Business

జాక్ మాకు తగ్గని తలనొప్పులు-వాణిజ్యం

Business News - Jack Ma Asked To Sell His Shares From Media

* చైనాకు చెందిన అపరకుబేరుడు, అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మాను చైనా ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టేట్లు లేదు! ఇప్పటికే యాంట్‌ గ్రూప్‌ ఐపీఓని అడ్డుకున్న జిన్‌పింగ్‌ సర్కార్‌ తాజాగా మీడియా సంస్థల్లో అలీబాబాకు ఉన్న వాటాల్ని ఉపసంహరించుకోవాలని జాక్‌ మాను ఆదేశించిందట. ఈ విషయాన్ని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్ వెల్లడించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపు లాభాల్లోకి వెళ్లాయి. అనంతరం కిందకు దిగజారి మళ్లీ పైకి లేచాయి. ఉదయం 11:30 గంటల సమయంలో ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఇక అక్కడి నుంచి పడడం మొదలు పెట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం 50,436 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,561 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 49,718 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 562 పాయింట్లు నష్టపోయి 49,801 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,946 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,956 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 14,696 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 189 పాయింట్లు నష్టపోయి 14,721 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద నిలిచింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

* దేశంలోని 5 అగ్రగామి ఉక్కు కంపెనీలు రూ.35,000 కోట్ల రుణం (మొత్తం రుణాల్లో 15 శాతాన్ని) తిరిగి చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇది జరగొచ్చని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. ఉక్కుకు గిరాకీ పెరగడం, అధిక ధరల నేపథ్యంలో, కంపెనీల నిర్వహణ మార్జిన్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 23 శాతం పెరగనున్నాయని, అందుకే సంస్థలు రుణభారం తగ్గించుకోవడానికి చూస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థికంతో పోలిస్తే మాత్రం 2021-22లో కంపెనీల నిర్వహణ మార్జిన్‌ 25 శాతం తగ్గే అవకాశం ఉంది.

* అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా రిసోర్సెస్‌ భారత్‌లోని వేదాంతా లిమిటెడ్‌లో వాటాలను మరింత పెంచుకోనుంది. దీనిలో మరో 17.51శాతం వాటాల కొనుగోలుకు అనుమతులు కోరుతూ మంగళవారం ఎక్స్ఛేంజీలో ఫైలింగ్‌ దాఖలు చేసింది. ఒక్కో షేరుకు రూ.235(3.24 డాలర్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. గతంలో 10 శాతం వాటాలు కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన రూ.160 కంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. ప్రస్తుతం వేదాంతా రిసోర్సెస్‌కు వేదాంత లిమిటెడ్‌లో 55శాతం వాటాలు ఉన్నాయి.

* భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఇండియాలో మళ్లీ కరోనా పెరగడమే. ఒకవేళ మరోసారి కరోనా విజృంభిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో కొన్ని చోట్ల కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు తమ షేర్లను అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా వారి చేతిలో ఉన్న నగదును బంగారం మీద స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టె అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.