సేవా సంస్థల్లో పదవి లభించడం గొప్ప కాదని, లభించిన పదవికి నిస్వార్థంగా సేవ చేసి దానికి న్యాయం చేసేవారే నిజమైన సేవకులని అలాంటి వారి సమాహారమే తమ ప్యానెల్ అని తానా 2021 అధ్యక్ష అభ్యర్థి శృంగవరపు నిరంజన్ ఆదివారం సాయంత్రం న్యూయార్క్‌లో అన్నారు. తానాలో ఎన్నో కీలక పదవుల్లో తాను, తన ప్యానెల్ సభ్యులు విశేషమైన సేవలు అందించామని పనిచేసిన సేవకులందరూ తమ ప్యానెల్ ద్వారా పోటీలో ఉండటం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్యానెల్‌ను గెలిపించి మరో అవకాశం కల్పిస్తే సంస్థ అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ప్యానెల్ పోటీదారులు తదితరులు పాల్గొన్నారు.
##############