Politics

TNI నేటి రాజకీయం 29/1/2022

TNI నేటి రాజకీయం 29/1/2022

*ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై విచారణకు స్పీకర్‌ ఆదేశం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు. రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆయన ప్రివిలేజ్‌ కమిటీని ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

* నిఘా వైఫల్యం వల్లే విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడకం: నారాయణ
నిఘా వైఫల్యం వల్లే విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడకం పెరిగిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. గుజరాత్ పోర్టుల నుంచే డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో గంజా సరఫరా వెనుక వైసీపీ ఉందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

* ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు
పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శనివారం ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యుల సమస్యలను ఆప్ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. ధురి ప్రజలు తనను ఆదరిస్తారని, భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తనను ఆశీర్వదించారని చెప్పారు. పంజాబ్‌లో చరిత్ర సృష్టించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను జనవరి ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. టెలిఫోన్వా ట్సాప్ సందేశాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాన్ రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ధురి నుంచి ప్రస్తుతం శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

* 12సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదు: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వం హామీలన్నింటిపై మాట తప్పిందని.. 12 సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పీఆర్సీ ఉద్యమానికి అన్ని సంఘాలు మద్దతిస్తున్నాయన్నారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని బండి శ్రీనివాసరావు వాపోయారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలన్నారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని కోరుతున్నామని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

* మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది : రాహుల్ గాంధీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో ‘పెగాసస్’ స్పైవేర్ ఓ భాగమని ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురితమైన ఓ వ్యాసం వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్‌లో ఈ ఆరోపణ చేశారు. ‘‘ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అధికార పార్టీని, ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ ప్రభుత్వం భారత దేశానికి శత్రువుగా ఎందుకు వ్యవహరించింది? యుద్ధంలో ఉపయోగించే ఆయుధాన్ని భారతీయులపై ఎందుకు ఉపయోగించింది? అని ప్రశ్నించారు. పెగాసస్‌ను ఉపయోగించి చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం దేశద్రోహమని ఆరోపించారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. తాము న్యాయం జరిగేలా చేస్తామన్నారు.

* ఏపీలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి ఉంది: నారా లోకేష్
ఏపీలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు… ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానని జగన్‌రెడ్డి తెలిపారు. సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ… తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. భద్రతభవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్ పేర్కొన్నారు.

*క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని
గుడివాడ క్యాసినో అంశంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారని ఎద్దేవా చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని ప్రశ్నించారు. ఇంకా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గుడివాడలో నన్ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు. వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు

*TRS ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నేతలు
హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటిని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ..నిరుద్యోగి ముత్యాల సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ముత్యాల సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..ఆరూరి రమేష్ ఇంటిని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

*వైద్య ఆరోగ్యశాఖపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు: హరీష్
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నాడు సత్తుపల్లిలో హరీష్‌రావు పర్యటించారు. వంద పడకల ఆస్పత్రికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం హరీష్‎ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్‎లు వచ్చిన తర్వాత వందశాతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీలు పెరిగాయన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేశామని, కళ్యాణ లక్ష్మీ పథకం కింద 10 లక్షల పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తర్వాత ఒక్క ఖమ్మంలోనే కేతల్యాబ్ ఏర్పాటు చేసినట్లు హరీష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే బాగా జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్ నుండి బయటపడవచ్చని హరీష్ అన్నారు.

* కొత్త జిల్లాల ఏర్పాటు విషయం ఇప్పటిది కాదు: మంత్రి బాలినేని
కొత్త జిల్లాలు ఏర్పాటు విషయం ఇప్పటిది కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కాలంగా దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ఏం చేసినా కోర్టుకి వెళ్లడం టీడీపీకి అలవాటుగా మారిందని బాలినేని వ్యాఖ్యానించారు.