DailyDose

TNI తాజా వార్తలు 29/1/2022

TNI తాజా వార్తలు 29/1/2022

* ఈనెల 31వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో కోవిడ్‌పై శనివారంనాడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అలాగే సోమవారం నుంచి 1-9 వరకూ ఫిజికల్ క్లాసెస్ తిరిగి ప్రారంభించేందుకు స్కూళ్లను అనుమతించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. సినిమా థియేటర్లు మినహా హోటళ్లు, బార్లు, పబ్‌లు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతించనున్నారు. పెళ్లిళ్లకు 300 మంది వరకూ అనుమతిస్తారు. మహారాష్ట్ర, గోవా, కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

*దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1961లో గొల్లపూడి మారుతీరావుతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

* ప్రకాశం జిల్లా మాట్రిమోనియల్ సైట్‌లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసిన ఘరానా సైబర్ మోసగాడిని అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.

* అమీర్పేట లోని KLM షో రూమ్ సీజ్ చేసిన GHMC అధికారులు

* తొర్రూరుకు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెల్లికుదురు మండలం సంధ్యా తండాలో ఉపాధ్యాయుడు జేత్ రామ్ కుటుంబ సభ్యులను రేవంత్ పరామర్శించారు. అనంతరం బయ్యారంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సాగర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

* ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ఆకారపు అరుణ్ కుమార్, కంది శ్రావణ్ ముట్టడించారు. ఎమ్మెల్యే అఫీస్‌ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

*సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆదివారంతో తెలంగాణలో విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులు ముగియనున్నాయి. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

*కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 27 నగరాల్లో ఇప్పటికే ఉన్న నైట్ కర్ఫ్యూని ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ సమయం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. గాంధీనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

*కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ చేపట్టింది. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సిబ్బంది ప్రదర్శనలో పాల్గొన్నారు. తమకు తీరని నష్టాన్ని చేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మాట్లాడుతూ.. 2022 జనవరి నెలకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతో కలిపి పాత జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

*అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటోందని యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫోటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహం, భార్యభర్తలు విడిపోయినట్టు సమాచారం.

*దేశంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోంది. అందులో భాగంగానేప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 165.04 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 56 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.89 శాతంగా కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్్య 20,04,333 ఉండగా వీక్లీ పాజిటివిటీ రేట్ 16.89 శాతంగా వుంది.

*చైర్మన్‌తో సహా 16 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హజ్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్జీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీకి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు (ప్రస్తుతం కాంపిటెంట్‌ అథారిటీ ద్వారా నిర్వహింపబడుతోంది) ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ అధికారి.. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా, సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. వీరితోపాటు ఈ కమిటీలో మహ్మద్‌ నవాజ్‌ బాషా (ఎమ్మెల్యే), ఇక్బాల్‌ బాషా (ఎమ్మెల్సీ) తో పాటు మరో పద్నాలుగు మంది సభ్యులుగా ఉన్నారు.

*జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్‌ స్పోర్ట్స్‌ షాపు నిర్వాహకులు టి.హరీష్‌ రూ.15వేల ఆర్థికసాయం, షూ, ట్రాక్‌ సూట్‌ను శుక్రవారం అందజేశారు. ‘ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ పోటీలకు యాసిన్‌ ఎంపిక’ అని ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌ పేజీలో ప్రచురితమైన వార్తకు స్పందించి ఈ సహాయం అందించారు.

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి విశాఖపట్నం ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. విశాఖలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తోన్నాయి. వరుసగా రెండు రోజులపాటు సీమత్మదారలో ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇప్పటికే కరోనా కారణంగా జిల్లా కలెక్టర్, మేయర్ స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటే, ఎంపీ మాత్రం ప్రజాదర్బార్ నిర్వహించడమేమిటని చాలా మంది మండిపడుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజాదర్బార్ నిర్వహణ ఎంతవరకు సమంజమని ప్రతిపక్షాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ వస్తే హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోని వచ్చారు. ఆయనకు బాగా ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోచ్చారని, మరీ ప్రజాదర్బార్ కారణంగా సామాన్య ప్రజలకు వైరస్ సోకితే ఎవరు చికిత్స చేయిస్తారు, వారికి ఎవరు ఆర్థిక సాయం చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి

*అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ నమునాల సేకరణ, పరీక్షలు, మందుల కిట్లు అందజేస్తున్నారు. కరోనా కాలంలో మరో అడుగు ముందుకు వేసి టెలీమెడిసిన్‌ ద్వారా ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. యూపీహెచ్‌సీలకు వచ్చిన దీర్ఘకాలిక రోగులు పెద్దాస్పత్రులకు వెళ్లకుండానే టెలీమెడిసిన్‌ ద్వారా స్పెషలిస్టులతో సంప్రదింపులు జరిపే అవకాశం కల్పిస్తున్నారు. ముందస్తుగానే స్పెషలిస్ట్‌లకు బాధితుల వివరాలు, వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఇబ్బందులు ఇలా అన్నీ రిపోర్టులు పంపి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. గత డిసెంబర్‌లో యుపీహెచ్‌సీల ద్వారా 1782 మంది, బస్తీ దవాఖానాల ద్వారా 951 మంది టెలీమెడిసిన్‌ సేవలు పొందారు.

* రోజు అనగా ది 29.1.2022 వ తేదీన ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీ కె. రాహుల్ దేవ్ శర్మ ఐపిఎస్., ,గారు జిల్లాలో ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశమును నిర్వహించినారు.