Fashion

హోదాకు రాణి…గుణానికి మహారాణి

పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకుటుంబాలే.. అయితేనేం అందరితో కలిసే ప్రభుత్వ బస్సుల్లో పాఠశాలకు వెళ్లింది. 20ఏళ్లకే ఉద్యోగాన్ని సంపాదించి స్వతంత్రంగా జీవించడం తెలుసుకుంది. రాజకుటుంబం పరదా కింద మిగిలిపోకుండా, ఆదరణ కోల్పోయిన చేనేత వృత్తికి జీవం పోసింది. కరోనా కల్లోల సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచింది. ఐఏఎస్‌ అధికారిగా సేవలందించిన తండ్రి, స్వతంత్ర భావాలున్న తల్లి తనను అలా తీర్చిదిద్దారన్నారు రాధికారాజె గైక్వాడ్. వాంకనేర్ రాజకుటుంబంలో జన్మించి, బరోడా రాజకుటుంబంలోకి కోడలిగా వెళ్లిన ఆమె తన ప్రయాణాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి వివరించారు.

‘మా తండ్రి పేరు డాక్టర్ ఎంకే రంజిత్‌సింగ్‌. వాంకనేర్ రాజకుటుంబ హోదాను వదిలి, ఐఏఎస్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన్ను అక్కడ కమిషనర్‌గా నియమించారు. ఆప్పుడు నా వయస్సు ఆరు సంవత్సరాలే. కానీ నా తండ్రి ధైర్యంగా విధులు నిర్వర్తించిన తీరు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అందించిన సహకారం అన్నీ నాకు గుర్తున్నాయి. అలాగే మేం వాస్తవిక దృక్పథంతో జీవించేలా మా నాన్న ఎప్పటికప్పుడు జీవిత పాఠాలను బోధించేవారు. ఆ తరవాత మేం దిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ రాజకుటుంబ ఛాయలు లేకుండా.. చాలా సాధారణంగా జీవించేవాళ్లం. అక్కడి ప్రభుత్వ బస్సుల్లోనే పాఠశాలకు వెళ్లేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మకు రుణపడిఉంటాను. మాలో స్వతంత్ర ఆలోచనలకు తనే కారణం. వేసవి సెలవుల్లో వాంకనేర్‌కు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు మాపై చూపే ఆసక్తి నాకెంతో గొప్పగా అనిపించేది.

ఆ తరవాత డిగ్రీ పూర్తి చేసి, 20 ఏళ్ల వయస్సులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రైటర్‌గా చేరాను. మరోపక్క నా చదువును కొనసాగించాను. ఒక రాజకుటుంబ యువతిగా చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేయడమనేది ఎంతటి అసాధారణ విషయమో నాకు అప్పటికి తెలీదు. అలాఉద్యోగం చేసిన మొదటి మహిళను నేనే. నా కజిన్స్ అందరికీ దాదాపు 21 ఏళ్లకే పెళ్లిళ్లయిపోయాయి. కొద్దిరోజుల తరవాత బరోడా యువరాజు సమర్‌జీత్‌తో నాకు పెళ్లికుదిరింది. నేను చూసిన వారిలో ఆయనెంతో ప్రత్యేకంగా అనిపించారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు నాకెంతో నచ్చింది. అలాగే పైచదువులు చదవాలనే నా కోరికను ఆయన ప్రోత్సహించారు.

వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలస్‌కు వెళ్లిపోయాం. ఆ ప్యాలస్ గోడలన్నీ రవి వర్మ పెయింటింగ్స్‌తో నిండిపోయి ఉన్నాయి. అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. ఈ పెయింటింగ్స్‌ స్ఫూర్తితో పాత నేత పద్ధతులను పునరుద్ధరించాలనుకున్నాను. స్థానికులకు ఉపాధి కల్పించాలనుకున్నాను. నా ఆలోచనలకు మా అత్తగారు కూడా తోడయ్యారు. అలా నా ఆశయం ఆచరణలోకి వచ్చింది. వారు రూపొందించిన చేనేత వస్త్రాలకు ముంబయిలో మంచి ఆదరణ దక్కింది. మేం ఏర్పాటు చేసిన మొదటి ఎగ్జిబిషనే విజయం సాధించింది. అయితే కరోనాతో ఆ చేనేత కార్మికులు జీవనాధారాన్ని కోల్పోయారు. వారికి ఎలాగైనా సహాయం అందించాలనే తపనతో నేనూ, నా సోదరి వారి గ్రామాల్లో పర్యటించాం. వారి కష్టాలను సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తెచ్చాం. అందరికి సహకారంతో 700 కుటుంబాలను ఆదుకున్నాం’ అంటూ మహారాణి హోదాను సార్థకం చేసుకున్నారు రాధికారాజె గైక్వాడ్.

‘కొందరు అనుకున్నట్టుగా మహారాణి అంటే హారాలు ధరించి ముస్తాము కావడమే కాదు.. ఆ వెలుగులకు దూరంగా వాస్తవం వేరే ఉంటుంది. నేను సంప్రదాయాలనే హద్దులను దాటుకొని, నాకంటూ ఒక పరిధిని గీసుకున్నాను. నా కుమార్తెలకు అదే స్వేచ్ఛను అందిస్తున్నాను’ అంటూ ఆమె ముగించారు.