Politics

ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు – TNI రాజకీయం

ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు  – TNI  రాజకీయం

*రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. 2018 నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు లేవన్నారు. ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాల్సి ఉన్నందున గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో మేం గెలుస్తామన్నారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల గెలుస్తామని రిపోర్ట్‌ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఒక్క సీటు కూడా 0.3 ఓట్ల తేడాతో పోతుందని తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ తనతో కలిసి పనిచేస్తున్నాడని, అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పనిచేస్తానన్నారు. గత 8 ఏళ్లుగా పీకేతో తనకు స్నేహం ఉందన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందన్నారు. కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

*రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదు: కేసీఆర్‌
రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా బిజెపి ప్రభుత్వ హయాంలో అమలుకావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి పైగా పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ మేరకే తెలంగాణ పంపిన తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. =ఎస్సీ వర్గీకరణకు కూడా అతీగతీ లేదు.దేశం బాగుపడాలంటే బీజేపీ పోవాలని ఆయన పిలుపునిచ్చారు.కేవలం ధాన్యంతోనే మా ఉద్యమాన్ని ఆపము. మరిన్నిఆంశాలతో ముందుకు పోతామన్నారు. అనేక అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రజలను ఉద్వేగాలకు గురిచేస్తున్నారని అన్నారు.దుర్మార్గపు రాజకీయ క్రీడ దేశంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

* దేశానికి కావాల్సింది క‌శ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ : సీఎం కేసీఆర్
ఇటీవ‌ల విడుద‌లైన క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. దేశానికి కావాల్సింది క‌హ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ కావాల‌న్నారు. దేశంలో స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఈ సినిమాను విడుద‌ల చేశార‌ని మండిప‌డ్డారు.కేంద్రం క‌శ్మీర్ ఫైల్ సినిమాను వ‌దిలిపెట్టి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చొర‌వ చూపాల‌న్నారు. క‌శ్మీర్‌లో హిందూ పండిట్‌ల‌ను చంపిన‌ప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డానికే క‌శ్మీర్ ఫైల్ సినిమాను ముందుకు తెచ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జ‌రుగుతోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజర‌య్యారు.

* జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం…
నాటుసారా మరణాలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదోరోజు సోమవారం ఫ్లకార్డులతో ఆందోళన చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి నిరసన తెలిపారు. మద్య నిషేధం హామీ గోవిందా.. గోవిందా అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ బ్రాండ్‌లు వెంటనే రద్దు చేయాలని, ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ సారాను అరికట్టాలని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

* Punjab నుంచి రాజ్యసభకు ఆప్ అభ్యర్థులు వీరే… డాక్టర్ సందీప్‌ల ఖరారు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పాఠక్‌లను రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించింది.అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హర్భజన్ సింగ్‌ను యూత్ ఐకాన్ గా దేశంలో బాగా తెలిసిన పేరు. రాజ్యసభ స్థానానికి ఆయన మంచి అభ్యర్థి అని ఆప్ పార్టీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు చాలా సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం ఉంది.పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైనప్పటి నుంచి రాఘవ్ చద్దా తన సత్తాను నిరూపించుకున్నారు. అతను పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా పనిచేశారు. పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.చద్దా ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ రాజ్యసభకు ఆయనను పంపించాలని ఆప్ నాయకత్వం భావిస్తోంది. ఆప్ ఢిల్లీ నుండి పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌కు ఒక సీటు ఇచ్చింది. పంజాబ్‌లోని ఏడు రాజ్యసభ స్థానాల్లో ఐదింటికి మార్చి 31న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘంఇటీవల ప్రకటించింది.

* లోకేష్ పెగాసస్‌ను కొన్నారో లేదో తేల్చాలి : ఆదిమూలపు
టీడీపీ వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెగాసెస్ కొన్నారో.. లేదో.. తేల్చాలని పట్టుబట్టారు. దీంతో క్వశ్చన్ అవర్ తర్వాత పెగాసెస్‌పై స్వల్పకాలిక చర్చ చేపడతామని స్పీకర్ వెల్లడించారు.

*బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం: ఆర్‌ఎస్పీ
ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని దూరం చేసి బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల పరిధిలోని వెంకెపల్లి, చిల్ప కుంట్ల, నూతనకల్, యడవెళ్లి, తాళ్లసింగారం గ్రామాల్లో నిర్వహించిన రాజ్యాధికార యాత్రలో ఆయన వివిధ చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అనంతరం అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది బీఎస్పీలో చేరారు.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు అధికారం ఉండటం వల్ల ఆ వర్గాలకే ప్రయోజనాలు చేకూరాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంతకాలం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామ నడం ఆ యన రాజకీయ ప్రయోజనాలకోసమేనని అన్నారు. జీఓ 111ను రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ వాటి నిర్మాణాలను గాలికి వదిలేశారని, కొన్ని ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పిల్లర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు.

*ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం: షర్మిల
రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చెప్పారు. కుటుంబానికి రూ. లక్ష కూడా ఇవ్వలేని సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి బార్లు, బీర్లు, అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.పాదయాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దమ్ము ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ తనతో కలిసి ఒక రోజు పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్‌ విసిరారు. గ్రామాల్లో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్తానని సమస్యలు ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని అన్నారు.

*అణగారిన వర్గాలకు అధికారం రానివ్వరా?: ఆర్‌. ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా అణగారిన వర్గాలకు అధికారం రానివ్వరా? అని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌. ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. నూతనకల్‌ పట్టణంతో పాటు మండలంలోని వెంకెంపల్లి, చిల్పకుంట్ల, యడవెల్లి, తాళ్లసింగారం గ్రామాల్లో బహుజన యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. అదిగో, ఇదిగో నోటిఫికేషన్లంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. పెత్తందార్లకే కాంట్రాక్టులు, అసైన్డ్‌ భూములు అప్పగించి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారన్నారు.

*రేవంత్‌రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు: సీతక్క
తెలంగాణలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేదల భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో పేదల భూములను మాయం చేశారన్నారు. ప్రతిగింజా కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఉరి అంటున్నారని చెప్పారు. పేదల కోసం 100 రోజుల పని తెచ్చింది, పొడు భూములకు పట్టాలిచింది సోనియమ్మ అని సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన ఎవరైనా వైన్స్ షాపులు ఇస్తారా అని, కేసీఆర్ ఇవ్వడం సిగ్గుచేటని సీతక్క విమర్శించారు.

*2024 నాటికి ఏపీ అప్పు ఎంతంటే..: యనమల
రాబోయే 2024 నాటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. ఏపీ 2024 ఏడాదికి రూ. లక్ష కోట్ల మేర చెల్లింపులు జరపాలని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ పరిధి మేరకు చేసే అప్పులను మాత్రమే చూపారన్నారు. వివిధ కార్పొరేషన్ల నుంచి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తుందని ఆయన ఆరోపించారు. లబ్దిదారులకు కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే నేరుగా నగదు అందుతోందన్నారు. కానీ ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నగదు బదిలీ చేసినట్టు చెప్పుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో రూ. 27 వేల కోట్లు డీబీటీ ద్వారా పేదలకు ఇచ్చినట్టు బడ్జెట్ లెక్కల్లో చూపామని ఆయన పేర్కొన్నారు

*భయానక వాతావరణం సృష్టించి పెట్టుబడులను రానివ్వట్లేదు: అమర్‌నాథ్ రెడ్డి
ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు రావన్నారు. తిరుపతిలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని అన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు. జగన్ ఎన్ని సార్లు మోదీని కలిసినా హోదాపై ఒత్తిడి తేవడం లేదన్నారు. భయానక వాతావరణం సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారన్నారు. యువత జీవితాలు నిర్వీర్యం ఆవుతున్నాయని అమర్‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

*అప్పుడు మోదీకి సలాం కొట్టి చర్చ వద్దన్నారు: అచ్చెన్నాయుడు
మతా బెనర్జీ కేంద్రం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, పార్లమెంటులో చర్చ పెడితే విజయసాయి రెడ్డి కేసులకు భయపడి మోదీకి సలాం కొట్టి చర్చ వద్దన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్‌కి చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మీద బురద చల్లడానికి మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారన్నారు. ఇక్కడ అసెంబ్లీలో మాత్రం చర్చ కావాలంటున్నారని అచ్చెన్న పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది మీరే కదా… మీకు, మీ నాయకుడికి దమ్ముంటే చర్చ జరిపి నిజానిజాలు ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. అంతేగానీ చంద్రబాబు మీద బురద జల్లుతాం అంటే చూస్తూ ఊరుకోబోమని… మీకు తగిన విధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు