DailyDose

ఖమ్మం జిల్లాలో ₹100 కోసం వ్యక్తి హత్య-నేరవార్తలు

ఖమ్మం జిల్లాలో ₹100 కోసం వ్యక్తి హత్య-నేరవార్తలు

* హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫురానాపూల్‌కు చెందిన మహిళ (30) రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని హైదర్‌గూడకు బుధవారం సాయంత్రం వచ్చింది. స్థానికంగా ఉండే ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగేందుకు వెళ్లింది. అక్కడ పక్కనే కూర్చున్న ఓ ఆటో డ్రైవర్‌ మహిళను గమనించి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు.

* సెంట్రల్‌ దిల్లీ పహాడ్‌గంజ్‌లో వెలుగు చూసిన మరో ఘటనలో 14ఏళ్ల బాలికపై కుటుంబ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని టిఫిన్‌ చేద్దాం అని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలిని మార్కెట్‌లో విడిచిపెట్టాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాధితురాలు.. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు బాధితురాలి తల్లికి తెలిసిన వ్యక్తే అని పోలీసులు చెప్పారు.

* వంద రూపాయలు ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.. మరొకరిని కటకటాల పాలు చేసింది. కూలి డబ్బులు రూ.100 కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య వంద రూపాయల నోటు అగ్గి రాజేసింది. అందులో ఒకరి ప్రాణం పోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది కూలీలు రెండు నెలల కిందట రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరకు వ్యవసాయ పనులకు వచ్చారు. ఓ రైతు వద్ద పని చేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలీలైన దయాళ్‌, సేత్‌రాంల మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలోనే క్షణికావేశానికి గురైన సేత్‌రాం చాకుతో దయాళ్‌పై దాడి చేశాడు. ఛాతీపై బలంగా పొడవడంతో దయాళ్‌ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* దిల్లీలో ఓ యువతిని బాత్‌రూంలో బంధించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

* రాష్ట్ర గోదాముల సంస్థ, ఆయిల్‌ఫెడ్‌లో బయటపడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాయంపై ఆయా సంస్థల అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాముల సంస్థకు సంబంధించి భవానీపురంలోని ఐవోబీలో తొమ్మిది విడతలుగా రూ.9.5కోట్లు అధికారులు ఎఫ్‌డీ చేశారు. ఇటీవల ఆరాతీయగా.. డిపాజిట్‌ను గడువు తీరకుండానే మాయం చేసినట్టు తేలింది. దీనిపై సంస్థ అధికారులు భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమగ్ర వివరాలతో ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో తిరిగి వెళ్లినట్టు తెలిసింది. పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయనున్నట్టు సమచారం. గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 5 దఫాలుగా రూ.5కోట్లు అయిల్‌ఫెడ్‌ సంస్థకు చెందిన అధికారులు ఈఏడాది మేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. వీటి గడువు తేదీ వచ్చే ఏడాది మే వరకు ఉంది.