Business

కార్ల విక్రయాలకు కరోనా బ్రేకు-వాణిజ్యం

కార్ల విక్రయాలకు కరోనా బ్రేకు-వాణిజ్యం

* బిట్ కాయిన్ వ్యాల్యూ పెరిగి, మళ్ళీ కిందకు దిగొస్తున్నది. టర్కీ క్రిప్టోకరెన్సీ నిషేధం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంశం బిట్ కాయిన్ వంటి క్రిప్టో పైన తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గత వారం, ఈ వారం ప్రారంభంలో క్రిప్టోకరెన్సీ దారుణంగా పతనమైంది. అయితే టెస్లా, ఇతర సంస్థల నిర్ణయాలు కాస్త సానుకూలంగా ఉండటంతో బిట్ కాయిన్ తిరిగి పుంజుకుంది. రెండు రోజులుగా బిట్ కాయిన్ 54,000 డాలర్లకు పైనే కదలాడుతోంది. బిట్ కాయిన్ పక్షం రోజుల క్రితం 63వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 50వేల డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. మళ్లీ క్రమంగా పుంజుకుంతున్నది

* వాహనాల అమ్మకాలకు మళ్లీ కొవిడ్‌-19 సెగ తాకింది. ఏప్రిల్‌లో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గాయి. కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తితో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, వివిధ రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు లాంటి ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది. సాధారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ అమ్మకాలను గతేడాది ఏప్రిల్‌లో నమోదైన అమ్మకాలతో పోల్చిచూడాల్సి ఉంటుంది. అయితే కిందటేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో ఆ నెలలో వాహన కంపెనీలేవీ ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదు. అందువల్ల అప్పటి అమ్మకాలతో ఇప్పుడు పోల్చిచూడలేం. ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూసినప్పుడు ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 4 శాతం తగ్గాయి. మార్చిలో ఈ వాహన దిగ్గజం 1,67,014 వాహనాలను విక్రయించగా.. కిందటి నెలలో అమ్మకాలు 1,59,691 వాహనాలకు పరిమితమయ్యాయి. దేశీయంగానూ అమ్మకాల్లో 8 శాతం క్షీణత నమోదైంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 8 శాతం తగ్గి 59,203 వాహనాలకు, టాటా మోటార్స్‌ మొత్తం విక్రయాలు 41 శాతం క్షీణతతో 39,530 వాహనాలకు పరిమితమయ్యాయి. హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు 28 శాతం పెరిగి 9,072 వాహనాలుగా నమోదయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 10 శాతం తగ్గి 36,437 వాహనాలకు పరిమితమయ్యాయి. టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 9,622, కియా ఇండియా 16,111, ఎంజీ మోటార్‌ ఇండియా 2,565, వీఈ కమర్షియల్‌ వెహికల్స్ 2,145 చొప్పున ఏప్రిల్‌లో వాహనాలను విక్రయించాయి. ద్విచక్రవాహనాల కంపెనీల్లో హీరో మోటోకార్ప్‌ 3,72,285 వాహనాలను విక్రయించగా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 53,298 వాహనాల అమ్మకాలను నమోదుచేసింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. రిటైల్‌, టెలికాంలతో పాటు, పెట్రోరసాయనాల విభాగాలు రాణించడం ఇందుకు దోహదం చేసింది. 2020-21 చివరి (జనవరి-మార్చి) త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 129శాతం వృద్ధితో రూ.13,227 కోట్లకు చేరింది. ఇందులో రూ.797 కోట్ల అసాధారణ లాభం(అమెరికా షేల్‌ ఆస్తుల విక్రయం) కూడా కలిసి ఉంది. 2019-20 ఇదే త్రైమాసికంలో లాభం రూ.6348 కోట్లు మాత్రమే. కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.1,72,095 లక్షల కోట్లుగా నమోదైంది. 2019-20 ఇదే త్రైమాసికంతో పోలిస్తే 13.6 శాతం వృద్ధి చెందినట్లయింది.

* దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత ఎన్నడూ లేనంత అధికంగా ఏప్రిల్‌ నెలలో మొత్తం రూ. 1,41,384 కోట్ల వసూళ్లు జరిగాయి. అయితే మార్చిలో 1.24 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన జీఎస్టీ డేటాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.27,837 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.35,621 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ ఐజీఎస్‌టీ కింద రూ.68,481 కోట్లు వసూలు అయ్యాయి. కాగా రూ .9,445 కోట్లు సెస్‌ రూపంలో వసూలు చేశారు.