Politics

రచయిత్రిగా స్మృతి. పాకిస్థాన్‌లో అత్యాచారానికి కొత్త శిక్ష-తాజావర్తలు

రచయిత్రిగా స్మృతి. పాకిస్థాన్‌లో అత్యాచారానికి కొత్త శిక్ష-తాజావర్తలు

* ఇండియా- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు రసకందాయంలో పడ్డాయి. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను మన దేశం కొనుగోలు చేస్తుండటమే ఇందుకు కారణం. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి ఈ ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటుండటంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర దేశాలపై ప్రయోగించేందుకు తయారు చేసుకున్న ‘ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం (సీఏఏటీఎస్‌ఏ-కాట్సా)’ అస్త్రాన్ని మనపై ప్రయోగించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు ఇండియాపై కొరడా ఝళిపించాల్సిందేనని కొందరు అమెరికన్లు వాదిస్తుండగా, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు.

* కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రచయిత్రిగా మారారు. త్వరలో తన మొదటి నవల ‘లాల్‌ సలాం’తో పాఠకులను పలకరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 76 మంది కేంద్రీయ రిజర్వ్‌ పోలీసు సిబ్బందిని హతమార్చిన ఘటన ఇతివృత్తంగా ఈ నవల రాసినట్లు వెల్లడించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశానికి సేవ చేసిన వ్యక్తులకు నివాళిగా దీన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు.

* తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్‌ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోకి వరదనీరు చేరింది.

* చట్టసభల్లో చర్చలకు విలువలు జోడించడంతోపాటు అన్ని పార్టీలూ చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనలపై కాంగ్రెస్‌ పార్టీ నేత పీ చిదంబరం విరుచుకుపడ్డారు. పార్లమెంటులో నాణ్యమైన చర్చలు జరగాలంటూ ప్రధాని చెప్పడం ఆశ్చర్యం కలిగస్తోందన్న ఆయన.. అసలు పార్లమెంటులో జరిగే చర్చల్లో ప్రధానమంత్రి పాల్గొంటారా? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కీలక అంశాలపై చర్చించకుండా ప్రభుత్వమే తప్పించుకుంటోందని ఆరోపించారు.

* ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అదుపులోకి తీసున్న విషయం తెలిసిందే. శివశంకర్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి పులివెందుల తరలించిన సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కడప కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు వద్ద శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

* అత్యాచారాలకు పాల్పడటం అలవాటుగా మారినవారిపై పాకిస్థాన్ప్ర భుత్వం కఠినంగా వ్యవహరించనుంది. మహిళలు, చిన్నారులపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడి దోషులుగా తేలినవారిపై ఇకనుంచి అక్కడి ప్రభుత్వం కెమికల్‌ క్యాస్ట్రేషన్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. అంటే రసాయనాల సహాయంతో రేపిస్టులను నపుంసకులుగా మార్చనుంది. దీనికి సంబంధించిన బిల్లును తాజాగా పాక్‌ పార్లమెంట్ ఆమోదించింది.

* ‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని.. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడారు.

* యుద్ధం కాదు.. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న ఆయన.. అన్నీ తనకే తెలుసునని అహంకారపూరితంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడం ఏంటని ఆయన నిలదీశారు.