DailyDose

జయ మృతిపై 5న మళ్లీ విచారణ – TNI తాజా వార్తలు

జయ మృతిపై 5న మళ్లీ విచారణ – TNI తాజా వార్తలు

*దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ కొద్ది రోజుల విరామం తర్వాత ఏప్రిల్‌ ఐదున మళ్ళీ విచారణ ప్రారంభించనుంది. అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తరపు న్యాయవాది సాక్షుల వద్ద జరిపిన విచారణ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు సంబంధించి ఆర్ముగస్వామి కమిటీ తదుపరి చర్యలు చేపట్టే నిమిత్తం బుధవారం అధికారులతో చర్చలు జరిపారు. అపోలో వైద్యులను మళ్ళీ విచారించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ఏప్రిల్‌ ఐదున అపోలో ఆస్పత్రి డాక్టర్లను కమిటీ విచారించనుంది. ఇదివరకే హాజరైన అపోలో డాక్టర్లలో కొందరికి సమన్లు జారీ చేసారు

*విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ ముట్టడికి అనుమతి లేదని వాహనాలను అడ్డగించారు. కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన పార్టీ నేతలు, కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*ఏపీలో 2020లో క్రైమ్‌ రేటు భారీగా పెరిగింది. అంతకుముందు నాలుగేళ్లతో పోలిస్తే ఆ ఏడాది నమోదైన కేసులు, క్రైమ్‌ రేటులో భారీగా పెరుగుదల కనిపించింది. దేశంలో పెరుగుతున్న నేరాలపై కేరళ ఎంపీ జోస్‌ కె.మణి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానం ఇచ్చారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. ఏపీలో 2019లో 1,45,751 కేసులు నమోదుకాగా క్రైమ్‌ రేటు 278.6గా ఉందని, 2020లో కేసుల సంఖ్య 2,38,105కి, క్రైమ్‌ రేటు 452.7కి చేరిందని మంత్రి వెల్లడించారు. సంవత్సర కాలంలో లక్ష మంది జనాభాకు నమోదైన నేరాలను క్రైమ్‌ రేటుగా పరిగణిస్తారు.

*తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

*కడప: జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ది పనులకు వైవి సుబ్బారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఆలయ సమీపంలో టిటిడి రూ.3.80 కోట్లతో నిర్మించిన పరిపాలన, విశ్రాంతి భవనం, సీఎం గెస్ట్ హౌస్, భక్తుల విడిది భవనాలను ప్రారంభించారు. ఒంటిమిట్ట ఆలయం, కళ్యాణ వేదిక ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ ఆరా తీశారు. అంతకు ముందు రాజంపేటలో తాళ్ళపాక అన్నమయ్య విగ్రహాన్ని ఆయన సందర్శించారు. నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దర్శనం చేసుకున్నారు.

*ఐఏఎస్‌ అధికారులకు కోర్టు శిక్ష విధించడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందించారు. ప్రతి అంశాన్ని ఫైల్‌లలో రాస్తే అధికారులు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని… ఫైళ్లు వెళితే సరిపోతుందన్నారు. స్కూల్ ఆవరణలో ఎలాంటి భవనాలూ ఉండొద్దని కోర్టు చెప్పిందన్నారు. మౌఖిక ఆదేశాలు పాటించేటప్పుడు అధికారులు దాని పర్యవసానం కూడా ఊహించాలన్నారు. ఇలాంటి శిక్షలు వ్యవస్థకు మంచిది కాదని.. ఆయా సంఘాలు కూర్చొని ఇలాంటి వాటిపై చర్చించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.

*తిరుమల శ్రీవారి ఆల‌యం బంగారు గోపురంపై ఉన్న విమాన శ్రీ వేంకటేశ్వరస్వామికి హైద‌రాబా ద్‌కు చెందిన‌ అగర్వాల్ 5 కేజీల స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన తోరణాన్ని విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాదాపు 5 లక్షల విలువ గ‌ల వెండి తోర‌ణాన్ని దాత అందించారు.ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం నిర్వహించనున్నారు. ఈ యాగానికి ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య అంకురార్పణ నిర్వహించ‌నున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్రహంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్సరంలో ప్రజ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

*హవాలా లావాదేవీల కేసులో జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి బాబుసింగ్ పేరు తెరపైకి వచ్చింది. హవాలా లావాదేవీల కేసులో అనుమానితుడిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి బాబు సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు గురువారం 64 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాజీమంత్రి సింగ్‌కు సంబంధాలున్నాయని తేలింది. జమ్మూలో కొందరు వ్యక్తులు హవాలా డబ్బును స్వీకరించబోతున్నారనే సమాచారం ఆధారంగా జమ్మూ నగరంలో పలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

*గవర్నర్ తమిళసైతో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేతలు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకునేలా ఆదేశించాలంటూ ఈ సందర్భంగా గవర్నర్‌కు నేతలు వినతి చేశారు. గవర్నర్‌ను కోదండ రామ్, మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతలు కలిశారు.

*కొత్త జిల్లాల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఏ క్షణంలోనైనా విడుదల కానుంది. జిల్లాల విభజనపై పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బదిలీ చేయనున్నారు. అలాగే శాఖాధిపతులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

*తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 5 కోట్ల 6 లక్షల రూపాయల నగదు, పది కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు… మీడియాకు వివరాలు వెల్లడించిన పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాసరావు… ఇంతటి భారీ మొత్తాన్ని పట్టుకున్న జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు లను అభినందించిన డి.ఎస్.పి.

*శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినుత, ఆమె భర్త కోటా చంద్రబాబుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల వరకు ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కక్షల నేపథ్యంలో కేసు పెట్టారని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఫిర్యాదులో వాస్తవం లేదని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణను పది రోజులకు హైకోర్టు వాయిదా వేసింది.

*సీఎం జగన్ తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోపల ఏడ్చినట్టు నేతల పరిస్థితి ఉందని పద్మ అన్నారు. ఉద్యోగులను రాజకీయాల్లోకి రానివ్వడం లేదన్నారు. ప్రజలతో ఉన్నవాళ్లకు కాకుండా ఇంకెవరికి పదవులు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. గ్రామాభ్యుదయం పుస్తకావిష్కరణ సభలో ఆమె మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

*ఈ నెల 3 నుంచి రమజాన్ ఉపవాసం మొదలు అవును. చంద్రుని దర్శనంతో రమజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. చంద్ర దర్శనం కాగానే దుఆ (ప్రార్థన)చదువుకుని అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ముస్లింలు. ఇస్లామ్ ఆరాధన లో ముఖ్యమైనది రోజా. తెల్లవారుజామున తిని, సుమారు 14 గంటలపాటు కఠిన ఉపవాస దీక్ష పాటిస్తారు. తెల్లవారుజామున తినడాన్ని సహెరీ, ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఖర్జూరలతో ఉపవాసం విరమించడం ప్రవక్త (సఅసం)సంప్రదాయం. తినకపోవడమే కాదు, చెడు లక్షణాలకు దూరంగా ఉంటేనే రోజా ఆశయం నేరవేరుతుందని ప్రవక్త హెచ్చరిక. కండ్లు,నాలుక,చెవులు,చేతులు, కాళ్లు ఇలా శరీరంలోని అవయవాలన్నీ రోజా పాటించాలి.రమజాన్ నెలలో మొదటి పది రోజులు కారుణ్యం, తర్వాత పది రోజులు మన్నింపు, చివరి పది రోజులు నరకం నుంచి విముక్తి కలిగించేవి. వ్యాధిగ్రస్తులు, బాలింతలు,ప్రయాణం లో ఉన్నవారు,వృద్ధుల కు ఉపవాసల నుండి మినహింపు ఉందని ఖురాన్ పేర్కొన్నది .

*తన నివాసం వద్ద బీజేపీ యువమోర్చా విభాగం దాడికి పాల్పడడంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. దేశం కోసం తాను ప్రాణాలర్పిస్తానని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గూండాగిరితో దేశం ముందుకు వెళ్లదని వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో ఈ-ఆటోలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.

*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14 నుంచి చేపట్టనున్న రెండో దశ ప్రజా సంగ్రామయాత్ర రూట్‌ మ్యాప్‌ దాదాపు ఖరారైంది. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సెగ్మెంట్లు.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ద్వారా యాత్ర మహేశ్వరం సెగ్మెంటుకు చేరుకుంటుంది. మధ్యలో వనపర్తి లేదా జడ్చర్ల సెగ్మెంట్లలో ఏదో ఒకదాని ద్వారా పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఒక వేళ చివరి క్షణంలో రూట్‌ మ్యాప్‌ మారితే, రెండు సెగ్మెంట్ల పరిధిలోనూ కొనసాగనుంది. అలంపూర్‌ జోగులాంబ ఆలయం నుంచి 14న సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఒకటి, రెండు రోజుల్లో పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మనోహర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తొలి రోజు యాత్రకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించే సభలతో పాటు పాదయాత్రలో వారు పాల్గొంటారని వెల్లడించాయి. రాష్ట్రంలో ఆసరా పెన్షన్‌ లబ్ధిదారుల అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తామని, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2018లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.78,624 చెల్లించాలని సంజయ్‌ గురువారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఒక కుటుంబంలో అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వాల్సిందేని డిమాండ్‌ చేశారు.

*రాష్ట్రంలో 1-9వ తరగతుల పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) గురువారం రీషెడ్యూల్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ-2) పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా పరీక్షలు 22న ముగుస్తాయి.

* జిల్లా పోలీసు స్టేషన్లలో వదిలేసిన, క్లెయిమ్‌ చేయని వివిధ వాహనాలను గురువారం వేలం వేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన వేలంలో 330 స్ర్కాప్‌, 31 రోడ్డు వర్కింగ్‌ వాహనాలను వేలం వేయగా రూ.27,19,500 వచ్చాయి. అదనపు ఎస్పీ ఎంఏ రషీద్‌, డీటీసీ అదనపు ఎస్పీ మురళీదర్‌, డీటీసీ డీఎస్పీ విజయకుమార్‌, ఆర్‌ఐ అచ్యుతరావు, భరత్‌భూషణ్‌ పాల్గొన్నారు.

*రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ విలువలను కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ వచ్చాకే పెంచనున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఆరోజు నుంచే రిజిస్ర్టేషన్‌ విలువలు పెరుగుతాయి. ఎలాగూ ఉగాదికి, ఆ తర్వాత ఆదివారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవులే. సోమవారం నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తే…రిజిస్ర్టేషన్‌ విలువలు, ఆ మేరకు రిజిస్ర్టేషన్‌ చార్జీలూ పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 15 శాతం వరకు రిజిస్ర్టేషన్‌ విలువలు, ఆ మేరకు చార్జీలు పెరిగే అవకాశాలున్నాయని సమాచారం.

* రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు నిర్వహణకు వైసీపీ సన్నద్ధమవుతోంది. ఇదే సదస్సును 2019కి ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించారు. గురువారం వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాసు, వేణుగోపాల్‌, అప్పలరాజు, శంకరనారాయణ సమావేశమై సదస్సు త్వరలోనే నిర్వహించాలని నిర్ణయించారు.

*గ్రూప్‌-1లో 110 ఉద్యోగాలు, గ్రూప్‌-2లో 182 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గురువారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత ఏడాది జూన్‌లో.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది. అందులో గ్రూప్‌-1 పోస్టులు 31, గ్రూప్‌-2 పోస్టులు 5 మాత్రమే ప్రకటించారు. దీనిపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. దీంతో ఆ పోస్టులను కొంతమేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

*వృత్తి విద్యా కాలేజీలకు అనుమతుల మంజూరు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఇంటర్‌బోర్డుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ తనిఖీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది.

*అన్ని శాఖల ఉన్నతాధికారులు శని, ఆదివారాల్లో (2, 3 తేదీల్లో) రాజధానిలోనే అందుబాటులో ఉండాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిది. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు అఖిల భారత సర్వీసు అధికారులందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల విభజన కార్యాచరణ ఉండడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు.

* కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం ఆర్టికల్‌ 14, 16లను ఉల్లంఘించడమే అవుతుందని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగుల కొరతను తాత్కాలికంగా భర్తీ చేసుకోవడం కోసం ఉపయోగించే పద్ధతి అని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 223 జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులకు 40శాతం వాటాగా జూనియర్‌ లెక్చరర్ల పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించకుండా కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌కు ముందుకెళితే నవాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా డైట్‌, ఎస్‌సీఈఆర్‌టీ, ఐఏఎ్‌సఈ, సీటీఈ లెక్చరర్లు, పరిషత్‌ మండల విద్యాశాఖ అధికారుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

*విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాలు అలవర్చుకోవడం ద్వారా సామాజంపై పట్టుసాధించగలుగుతారని మోత్కుపల్లి సర్పంచ్‌ రత్నం అలియాస్‌ రాంచందర్‌ అన్నారు. గ్రామంలో గురువారం నగరంలోని ఏవీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎ్‌సఎస్‌ క్యాంప్‌ నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో భాగం గా వీధులను శుభ్రం చేశారు. సర్పంచ్‌ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంకృష్ణకోఆప్షన్‌ సభ్యుడు బుర్ర శేఖర్‌కళాశాల ఇన్‌చార్జి కవిత ఉన్నారు

*షాద్ నగర్ పురపాలక సంఘం స్వచ్ భారత్, స్వచ్ తెలంగాణ 2022కార్యక్రమంలో భాగంగా వాడిన కొబ్బరి బొండాలతో ఎరువు తయరు చేసే యంత్రాన్ని “త్రిబుల్ ఆర్” ( రెడ్యూస్- రి యూజ్- రీసైకిల్) ప్రయోగాత్మకంగా అమలు చేయడాన్ని మొదలు పెట్టారు. ఇట్టి విషయాన్ని షాద్ నగర్ మున్సిపాలిటీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దానిని ట్విట్టర్ వేదికగా ప్రశంసించడం విశేషం. దీనితో మున్సిపల్ కమిషనర్ వినూత్న ఆలోచనా విధానానికి మంచి స్పందన లభించింది. దీనిపై అధికారులు సంతోషం వ్యక్తం చేయడం, మరియు ఇదే స్పూర్తితో ముందకు సాగాలనే కృత నిశ్చయం మొదలైంది.

*టమోటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడంతో టమోటా ధరలు విపరీతంగా పెరిగాయి. అనంతరం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దిగుబడులు పెరిగి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం దిగుబడులు పెరిగాయి. మదురై జిల్లా ఉసిలంపట్టి పరిసర ప్రాంతాల రైతులు సుమారు 500 ఎకరాల్లో టమోటా సాగు చేపడుతున్నారు. వీరు పండించిన టమోటాను ఉసిలంపట్టిలోని మార్కెట్‌కు తరలిస్తున్నారు. బుధవారం 12 కిలోల పెట్టె రూ.15 నుంచి రూ.20కి మాత్రమే విక్రయం కాగా, రైతుకు కిలో రూ.1 మాత్రమే గిట్టుబాటు అయింది. ఈ ధరకు విక్రయిస్తే రవాణా ఖర్చులు కూడా రావని, పంట పెట్టుబడులు, కోత కార్మికుల కూలీ కలిపితే భారీగా నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు.

*బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో రెండున్నర కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు చెప్పారు.సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, సీఈ సీతారాములు, ఈఓ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, వాటర్‌వర్క్స్‌ జీఎం హరిశంకర్, ఆలయ ట్రస్టీ సాయిబాబాగౌడ్, కమిటీ సభ్యులు అశోక్‌యాదవ్, హనుమంతరావు, ఉమానాథ్‌గౌడ్, బలరాం, శ్రీనివాస్‌గుప్తా, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు

*టీటీడీ చరిత్రలోనే మార్చి మాసంలో రికార్డు స్థాయిలో లభించిన హుండీ ఆదాయం.హుండీ ద్వారా శ్రీవారికి రూ.128కోట్ల 61లక్షల ఆదాయం.శ్రీవారిని దర్శించుకున్న 19లక్షల 72వేల 656మంది భక్తులు.తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9లక్షల 48వేల 587మంది.