Business

AndhraSand వెబ్‌సైట్ ప్రారంభం-వాణిజ్యం

AndhraSand వెబ్‌సైట్ ప్రారంభం-వాణిజ్యం

* ఎల్​పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది.వాణిజ్యపరంగా వినియోగించే ఎల్​పీజీపై రూ.266 పెరిగింది.నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.తాజా పెంపుతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2000.50కు చేరింది.ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉంది.అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర యథాతథంగా ఉంది.

* రాష్ట్రంలో ఇసుక అవసరమైన వారు ఇసుక రీచ్​లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్​​లైన్​లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.గతంలో ఏపీ ఖనిజాబివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మాదిరిగానే డోర్ డెలివరీ చేసేందుకు అందులో ఏర్పాట్లు చేశారు.గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ…. ఆన్​లైన్ పోర్టల్​ను అదివారం ప్రారంభించింది.www.andhrasand.com పేరిట ఉండే ఈ పోర్టల్​లో ఆదివారాలు తప్ప రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు.రీచ్​లో టన్ను రూ.475, ఆయా డిపోల్లో అధికారులు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోనున్నారు.డోర్ డెలివరీ కావాల్సిన వారి చిరునామాను గూగుల్ మ్యాప్ ద్వారా ఎంత దూరం ఉంటుందో పరిగణలోకి తీసుకుని, అందుకు అయ్యే రవాణా ఛార్జీలను ఆన్​లైన్​లో పేర్కొంటారు.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. 2024 డిసెంబరు వరకు అంటే దాదాపు ఎన్‌డీఏ-2 పాలన ముగిసే వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆరేళ్ల పదవీకాలాన్ని పొందిన అయిదో గవర్నర్‌గా దాస్‌ గుర్తింపు పొందారు. ఈ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే, ఆర్‌బీఐకి అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండో గవర్నర్‌ అవుతారు.

* గత రెండు వారాలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో నేడు సూచీలకు దన్ను లభించింది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. రూపాయి గతకొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఇండియన్‌ మార్కెట్లు దీర్ఘకాలంలో బుల్లిష్‌గానే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇటీవలి దిద్దుబాటు నేపథ్యంలో మదుపర్లు నేడు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక రంగాల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. వీటితో పాటు జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరడం, తయారీ కార్యకలాపాలు బలంగా నమోదుకావడం కూడా సూచీల్లో విశ్వాసం నింపింది. ఈ పరిణామాలే నేడు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి.

* తయారీరంగ కార్యకలాపాలు అక్టోబరు నెలలో మరింత పుంజుకున్నాయి. కంపెనీలు ఉత్పత్తితో పాటు ముడిసరకుల కొనుగోలును సైతం పెంచాయి. రానున్న రోజుల్లో డిమాండ్‌ మరింత పుంజుకునే అవకాశం ఉందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొత్త ఆర్డర్లు సైతం పుంజుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తయారీ కార్యకలాపాలు ఏడు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.

* సెప్టెంబరు త్రైమాసికంలో తమ సంస్థ ఆర్జించిన ఆదాయాల్లో మూడో వంతు వర్థమాన దేశాల నుంచే వచ్చినట్లు యాపిల్‌ తెలిపింది. భారత్‌, వియత్నాంల్లో తమ వ్యాపారం రెట్టింపైందని కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ స్వయంగా వెల్లడించారు. 2021 సెప్టెంబరు 25తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఆపిల్‌ ఆదాయం 29 శాతం వృద్ధితో 8,340 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6,25,000 కోట్లు) చేరింది. నికర లాభం కూడా 1,267 కోట్ల డాలర్ల నుంచి 2,055 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,54,000 కోట్లు) పెరిగింది. అయితే, భారత్‌లో యాపిల్‌ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ.. సంస్థ మొత్తం ఆదాయంలో మన దేశ వాటా ఇంకా నామమాత్రంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇది కంపెనీకి అవకాశమని కూడా తెలిపారు. సంస్థ ఆదాయంలో భారత్‌ వాటా ఇంకా 1 శాతం కంటే తక్కువే ఉందని.. ఇది వ్యాపార విస్తరణకు ఓ సదావకాశమని అభిప్రాయపడ్డారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర విక్రయాలు 36,580 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంటే రోజుకు ఒక బిలియన్‌ డాలర్ల విక్రయాలన్నమాట! కానీ, ఇందులో భారత్‌ వాటా 0.9 శాతం మాత్రమే. అయితే, 2020 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 0.6-0.7 శాతం వాటాతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. ఇక భారత్‌లో వచ్చిన ఆదాయంలో 60 శాతం ఐఫోన్‌ విక్రయాల ద్వారా వచ్చిందే. ఇది కూడా కంపెనీ మొత్తం ఐఫోన్‌ విక్రయాల్లో ఒక శాతం కంటే తక్కువే.