ScienceAndTech

అంతరిక్షంలోకి గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష-తాజావార్తలు

అంతరిక్షంలోకి గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష-తాజావార్తలు

* శిరీష బండ్ల: ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోంది.దీనిలో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు మూలాలున్న యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు.ఈ అంతరిక్ష యానం కోసం వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను సిద్ధంచేసింది. ముఖ్యంగా అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం దీన్ని అభివృద్ధి చేసింది.ఈ రాకెట్‌లో అంతరిక్షం వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌కు అమెరికాకు చెందిన ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీచేసింది.దీంతో ఈ నెల 11న ప్రయోగం చేపట్టేందుకు వర్జిన్ గెలాక్టిక్ సిద్ధమవుతోంది. ‘‘వాతావరణం అనుకూలించకపోతే లేదా ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఈ ప్రయోగం కొన్ని రోజులు వాయిదా పడుతుంది. కానీ తప్పకుండా ప్రయోగం జరుగుతుంది’’అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈ నెల 20న అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపడుతోంది. జులై 11న అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న మొట్టమొదటి తెలుగు మహిళ శిరీష బండ్ల. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి కాగా కల్పనా చావ్లా తొలి భారతీయ మహిళా వ్యోమగామి . సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి అంతరిక్షానికి వెళ్లిన మరో భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి. శిరీష తల్లిదండ్రులు గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డ డాక్టర్ మురళీధర్ బండ్ల, అనూరాధ బండ్ల. గుంటూరు జిల్లాలో పుట్టిన ఆస్ట్రనాట్ శిరీష జులై 11 తమ బృందంతో అంతరిక్షంలోకి వెళ్తున్న సందర్భంగా తనకి, ఆ బృందానికి శుభాకాంక్షలు.

* కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి అక్రమంగా నీటి వినియోగం సరికాదని.. వివాద పరిష్కారానికి కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదని రోజా అన్నారు.

* కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్‌తో జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు కేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్‌ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

* ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బాగ్రం వైమానిక స్థావరం నుంచి తమ దేశాలకు వెళ్లిపోయినట్లు అధికారిక సమాచారం. దీంతో అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని నిపుణులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఐరోపా దేశాల బలగాలు సైతం వెనక్కి వెళ్లాయి. అఫ్గాన్‌లో తమ మిషన్‌లు ముగిశాయని, సైనికులంతా స్వదేశాలకు చేరుకున్నారని జర్మనీ, ఇటలీ ఇటీవలే ప్రకటించాయి. పోలండ్‌ కూడా పూర్తిస్థాయిలో తమ సైనికులను వెనక్కి రప్పించుకుంది.

* అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

* జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్‌ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారు. రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారు’ అని చెప్పారు.

* కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పారు. హైదరాబాద్‌ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* నగరంలోని సీసీఎంబీలో ఏర్పాటు చేసిన అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ ల్యాబోరేటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. లాకోన్స్ పేరుతో సీసీఎంబీలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన కేంద్రంలో నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్, సహాయక పునరుత్పత్తి ల్యాబ్‌లు ఉన్నాయి. లాకోన్స్‌ను పరిశీలించిన అనంతరం వన్య ప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో వెంకయ్య ముచ్చటించారు. ఆ తర్వాత లాకోన్స్ సిబ్బంది, సెంట్రల్ జూ అధికారులు సంయుక్తంగా రాసిన ‘ఇంట్రడక్షన్ టూ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్’ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

* ఎవరైనా మంత్రి పనితీరు బాగోలేకపోతే, అలాంటి అంశాలను ప్రధానమంత్రి చూసుకుంటారు. అంతే కానీ, న్యాయస్థానాలు ఏమీ చేయలేవని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికారిక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కేంద్రమంత్రి వీకే సింగ్‌ తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) తోసిపుచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

* యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. జూన్‌ నెలలో ₹5,47,373 కోట్ల విలువైన 2.8 బిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెల్లడించింది. ఇప్పటి వరకూ జరిగిన యూపీఐ లావాదేవీల్లో ఇదే అధికం కావడం గమనార్హం. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు దాదాపు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వస్తు, సేవలకు డిమాండ్‌ ఏర్పడిందనడానికి దీన్ని సంకేతంగా భావించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.