడిద మాంసం తింటే బలం వస్తుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా నయమవుతుంది. శరీర కండరాలు మొద్దుబారిపోయి లాఠీ దెబ్బలను కూడా తట్టుకోవచ్చు’’… అనే అపోహలు, అశాస్త్రీయ వాదనలే గాడిద మాంసం వినియోగం పెరగడానికి కారణమని చెబుతున్నారు. ఇలా మాంసం కోసం గాడిదలను చంపుతూ పోతే, కొన్నాళ్లకు వాటి జాతే అంతరించిపోయే ప్రమాదముందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*గాడిద పాల ప్రస్తావన లేదు
‘‘చిన్నపిల్లలకు గాడిద పాలు తాగించడం వల్ల తరచుగా జలుబు, దగ్గు వంటివి సోకవని, గురక తగ్గుతుందని చెబుతారు. చిన్నారుల వైద్య శాస్త్రంలో ఎక్కడా ఈ అంశాలు లేవు. పిల్లలకు తల్లిపాలు అత్యంత ఉత్త మం.. అవి లేనిపక్షంలో గేదె పాలు మంచివి. ఈ అంశాలు వైద్యశాస్త్రంలో ఉన్నాయి!’’
*‘అనంత’లో ఇలా…
అనంతపురం జిల్లా తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలతోపాటు నల్లమాడ, కనగానపల్లి మండలాల్లో అత్యధికంగా గాడిదల ద్వారానే చాకిరేవుకు దుస్తులను తీసుకెళ్లేవారు. అప్పట్లో ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి గాడిదలు ఉండేవ ని… ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టేన్ని కూడా లేవని అప్పటితరం రజకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా అనంతపురం జిల్లా నుంచి రాజమండ్రికి గాడిదలను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
*ఏజెన్సీలో కనుమరుగు
అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో గాడిదలను విరివిగా ఉపయోగించేవారు. నిర్మాణ సామగ్రిని కూడా గాడిదలపైనే రవాణా చేసేవారు. ఇప్పుడు మారుమూల గ్రామాలకు రహదారులు వేయడంతో గాడిదలతో అవసరంలేకుండా పోయిం ది. బైకులు, ఆటోల వినియోగం పెరిగింది. విశాఖ జిల్లా మాడుగులలో ప్రతిఏటా ఉగాది తర్వాత గాడిదల సంత జరిగేది. ఇప్పుడూ సంత జరుగుతోందికానీ… క్రయవిక్రయాలు నామమాత్రంగా జరుగుతున్నాయి.