DailyDose

బెజవాడను వణికిస్తున్న చెడ్డీగ్యాంగ్-నేరవార్తలు

* కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో వరుస చోరీలు జరుగుతున్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. నగరంలో చోరీలు చేస్తున్న వారిని చెడ్డీగ్యాంగ్‌గా భావిస్తున్నా మని సీపీ కాంతిరాణా వెల్లడించారు. ఈ తరుణంలో సీపీ గుణదల, ఉప్పులూరు, మధురానగర్‌ రైల్వేస్టేషన్లలో డీసీపీ హర్షవర్థన్‌రాజు, అదనపు డీసీపీ బాబూరావు, క్రైం ఏసీపీ శ్రీనివాసరావుతో కలిసి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇక నగరంలో దొంగలను పట్టుకునేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. అంతేకాక.. ఈ ముఠాలు చోరీలకు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు శివారు రైల్వేస్టేషన్ల వద్ద, రైల్వే ట్రాక్‌లకు పక్కన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయని మధ్యప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు.

* బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, కేజిన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న శిరికొండ జయచంద్రశేఖర్‌ చోరీకి పాల్పడినట్టు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా మీడియాకు తెలిపారు. వేలి ముద్రలు, సీసీ కెమెరా దృశ్యాలు, తాళం పగలగొట్టిన విధానం ఆధారంగా చేసుకొని నిందితుడ్ని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం నగదు, ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు.

* బాత్రూమ్‌లో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో ఉదంతం వెలుగు చూసింది. ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడని ఫిలింనగర్‌కు చెందిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 నెలలుగా ఇంటి యజమాని కుమారుడు ..తాను స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా అతనికే మద్దతు పలుకుతున్నారని ఆమె వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా బాధితుల కంట పడటంతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. సీఐ సురేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నామాల సతీష్‌, అతని తండ్రి రామకృష్ణారావు నవంబరు 18న ఫంక్షన్‌ నిమిత్తం కొలకలూరు గ్రామానికి వచ్చారు. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట నుంచి విజయవాడ బయల్దేరారు. పెదకాకాని మండలం మానససరోవరం దాటిన తర్వాత సర్వీసు రోడ్డు నుంచి హైవేపై ఎక్కుతుండగా వెనుకనుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు.. సతీష్‌, అతని తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని తన్నడంతో ఇద్దరూ రోడ్డు మార్జిన్‌లో పడిపోయారు. నిందితులిద్దరూ వారిని బెదిరించి రూ.4వేల నగదు, మొబైల్‌ ఫోన్‌ లాక్కుని పరారయ్యారు.

* బేగంపేటలోని టాలీవుడ్‌ పబ్‌పై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 33 మంది పురుషులతో పాటు 9మంది మహిళలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. గతంలో ఇదే పబ్‌ను లిబ్సన్‌ పబ్‌ పేరుతో నిర్వహించిన నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తిరిగి అదే పబ్‌కు టాలీవుడ్‌ పబ్‌గా పేరుమార్చిన నిర్వాహకులు వేణుగోపాల్‌, సాయి భరద్వాజ్‌, పబ్‌ మేనేజర్‌ రాము.. మహిళలతో అసభ్యకరంగా పురుషులతో కలిసి నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వివరించారు. పొట్టి దుస్తులు ధరించే మహిళలకు రోజుకు రూ.1000 ఇస్తూ పురుషులతో అసభ్యంగా నృత్యాలు చేయించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు వివరించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్టు టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ తెలిపారు.