Movies

ఆస్కార్‌కు తమిళ చిత్రం

ఆస్కార్‌కు తమిళ చిత్రం

తమిళ చిత్రం ‘కూళంగల్’ (పెబెల్స్‌) 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు మనదేశం తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే విషయాన్ని శనివారం ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్శన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు (ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఎఫ్‌ఎఫ్‌ఐ జనరల్‌ సెక్రెటరీ సుప్రాన్‌ సెన్‌ తెలిపారు. ‘కూళంగల్‌’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచిందన్న విషయం తెలియగానే ఈచిత్ర నిర్మాత, నయనతారకు కాబోయే భర్త విఘ్నేశ్‌ శివన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ అండ్‌ ది ఆస్కార్‌ గోస్‌ టూ.. ఈ మాటలు వినే అవకాశం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆస్కార్‌ గెలుచుకునేందుకు కేవలం రెండు మెట్ల దూరంలో ఉన్నాను. ఒక నిర్మాతగా మంచి కంటెంట్‌ తెరపై చూపించినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.

దర్శకుడు పీఎస్‌ వినోద్‌ కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ బాగా చిత్రీకరించారు. ఆయన కుటుంబంలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఇది తెరకెక్కింది. ‘కూళంగల్‌’ ఇద్దరి తండ్రీకొడుకుల కథ. తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా సారాంశం. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నయనతార, నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌ సంయుక్తంగా ‘రౌడీ పిక్చర్స్‌’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులు దక్కించుకొని విజేతగా నిలిచిందీ చిత్రం. ‘సర్దార్‌ ఉద్దమ్‌’, ‘షేర్ని’, ‘మండేలా’ చిత్రాలతో పోటీ పడి ఇండియా నుంచి ఆస్కార్‌కు వెళ్తోంది. కాగా వచ్చే ఏడాది 2022 మార్చి 22న 94వ అకాడెమీ అవార్డు ప్రదానోత్సవం అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో జరగనుంది.