Business

పసిడి ధర పెరిగింది-వాణిజ్యం

పసిడి ధర పెరిగింది-వాణిజ్యం

* మీరు పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.2,724 విలువైన మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్ జూలై 3 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొనాలంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ కోసం రూ.2,724(36.56 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల మైక్రోసాఫ్ట్ యూజర్లు జూలై 3 వరకు పీడీఎఫ్ మేనేజర్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

* అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో భారత్‌లో పసిడి ధర పెరిగింది. గురువారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో దేశ రాజధాని దిల్లీలో రూ.10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.526 పెరిగి రూ.46,310కి చేరింది. రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. బుధవారం 10గ్రాముల బంగారం రూ. రూ.45,784 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఇటీవల భారీగా తగ్గిన వెండి గురువారం రూ.1,231 పెరిగి, కిలో రూ.68,654కు చేరింది. అంతకుముందు కిలో రూ.67,423గా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 1,778 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సు 26.25 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.48,760 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు డీలాపడ్డాయి. అదే సమయంలో ఆటో, ఫార్మా షేర్లు రాణించడం కొంత కలిసొచ్చింది. ఉదయం 52,547 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొంది. చివరికి 164.11 పాయింట్లు నష్టపోయి 52,318.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41.50 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.55 వద్ద ముగిసింది.

* కరోనా ఇబ్బంది పెట్టిన 2020-21 ఏడాదిలో భారత్‌ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేయడం విశేషం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం కరెంట్‌ ఖాతా లోటు నమోదైంది. మార్చి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు 8.1 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 1 శాతానికి చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 0.6 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతంగా మాత్రమే ఉంది. ఇక డిసెంబరు త్రైమాసికం(2020-21)లోనూ లోటు 0.3 శాతంగా నమోదైనట్లు బుధవారం ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో వాణిజ్య లోటు 157.5 బిలియన్‌ డాలర్ల నుంచి 102.2 బిలియన్‌ డాలర్లకు తగ్గడంతో కరెంట్‌ ఖాతా నిల్వలు కాస్తా మిగులులోకి వెళ్లాయని ఆర్‌బీఐ పేర్కొంది.