Politics

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – TNI రాజకీయం 11/02/ 2022

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – TNI రాజకీయం 11/02/ 2022

*పీలో రాష్ట్రపతిపాలన విధించాలి- ఎంపీ రఘరామకృష్ణరాజు
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌సభలో ఎంపీ రఘరామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. 377 నిబంధన కింద లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు.ఏపీలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని ఆయన అన్నారు.

* మోదీ, నితీశ్‌లకు పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తున్నా : లాలూ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లకు పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. వారికి పిల్లలు పుట్టాలని, వారు కూడా వంశపారంపర్య రాజకీయాలనే వాదనలో చేరాలని కోరుకుంటున్నానన్నారు. మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘నితీశ్ కుమార్, పీఎం మోదీలకు పిల్లలు లేకపోతే నేనేం చేయగలను? నితీశ్ కుమార్‌కు ఓ కుమారుడు ఉన్నాడు, కానీ ఆయన రాజకీయాలకు తగినవాడు కాదు. నేనేం చేయగలను? వారు కూడా వంశపారంపర్య రాజకీయాల్లోకి చేరే విధంగా వారికి కూడా పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లాలూ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

* మణిపూర్‌ పోలింగ్‌ తేదీల్లో మార్పు – ఫిబ్రవరి 27, మార్చి 3 బదులుగా ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీల్లో పోలింగ్‌
రెండు విడతల్లో జరగనున్న మణిపూ ర్‌ అసెంబ్లీ (మొత్తం 60 స్థానాలు) పోలింగ్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) స్వల్ప మార్పులు చేసింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీల్లో పోలింగ్‌ జరగాలి. అయితే ఫిబ్రవరి 27న ఆదివారం వస్తోందని, ప్రార్థనల కోసం చర్చికి వెళ్లడానికి వీలుగా ఆ రోజు పోలింగ్‌ను వాయిదా వేయాలని కొన్ని క్రైస్తవ సంస్థలు కోరడంతో ఎన్నికల తేదీలను మార్చాల్సి వచ్చిందని ఈసీలోని విశ్వసనీయవర్గాల సమాచారం.ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీల్లో మణిపూర్‌ పోలింగ్‌ ఉంటుందని ఈసీ గురువారం ప్రకటించింది. ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండటం, కొన్ని విజ్ఞప్తులు అందడం, గత దృష్ట్యాంతాలు.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలింగ్‌ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.

* మార్చి 14వ తేదీ వరకు రాజ్యసభ వాయిదా..
రాజ్యసభ సమావేశాలు మార్చి 14 వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పార్లమెంటు సమావేశాలను కోవిడ్ కారణంగా రెండు విడతలుగా జరపాలని నిర్ణయించారు.బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి విడత పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి.వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో ఈరోజు సభ్యులు కొంత గందరగోళం జరగడంతో రాజ్యసభను వాయిదా వేశారు. తిరిగి రాజ్యసభ వచ్చే నెల 14 వతేదీన మొదలు కానుంది. ఈరోజు సాయంత్రం లోక్ సభ జరగనుంది. లోక్ సభలో కూడా బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్చి14వ తేదీకి వాయిదా వేయనున్నారు. ఇక రాజ్యసభ వాయిదా పడినట్లు చైర్మన్ ప్రకటించారు

*మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాస్తవ సమస్యల నుంచి గోవా ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పర్యావరణం, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు అనేకం ఉండగా, గోవాకు స్వాతంత్ర్యం రావడం గురించి మాట్లాడుతున్నారన్నారు. అప్పటి పరిస్థితులను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. మోదీ గురువారం మపుసలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడే గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించి ఉండేదన్నారు. జవహర్లాల్ నెహ్రూ కోరుకుంటే కొద్ది గంటల్లోనే గోవాకు పోర్చుగీసు పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చి ఉండేదన్నారు. గోవాకు స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 15 ఏళ్ళు పట్టిందని చెప్పారు.

* 12వ తేదీన రూ. 61 కోట్లతో అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో 61 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 8.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించనున్నారు. బేగంపేట వాసుల ఎన్నో సంవత్సరాల నిరీక్షణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫలించింది. ప్రతి ఏటా బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటితో ప్రకాష్ నగర్, అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడి, మాతాజీ నగర్, వడ్డెర బస్తీ తదితర ప్రాంతాలు ముంపుకు గురవుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. గడచిన 40 సంవత్సరాల లో ఈ సమస్య పరిష్కారానికి ఎవరు పట్టించుకోలేదని స్ధానికులు పేర్కొన్నారు.

* ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా సోనియా తెలంగాణ ఇచ్చారు : రేవంత్‌రెడ్డి
ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు సోనియా తీసుకున్నారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలిచారన్నారు. ఉలిక్కిపడి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలకు దిగారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

* బీజేపీని గెలిపించాలని మా కన్నా ప్రజలే ఎక్కువగా నిర్ణయించుకున్నారు : మోదీ
ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని ఉత్తర ప్రదేశ్‌లో గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ తర్వాత స్పష్టమైపోయిందని చెప్పారు. మంచి ఉద్దేశాలతో పని చేసేవారిని ఓటర్లు ఎన్నడూ వదిలిపెట్టరన్నారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని, ఈ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఇటీవల రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అన్ని కాలాలకు అనుకూలంగా ఉండే చార్‌ధామ్ రోడ్డు వల్ల తనక్‌పూర్-పితోరాగఢ్ సెక్షన్‌కు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉత్తరాఖండ్ ప్రజల శక్తి, సామర్థ్యాలు, సదుద్దేశాలు, నిజాయితీలను గుర్తించానన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పర్వత మాల ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు. కొండ ప్రాంతాలకు రోప్‌వేలను నిర్మిస్తామన్నారు. ఆధునిక రహదారులను, రవాణా మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని తెలిపారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

* పోలీసుల పహారాలో సీఎం పర్యటన సిగ్గుచేటు: Etela
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ బీజేపీ అధ్యక్షుడు దశ్మంత్ రెడ్డి, వరంగల్ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. సీఎం పర్యటన అనగానే హౌజ్ అరెస్‌్ులు తెలంగాణ లో సర్వసాధారణం అయిపోయాయన్నారు. తెచ్చుకున్న తెలంగాణాలో స్వేచ్చా వాతావరణం లేదని అన్నారు. కేసీఆర్ ఏలుబడిలో తెలంగాణ నిర్బంధంలో ఉందని వ్యాఖ్యానించారు. పోలీసుల పహారాలో సీఎం పర్యటన సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.

* మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు
తాను ప్రధాని నరేంద్రమోదీకే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకూ తాను భయపడబోనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ‘ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాట నేను విననని ప్రధాని చెప్పారు. నిజమే… తన మాట నేను వినను. ఎందుకంటే ఆయనకే కాదు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు నేను భయపడను కాబట్టి’ అని తెలిపారు. హరిద్వార్‌ జిల్లాలోనూ మంగ్లౌర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.కాంగ్రెస్‌ ఒంటరిగానే మోదీతో పోరాటం చేయగలదని తెలిపారు. ఒక దొంగ స్థానంలోకి మరో దొంగను తీసుకొచ్చినట్టుగా రాష్ట్రంలో బీజేపీ ముఖ్య మంత్రులను మారుస్తోందని రాహుల్‌ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోదీ అధికారం నవ్వు తెప్పిస్తోందన్నారు. పేదలు, నిరుద్యోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు. 70 ఏళ్లలో దేశంలో అభివృద్ధే జరగలేదని మోదీ మాట్లాడుతున్నారని, ఇప్పటివరకు దేశం నిద్రపోయిందా? ఏదైనా మ్యాజిక్‌ జరిగి బీజేపీ అధికారంలోకి రాగానే మేల్కొని హఠాత్తుగా అన్నీ ఏర్పడ్డాయా? అని ప్రశ్నించారు.

* అంధకారంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు: కనకమేడల
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సర్కార్ చేస్తున్న రుణాలు అన్నింటిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని కనకమేడల పేర్కొన్నారు.

* అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది?: నిమ్మల
ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్టును పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. అక్రమ కేసులు, అరెస్టులు, నిర్భందాలతోనే జగన్ పాలన సాగిస్తున్నాడన్నారు. నీతి, నిజాయితీతో ఉద్యోగ సంఘ నాయకునిగా అందరి మన్ననలు పొంది ప్రజా జీవితంలో ఉన్న అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉద్యోగస్తులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అని రామానాయుడు నిలదీశారు.

*అశోక్బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి? : అచ్చెన్న
ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయన్ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన అరెస్ట్ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లు మీడియాతో మాట్లాడగా.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన రూపంలో స్పందించారు. అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి.. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

*వైసీపీ సర్కార్ ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు: Anand babu
టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబును అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఉద్యోగులు హక్కులు కోసం మాట్లాడమే అశోక్ బాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్లతో ప్రజా వ్యతిరేకతను ఆపలేరన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు.

*అర్ధరాత్రి అశోక్బాబును అరెస్టు చేయాల్సిన అవసరమేంటి?: ఆలపాటి
ఉద్యోగులకు ప్రభుత్వం చేసిన మోసాన్ని బయటపెట్టడం వల్లే అశోక్ బాబును అరెస్ట్ చేశారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును ఖండిస్తున్నామన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పాటించాలని చూస్తున్నారన్నారు. సీఐడీ వ్యవస్థ దిగజారి ప్రవర్తిస్తోందని,

*ఇదే పంధా కొనసాగితే ప్రజా తిరిగుబాటు తప్పదు: GV
ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. పోలీసులతో ఎంత మంది గొంతు నొక్కుతారని ప్రశ్నించారు. ఇదే పంధా కొనసాగితే ప్రజా తిరిగుబాటు తప్పదని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.