Politics

భాజపాను చావుదెబ్బ కొట్టిన ఓటర్లు-తాజావార్తలు

News Roundup - BJP Losses In 5 Out Of 7 States In 2021 Elections

* అస్సాం, పుదుచ్చేరీలో మినహాయించి, తెలంగాణాలోని సాగర్, ఏపీలోని తిరుపతి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో భాజపా ఓడిపోయినట్లేనని మ్యాజిక్ ఫిగర్లను చూస్తే అర్థమవుతోంది.

* ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. సాయంత్రం 6 గంటల సమయానికి పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ 165, స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. ఇంకా 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016లో 3 స్థానాలతో సరిపెట్టుకున్న భాజపా ఈసారి మరింత పుంజుకుంది. 47 స్థానాల్లో విజయం సాధించడమే కాక, ఇంకా 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్షాలకు ఒకే ఒక్క సీటు దక్కింది.ఇక తమిళనాడులో డీఎంకేకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇప్పటికే 50 స్థానాల్లో విజయం సాధించగా, ఇంకా 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏడీఎంకే 17 స్థానాల్లో గెలుపొంది 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.కేరళలో ఎల్‌డీఎఫ్‌ 88 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. యూడీఎఫ్‌ 37 స్థానాలు గెలుచుకోగా, మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ 9 చోట్ల గెలుపొంది మరో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఐఎన్‌ఎస్‌ 3 చోట్ల గెలుపొంది మరో మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 15 స్థానాలకు మంచి రావాలి.

* ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ కూడా సాధించదని పలుమార్లు సవాల్‌ చేసిన పీకే తాజా ఎన్నికల ఫలితాల సరళి నేథ్యంలో వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాను చేస్తున్న దాన్ని కొనసాగించలేనని స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. చేయగిలినంత చేశాను. బెంగాల్‌ గెలిచింది. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్‌ తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నా అన్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించినపుడు.. రాజకీయాల్లో తాను విఫలమయ్యానని పేర్కొన్నారు.

* నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్‌ మీడియాతో స్పందించారు. ‘నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్‌ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న గారి ఆశయాలను కచ్చితంగా నెరవేస్తున్నాన’ని నోముల భగత్‌ తెలిపారు. నా గెలుపుకు కృషి చేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు.

* చెపాక్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమార్‌, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్‌ విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో డీఎంకే దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన స్థానాలు దాటేసి, స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయం చేజిక్కుంచుకునే దిశగా సాగుతోంది. దీంతో డీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నాయి. తమిళనాడు కాబోయే సీఎం తమ అధినేత స్టాలిన్‌ అంటూ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సర్వేల అంచనాలు నిజం చేస్తూ డీఎంకే గెలుపు దిశగా పయనిస్తున్న వేళ స్టాలిన్‌ సోదరి కనిమొళి ఆయన నివాసానికి చేరుకున్నారు.

* తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.

* సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) కేరళలో రెండవసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికలలో గెలిచి 44 ఏళ్ల చరిత్రను పినరయి విజయన్‌ తిరగ రాయనున్నారు. కేరళ రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు తర్వాత ఎల్‌డిఎఫ్ 95 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్(యుడిఎఫ్) 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు.

* నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ చతికిలపడింది. కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన కమలం పార్టీ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ అభ్యర్థి పనుగోతు రవి దరావతు కోల్పోయారు. కేవలం 7,646 ఓట్లు మాత్రమే దక్కించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కనీసం రెండో స్థానంలోనైనా నిలుస్తామనుకున్న కమలనాథులు కలలుగానే మిగిలిపోయాయి. టీడీపీ తరపున పోటీ చేసిన మువ్వా అరుణ్‌ కుమార్‌ పరిస్థితి మరీ దారుణం. ఆయన కేవలం 1708 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అరుణ్‌ కుమార్‌ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు(2970) ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ‘నోటా’కు 498 ఓట్లు వచ్చాయి.

* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టిస్తోంది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది. డీఎంకే 125 స్థానాల్లో.. అన్నాడీఎంకే 77 స్థానాల్లో.. కాంగ్రెస్‌ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన పార్టీలేవీ కాంగ్రెస్‌ దరిదాపుల్లో కూడా లేవు. ఇక, లోకనాయకుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ సౌత్‌లోనే. అక్కడ కూడా పోటాపోటీగా ఉంది. కమల్‌ 15 వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంఎస్‌ జయకుమార్‌ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాసన్‌ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు వేలపై చిలుకు ఓట్ల మెజార్టీలో కమల్‌ ఉన్నారు. అయితే ఈ మెజార్టీ అలానే కొనసాగుతుందా లేక, తారుమారు అవుతుందా అన్నది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది.

* ణందిగ్రం నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాను స్వాగతిస్తానని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నందిగ్రామ్‌ విషయంలో విచారపడొద్దని కార్యకర్తలకు సూచించారు. తమ పార్టీ 221 స్థానాల్లో ఘన విజయం సాధించిందని, భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు. భాజపా నీచ రాజకీయాలకు పాల్పడిందని, అదే సమయంలో ఎన్నికల సంఘం నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయని మమత వాపోయారు.