Politics

విజయనగరం-విశాఖపట్నం జంట నగరాలు-తాజావార్తలు

విజయనగరం-విశాఖపట్నం జంట నగరాలు-తాజావార్తలు

* విజయనగరం, విశాఖపట్నం రెండూ జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టు రక్షణశాఖకు చెందినదే కాబట్టి వారికే అప్పగిస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టును కలుపుతూ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు విజయసాయి వివరించారు.

* తాను పార్టీ మారుతున్నట్లు వచ్చే వార్తలో నిజం లేదని తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిబద్ధతకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తన ప్రయాణం అని తుమ్మల వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.

* బండ్లగణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఈ ఏడాది జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తున్న జీవిత తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి జీవిత ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ బండ్లగణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. ‘‘మా’ అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

* గత రెండేళ్లుగా రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అనాదిగా కులవృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిందని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమం- కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై పూర్తి హక్కులను మత్స్యకార సొసైటీలకే అప్పగించాలని తేల్చి చెప్పారు. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగించే మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారి వృత్తిని, జీవనాన్ని నాశనం చేసేలా తీసుకొచ్చిన జీవోను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

* అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా నేత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైకాపా నేత జయరామరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం-కనేకల్‌ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని గుత్తేదారుపై మాటలతో దాడికి దిగారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్‌ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు చేపట్టింది. అయితే, స్థానిక ఎమ్మెల్యేను అడగకుండా పనులు చేపట్టడమేంటని వైకాపా నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు.

* వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రిపై కేసు నమోదయ్యింది. కులాల మధ్య విరోధం పెంచడంతో పాటు ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై రాయ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం బఘేల్‌.. చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు. ఓ వర్గం వారిని విదేశీయులుగా పేర్కొన్న ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ బఘేల్‌ (75), వారిని గ్రామాల్లోకి రానివ్వవద్దంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా వారిని గ్రామాల నుంచి నిషేధించేందుకు ఇతర వర్గాల వారితో మాట్లాడుతాను అంటూ పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. సీఎం తండ్రి వ్యాఖ్యలు కులాల మధ్య విరోధం పెంచడంతో పాటు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ‘సర్వ్‌ బ్రాహ్మిణ్‌ సమాజ్‌’కు చెందిన ప్రతినిధులు రాయ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 153-ఆ, 505-ఆ కింద సీఎం తండ్రి నంద కుమార్‌ బఘేల్‌పై దీన్‌దయాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

* దళితుల ఆర్థిక సాధికారతకు తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై విపక్ష నేతలు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని విపక్షాలకు సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో ఈ నెల 7న జరిగే తెరాస విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బస్తీ నుంచి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చిస్తామన్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సమావేశానికి మంత్రులు, స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు. తెరాసకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని.. తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగిందని పేర్కొన్నారు. తాడు బొంగరం లేని వాళ్లు కూడా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

* ఒక రైతు కుమారుడినైన తనను ఈ స్థాయికి తెచ్చింది గురువులేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తన కుటుంబంలో ఎవరూ పాఠశాల విద్య తర్వాత చదవలేదని.. తనను గురువులే గైడ్‌ చేశారని.. వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. హైదరాబాద్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ అక్రిడేటెడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.