DailyDose

నేటి తాజా వార్తలు- 24/01/2022

నేటి తాజా వార్తలు- 24/01/2022

*టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. 

*కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘చలో గుడివాడ’ కార్యక్రమం చేపట్టి అక్కడ జరిగిన వ్యవహారాలతో సంబంధం వున్న వ్యక్తుల వివరాలు బయటపెడతామని ప్రకటించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ పేరు చెబితే గుడివాడ కేసినో గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ అంటే పోర్టులు, పరిశ్రమలు గుర్తుకు వచ్చేవని…ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యిందన్నారు. కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లోనే కేసినో జరిగిందని దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. తక్షణమే మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్‌ చేయాలని, లేకపోతే తొలుత గుడివాడ, తరువాత తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు. 

*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా భరండా పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. భరండా అటవీప్రాంతంలో కిస్‌కోడో ఏరియా కమిటీ మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు ఆదివారం కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య సుదీర్ఘ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు, మందులు, ఇతర సామాగ్రి లభించినట్లు  డీఎస్పీ అనూజ్‌కుమార్‌ ప్రకటించారు.
*కార్వీ ఎండీ పార్థసారథిని 5 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు ఈడీ ప్రశ్నించనుంది. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఈడీ ప్రశ్నించనుంది. గతేడాది సెప్టెంబరులో పార్థసారథిని ఈడీ ప్రశ్నించింది. రూ.3వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు కార్వీ ఎండీ పార్థసారథి ఆరోపణలున్నాయి. ఈ రోజు ఉదయం కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వీ మోసాలకు పాల్పడ్డారు. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.500 కోట్లు రుణం పొంది చెల్లించకుండా ఎగ్గొట్టారని అభియోగాలు ఉన్నాయి. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా కష్టమర్లు షేర్‌లు కొనుగోలు చేశారు. నిధులను తన స్వంత అకౌంట్‌లకు కార్వీ సంస్థ  ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు గుర్తించారు. 

* కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,95,136కు పెరిగింది. 24 గంటల్లో కరోనాతో  ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,549 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 93,305 యాక్టివ్‌ కేసులున్నాయి. మహమ్మారి ముంచుకోస్తోన్నది. మొదటి రెండు వేవ్‌లకన్నా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటోందన్న హెచ్చరికలు వాస్తవమవుతున్నాయి. అయినా ప్రజల్లో కనీస జాగ్రత్తలపై శ్రద్ధ ఉండటంలేదు. కరోనా నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. నిబంధనలు పక్కాగా అమలు చేసి కట్టడికి చర్యలు తీసుకునే వారే లేకుండా పోయారు. ఇదే అవకాశంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక కరోనా టెస్టులు సక్రమంగా జరగకపోవడం.. గతంలో ఉన్నట్లు కేంద్రాలు అందుబాటులో లేక పోవడం.. ఎక్కడ చేస్తున్నారో తెలియక పోవడం.. తదితరాలతో కరోనా బాధితుల గుర్తింపు కష్టంగా ఉంటోంది. 

*పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం పాకిస్తాన్ ప్రధాని లాబీలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూని తన కేబినెట్ నుంచి తొలగించినప్పుడు పాక్ నుంచి అనేక విజ్ణప్తులు తనకు వచ్చాయని, సిద్ధూని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవాలని స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తనకు రిక్వెస్ట్ పంపారని ఆయన వెల్లడించారు. సిద్ధూ తనకు పాత మిత్రుడని ఇమ్రాన్ గుర్తు చేసినట్లు సిద్ధూ పేర్కొన్నారు

*ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు ‘ఒపీనియన్ పోల్స్’ విడుదల చేశాయి. చాలా సర్వేల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. అయితే ఇవి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్వహించిన సర్వేలని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బీజేపీకి అనుకూలంగా ఒపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా ఒపీనియన్ పోల్స్‌ని ‘ఓపియమ్ పోల్స్’(మత్తునిచ్చే పోల్స్) అంటూ అఖిలేష్ విమర్శించారు.

*ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే తమ వైపు నుంచి.. ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగమే కమిటీ అని  మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జీవోలు అబయన్స్‌లో పెట్టి, కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని, అయితే మంగళవారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు.

*సత్తెనపల్లి మండలం, పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. సమయానికి బడికి రాని టీచర్లు మాకోద్దని నినాదాలు చేశారు. 100 శాతం ఫలితాలు తీసుకురాలేని టీచర్లు మాకోద్దన్నారు. కాగా ఉపాధ్యాయులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

*ఐఏఎస్ కేడర్ రూల్స్ 1954ను మార్పు.. డిప్యూటేషన్‌ రూల్స్‌ ప్రతిపాదించిన కేంద్రం తీరుపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖరాశారు.   

*పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్‌కరంజి నగర శివార్లలోని వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉన్న యూనిట్‌లో మంటలు చెలరేగాయి.

*బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీనికితోడు కోస్తా రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

*గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతుంది. నిన్న టీడీపీ ఫ్లెక్సీలకువైసీపీ వర్గీయులు నిప్పుపెట్టారు. ఇవాళ మరికొన్ని ఫ్లెక్సీలను చించేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వైసీపీ వర్గీయులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

*ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. థర్డ్ వేవ్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారి కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

*గ్రేటర్లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జిల్లాలో పొల్చితే.. జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీహెచ్సీ కేంద్రాల్లో కొవిడ్ టెస్ట్లు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెస్ట్లు చేయించుకునేం దుకు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్లలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఓ పక్క కరోనా నిర్ధారణ పరీక్షలు, మరో పక్క వ్యాక్సినేషన్.. సిటీ జనం ఆస్పత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. సీజనల్ వ్యాధులూ విజృంభిస్తుండటంతో చిన్న క్లినిక్లకు బాధితుల తాకిడి పెరుగుతోంది. గ్రేటర్లో ఫీవర్ సర్వేను జీహెచ్ఎంసీ బృందాలు ప్రారంభించాయి. బస్తీలు, కాలనీల్లో వైద్యసిబ్బందితో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నారు. గ్రేటర్లో సుమారు 1,400కు పైగా బృందాలు ఫీవర్ సర్వేలో పాల్గొంటున్నాయని అధికారులు తెలిపారు.