WorldWonders

రాజు మృతదేహంపై చెప్పులు విసిరిన వరంగల్ ప్రజలు-తాజావార్తలు

రాజు మృతదేహంపై చెప్పులు విసిరిన వరంగల్ ప్రజలు-తాజావార్తలు

* టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిప‌డ్డారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను రేవంత్ గాడిద‌తో పోల్చిన ఓ న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థ‌ర్డ్ రేట్ క్రిమిన‌ల్‌కు పార్టీ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఇలానే ఉంటుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పీసీసీ చీప్ అని రేవంత్‌ను మంత్రి త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ శ‌శిథ‌రూర్ త‌న బృందంతో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించి, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్‌ను కూడా శ‌శిథ‌రూర్ కొనియాడారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పర్యటనపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. శ‌శిథ‌రూర్ ఓ గాడిద అని, ఆయ‌న‌ను పార్టీ త్వ‌ర‌లోనే బ‌హిష్క‌రిస్తుంద‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్న‌ట్లు ఆ క‌థ‌నంలో ఉంది.

* ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్ట‌ర్ల‌ను నిషేధించారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్ట‌ర్ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. అభిరామ్ అనే ఓ జ‌ర్న‌లిస్టు.. ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటించే ఆశ్లీల పోస్ట‌ర్ల విష‌యాన్ని స‌జ్జ‌నార్ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజ‌న్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇలాంటి పోస్ట‌ర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ఇచ్చిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల ఫోటోల‌ను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

* ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న కేబినెట్ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 24వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌, మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ స‌మావేశ‌మై అసెంబ్లీ ఎజెండాను ఖ‌రారు చేయ‌నుంది.

* తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియ‌మించారు. ప్ర‌స్తుతం గోవ‌ర్ధ‌న్ నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌న‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా నియమించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవ‌ర్ధ‌న్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

* హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కేటినెట్‌ ఆదేశించింది. వైద్యారోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం లభించింది.

* విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతి ఇచ్చింది. మైనార్టీ సబ్ ప్లాన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేటు ఆస్తిగా మార్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు రుణాలు పొంది కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్‌ కార్పొరేషన్ వద్దే ఉన్నాయన్నారు. ఇలా రాష్ట్రంలో 56,67,301 మంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రుణ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

* ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు సాధించటం లక్ష్యంగా చేసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తామని.. ఈ విషయంలో కంపెనీలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు.

* తనీశ్‌, ముస్కాన్‌ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. జానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. విలన్‌ బృందం వరుస హత్యలు చేస్తుంటుంది. హీరో బృందం వాటిని చిత్రీకరించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. హత్యల్ని షూట్‌ చేసిన కెమెరా విలన్లకి దొరుకుతుంది. దాంతో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి.

* తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. సైదాబాద్‌ బాధిత కుటుంబాన్ని విజయశాంతి పరామర్శించారు. సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటని.. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదన్నారు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

* షావోమి కంపెనీ స్మార్ట్‌ వేరబుల్స్‌ శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు గృహోపకరణాలను విడుదల చేసిన షావోమి.. తాజాగా స్మార్ట్‌ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌గ్లాసెస్‌ మోడల్స్‌కి భిన్నంగా సరికొత్త ఫీచర్స్‌ని ఇందులో పరిచయం చేసినట్లు తెలిపింది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో మైక్రో ఎల్‌ఈడీ ఆప్టికల్ వేవ్‌గైడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌గ్లాసెస్‌ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, నేవిగేషన్, కాలింగ్, ఫొటో, ట్రాన్స్‌లేషన్ వంటి సర్వీసులను యూజర్‌కి అందిస్తుంది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌ సాయంతో ఈ స్మార్ట్‌గ్లాసెస్ పనిచేస్తాయి.

* ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మూడు రోజుల క్రితం నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ బాధ్యతలు చేపట్టగా.. గురువారం మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది శాసనసభ్యులతో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. 14 మంది సహాయ/స్వతంత్ర మంత్రులు. గుజరాత్‌లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ‘నో రిపీట్‌’ విధానాన్ని అవలంభించింది.

* అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడి మహిళల హక్కులతో పాటు సమ్మిళత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం రావాలంటే తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

* ‘ధోనీ అద్భుతమైన కెప్టెన్‌’ అని శ్రీలంక మాజీ స్టార్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రశంసించారు. ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ధోనీతో కలిసి ఆడిన అనుభవాలను గుర్తుచేసుకొన్నారు. ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చాలా బాగుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌(2008) గురించి మాట్లాడుకుంటే.. టోర్నీలో చాలా సార్లు 200 పరుగుల మార్కును దాటడంతోపాటు ఎక్కువ వికెట్లు తీశారు. కెప్టెన్‌గా ధోనీ చాలా బాగా పనిచేశాడు. అప్పుడు జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు వారి జాతీయ జట్లలో దిగ్గజ క్రికెటర్లు. ధోనీ ప్రతి ఆటగాడిని అర్థం చేసుకుంటాడు. బలమైన జట్టుని నిర్మించాడు’ అని ముత్తయ్య పేర్కొన్నాడు.

* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి చేరింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు మార్చురీ గేట్లు మూసివేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంజీఎం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.