Sports

FCUK మీద ద్రవిడ్ ఆగ్రహం

FCUK మీద ద్రవిడ్ ఆగ్రహం

టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ తనను తిట్టారని మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. తాను ధరించిన టీషర్టే అందుకు కారణమని పేర్కొన్నాడు. భారత క్రికెటర్‌గా మనం హుందాతనంతో కూడిన దుస్తులే వేసుకోవాలని మందలించినట్టు తెలిపాడు. దాంతో ‘FCUK’ అని రాసున్న టీషర్ట్‌ను చెత్తకుండీలో పారేసి మరొకటి ధరించానని తన ఆత్మకథ ‘బిలీవ్‌’లో రాసుకున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలోనే సురేశ్ రైనా అరంగేట్రం చేయడం గమనార్హం. 2006లో ముక్కోణపు సిరీసు కోసం టీమ్ఇండియా మలేసియాలో పర్యటించింది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో తలపడింది. ఓ రోజు రైనా పై అక్షరాలు రాసున్న బ్రాండెడ్‌ టీషర్ట్‌ ధరించాడు. దాంతో అతడిపై ద్రవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానిని విడిచి మరొకటి వేసుకోవాలని సూచించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మందలించాడు.