DailyDose

సిద్ధిపేట పీతాంబరం విశేషాలు

సిద్ధిపేట పీతాంబరం విశేషాలు

పీతాంబరం పట్టు మళ్లీ పుట్టింది. వందేళ్ల కిందట కలవారింట పెళ్లిల్లో తప్పక ఉండేదా చీర. ఓ మోస్తరు తాహతు ఉన్న తండ్రి.. కూతురు పట్టుబట్టడితే కాదనలేక పట్టుకొచ్చిన పట్టుపుట్టం అది. తెలంగాణలోని సిద్దిపేట ఇలాకాలో పుట్టిన పీతాంబరం పట్టు అంటే.. కట్టుకున్న వాళ్ల సంబరం అంబరాన్నంటేది. కొన్నవారి మాటలు కోటలు దాటేవి. అయిదు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోక.. ఈ పట్టు కోక అరుదైన వస్తువుల జాబితాలోకి వెళ్లిపోయింది. బంగారు, వెండి జరి అంచుల ఈ చీర చిరునామా గల్లంతయింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే సిద్దిపేటలో కొత్తగా పురుడు పోసుకుంది పీతాంబరం పట్టు.

**సిద్దిపేట పీతాంబరం అంటే అప్పట్లో ఓ బ్రాండ్‌. ఈ చీరను హోదాకు గుర్తింపుగా భావించేవారు. బంగారు, వెండి జరీతో.. ధగధగలాడే ఈ పట్టు పనితనంలో నేతన్నల పట్టు ఎంతో చెప్పకనే చూపేది. చెంగుపై పువ్వులు, కొంగుపై నెమళ్లు, అంచుపై ఏనుగులు.. ఇలా

**రకరకాల డిజైన్లతో మగువల మనసును కట్టిపడేసేలా తీర్చిదిద్దేవారు. నిజాం కాలంలో సిద్దిపేట కేంద్రంగా ఎన్నో చేనేత కుటుంబాలు పీతాంబరం చీరలు నేసేవి. సాధారణ మగ్గంపైనే అసాధారణ రీతిలో చీరను తీర్చిదిద్దేవారు. అనుకున్న డిజైన్‌ని కాగితంపై వేసుకునేవారు. మగ్గాన్ని కాలుతో తొక్కుతూ, చేతితో వత్తులు తీస్తూ.. డిజైన్‌ వేసేవారు. నేయడం, తాళ్లు పట్టుకోవడానికి ఇద్దరు, వత్తులు తీసేందుకు ఇద్దరు.. ఇలా నలుగురైదుగురు కార్మికులు రెండు నెలలు కష్టపడితే పట్టు పీతాంబరం సిద్ధమయ్యేది. అప్పట్లోనే ఈ చీర ధర రూ.200 వరకు పలికేది. సంపన్న కుటుంబాలైతే ప్రత్యేకంగా బంగారు జరీతో చీరలు నేయించుకునేవారు. సిద్దిపేట ప్రాంతంలో దాదాపు పదిహేను కుటుంబాలు పీతాంబరం చీరలు నేస్తూ జీవనం సాగించేవారు. ఆనాటి కార్మికులు వృద్ధులైపోయారు. కొందరు కాలం చేశారు. ఈ పనిని భారంగా భావించి తర్వాతి తరాలు పీతాంబరాన్ని అటకెక్కించారు. దీంతో అయిదు దశాబ్దాలుగా ఈ చీర ఊసే లేకుండాపోయింది.

**మళ్లీ ఇన్నాళ్లకు అదే పట్టు కొత్తగా పలకరిస్తోంది. సిద్దిపేటకు చెందిన నేతన్న గాలయ్య ఆనాటి అద్భుతాన్ని పునఃసృష్టించారు. సహాయకుడిగా ధర్మవరం నుంచి ఓ కార్మికుడ్ని పిలిపించారు. నాలుగు రోజులకే ఆయన వెళ్లిపోయాడు. మరో కార్మికుడ్ని రప్పించారు. అతడూ చేతులెత్తేశాడు. కానీ, గాలయ్య పట్టు విడవలేదు. రాగి జరీతో చీర పూర్తి చేశారు. చీర మధ్యలో పెద్దాచిన్న పూలు, అంచు పింజరతో, కొంగు బెనారస్‌ నమూనాతో మలిచి పీతాంబరానికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ చీరలను మరింత ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇక మీదట వెండి జరీతో చీరలు నేస్తానంటున్నారు గాలయ్య. బామ్మ సందుకలో, అమ్మమ్మ బీరువాలో అపురూపంగా దాచుకున్న పీతాంబరం చీర.. ఈ తరం మనసు దోచేయడం ఖాయం అంటున్నారాయన.

**యంత్రంపై నేయడంతో చీర 20 రోజుల్లో పూర్తయింది. చీరపై వేయాల్సిన డిజైన్‌ను కంప్యూటర్‌లో చేయించారు. ఒకే కార్మికుడి సహకారంతో చీరను తీర్చిదిద్దారు. కూలీకి రూ.10 వేలు, ముడిసరకు కోసం రూ.18 వేలు ఖర్చయింది. ఇక్కడి కార్మికులకు జాకార్డ్‌ మగ్గాలపై పీతాంబరం నేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామంటున్నారు అధికారులు.

**తెలంగాణ చేనేత, జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్‌ చొరవతో ఇది సాధ్యమైంది. ‘సిద్దిపేట పీతాంబరానికి పునర్‌ వైభవం కల్పించాల’న్న తెలంగాణ ముఖ్యమంతి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపుతో శైలజా రామయ్యర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పీతాంబరం నేయగల సామర్థ్యం ఉన్న గాలయ్యను కలిశారు. జాకార్డ్‌ మగ్గం ఇప్పించారు.