Movies

“మా”లో భీకర పోరు

“మా”లో భీకర పోరు

తెలుగు చిత్రపరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈసారి మరింత ఉత్కంఠగా జరగనున్నాయి. ‘మా’లో ఈ సారి చతుర్ముఖ పోరు జరగనుంది. ఓ వైపు నటుడు ప్రకాశ్‌ రాజ్‌, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. కాగా తాజాగా నటి జీవిత రాజశేఖర్‌, హేమ సైతం సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యారు. దీంతో ‘మా’ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మెగా ఫ్యామిలీ మద్దతు..!
మొదటిసారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌కి మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ప్రకాశ్‌ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ‘చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీనికోసం వినియోగించుకోను’ అని సమాధానం ఇచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తనవద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దదనీ, కానీ ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు లేవని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ‘మా’కు ఇప్పటివరకూ సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడైతే తప్పకుండా సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఏక తాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్‌ రాజ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉండగా చిరంజీవి సోదరుడు నటుడు నాగబాబు ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌కు తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.
మోహన్‌బాబు వారసుడు!
సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు కుమారుడు హీరో విష్ణు ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటీనటులను విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు విష్ణు తన తండ్రి మోహన్‌బాబుతో వెళ్లి, కృష్ణని కలిసిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి వంటివి ప్రధాన అజెండాగా పెట్టుకుని ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని సమరానికి సన్నద్ధమవుతున్నారు.
జీవిత సైతం..!
ప్రముఖ నటుడు రాజశేఖర్‌ సతీమణి జీవిత సైతం ఈ ఏడాది ‘మా’ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో టాక్‌. ‘మా’ సభ్యురాలిగా.. తనకున్న అనుభవంతో అసోసియేషన్‌లో అంతర్గతంగా ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆమె ఇప్పటికే పక్కా ప్లాన్‌ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రెజరర్‌గా పోటీ చేద్దాం అనుకుని
‘మా’ ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరిగే అవకాశం కనిపిస్తోంది. నటి జీవితరాజశేఖర్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే మరో నటి హేమ పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఆమె గతంలో ‘మా’లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ అనుభవంతోనే ఆమె తాజాగా మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. అయితే నాకు అండ‌గా నిలిచిన వారంద‌రి కోసం, నా వారి కోసం ‘మా’ ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నాను అని హేమ అంటున్నారు.
ఇలా.. అధ్యక్ష పదవి కోసం నలుగురు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ‘మా’ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ‘మా’ అభివృద్ధే నినాదంగా అందరూ బరిలోకి దిగుతుండటంతో ఫిల్మ్‌ నగర్‌వైపే అందరి దృష్టి ఉంది. ఈ వాడివేడి పోటీలో ఎవరి సపోర్ట్‌ ఎవరికి ఉందో.. ఎవరు ఎన్నికల బరిలో గెలుపొందుతారో.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

#######

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల రూపంలో తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ ప్రకటించారు. దీంతో ‘మా’లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘త్వరలో జ‌ర‌గ‌బోయే ఎన్నికలను పురస్కరించుకుని ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్రతిష్ట కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నా’’ అని పేర్కొన్నారు. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్రమే చేయ‌డం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నా అని తెలిపారు.
1.ప్రకాశ్‌రాజ్‌; 2.జ‌య‌సుధ‌; 3.శ్రీకాంత్‌; 4.బెన‌ర్జీ; 5.సాయికుమార్‌; 6.తనీష్‌; 7.ప్రగతి; 8. అన‌సూయ‌; 9.స‌న; 10.అనిత చౌద‌రి; 11.సుధ‌; 12.అజ‌య్‌; 13.నాగినీడు; 14.బ్రహ్మాజీ; 15.ర‌విప్రకాష్‌; 16.స‌మీర్‌; 17.ఉత్తేజ్; 18.బండ్ల గణేష్; 19.ఏడిద శ్రీరామ్‌; 20.శివారెడ్డి; 21.భూపాల్‌; 22.టార్జాన్‌; 23.సురేష్ కొండేటి; 24.ఖ‌య్యుం; 25.సుడిగాలి సుధీర్; 26.గోవింద‌రావు; 27. శ్రీధ‌ర్‌రావు.. ఈ ప్యానల్‌లో ఉన్నారు.