DailyDose

ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు నో ఎంట్రీ – TNI తాజా వార్తలు

ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు  నో ఎంట్రీ – TNI తాజా వార్తలు

* నేటి నుండి తెలంగాణా లో ధాన్యం కొనుగోలు. వాడపల్లి లో రెవిన్యూ,పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు. ఏపి నుండి తెలంగాణ కు వెళ్తున్న ధాన్యం లారీలను,ట్రాక్టర్లను వెనక్కు తిరిగి పంపుతున్న అధికారులు. ఏపి లో తక్కువ ధరకు కొని తెలంగాణ తరలింపు అని అధికారులు వెల్లడి. మట్టపల్లి,వాడపల్లి ,లో చెక్పొస్ట్ లు ఏర్పాటు. ముందు చూపుతోనే చేకోస్ట్ లు ఏర్పాటు.

*ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో షర్మిల రైతుగోస దీక్ష చేస్తున్నారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నిసార్లు దళితులను మోసం చేస్తావు కేసీఆర్ అని షర్మిల ప్రశ్నించారు. దళితబంధు అని మరో మోసమని, భూమి కాదని 10 లక్షలు ఇస్తామని మరో మోసమని షర్మిల విమర్శించారు. భూమి ఇస్తే కనీసం 30 లక్షలు వచ్చేవని, 20 లక్షలు పంట విలువ.. మొత్తం 51 లక్షలు కేసీఆర్ బాకీ పడ్డారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు తిరుపతిలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాబ్‌ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందన్నారు. జాబ్‌ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

*రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఈనెల 20వ తేదీన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పలువురు సీనియర్ నాయకులతో పాటు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి రూ.2కోట్ల 10 లక్షలతో చేపట్టిన భద్రకాళి మినీ బండ్ ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

*గాజువాక తహసీల్దార్‌ ఎం.వి.లోకేశ్వరారావుకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారం కేసులో తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 10 నెలల క్రితం తుంగ్లాంలో ఓ ప్రైవేటు స్థలం ప్రహరీ గోడను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. టీడీపీ నేత ‘పల్లా’ ఆక్రమణలో ఉన్న భూమిగా భావిస్తూ దుందుడుకు చర్య పాల్పడ్డారు. యజమానులు హక్కు పత్రాలు చూపించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా తీర్పును వెల్లడించింది.

*ఏపీలో పెంచిన ఆర్టీసీ ధరలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో మైలవరం బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. సామాన్యుడిపై ఇప్పటికే నిత్యావసర సరుకులుకేంద్రం పెట్రోలుడిజిల్గ్యాస్ పెంచి భారం వేస్తే..ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకు బస్సు ఛార్జీలు పెంచి మరింత భారం వేసిందంటూ నిరసనకు దిగారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెంచిన ఆర్టీసీ ధరలను వెంటనే తగ్గించాలని టీడీపీ నాయకులుకార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు.

*ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు. గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు అతడిని బయటకు తీశారు. అయితే అతడు అప్పటికే మృతిచెండాని అధికారులు వెల్లడించారు. మృతుడిని విశాఖపట్నంకు చెందిన గుడ్ల సోమేశ్‌గా గుర్తించారు. మృతుని సబంధీకులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఇల్లందు మండలం సుదిమళ్ల క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. జగదాంబ గుంపు, మోదుగుల గూడెం మీదుగా బొజ్జయిగుడెంకు యాత్ర చేరుకోంది. మధ్యాహ్నం 12 గంటలకు బోజ్జయిగుడెం వద్ద రైతు గోస మహాధర్నాలో షర్మిల పాల్గొననున్నారు. అనంతరం అన్నారం, రోల్లాపాడు మీదుగా టేకులపల్లి మండలానికి వైఎస్సార్టీపీ అధినేత్రి చేరుకోనున్నారు. టేకులపల్లి మండలం సాయన్న పేట, 9వ మైల్ తండా, తంగెళ్ళ తండా, వెంకటీయ తండా గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వెంకటీయా తండా గ్రామం దాటిన తర్వాత షర్మిల నైట్ ఆల్ట్ చేయనున్నారు.

*ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల టోల్‌గేట్ వద్ద సిబ్బంది దౌర్జన్యం ప్రదర్శించారు. ఒకే కారుకి రెండు చోట్ల టోల్ ఛార్జ్ వసూలు చేసేందుకు యత్నించారు. ఒక టోల్‌గేట్ వద్ద టికెట్ మరో టోల్‌గేట్ వద్ద చెల్లదంటూ వాహనదారులపై దుర్భాషలాడారు. టోల్గేట్ సిబ్బంది దౌర్జన్యంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

*అరుణాచల్‌ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో పాంజిన్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పాంజిన్‌కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది. భూమి అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో భూ ఫలకాలు కదిలాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

*నూతన విద్యా సంవత్సరం జూలై 4వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు మే రెండో వారం వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 27 నుంచి మే 9వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు పూర్తికాగానే పదో తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తారు. అనంతరం వారం నుంచి పది రోజులపాటు మూల్యాంకనం ఉంటుంది. మిగతా తరగతులకు జరగాల్సిన సమ్మేటివ్‌-2 పరీక్షలను ఈ నెలాఖరులో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కాగానే ఆ తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తారు. జూలై 4వ తేదీన నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. కాగా జూనియర్‌ కళాశాలలకు మే 25 నుంచి సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. అవి పూర్తికాగానే సెలవులు ప్రకటిస్తారు.

*ఆమదాలవలస చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గొర్లె జగన్మోహనరావు గురువారం రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. జగన్మోహన రావుది ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామం. తల్లిదండ్రులు పార్వతి, సత్యనారాయణ. వీరిది రైతు కుటుంబం. ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జరిపిన దాడుల్లో 55 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో జగన్మోహన్‌ భాగస్వాము లయ్యారు. దీంతో ఆయనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేశారు. గురువారం కేంద్ర హోమ్‌ సెక్రటరీ ఏకే అబుల్లా చేతుల మీదుగా ఢిల్లీ సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయం చౌడియాలో ఈ అవార్డును అందుకున్నారు. అలాగే, 2017లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదు లను దీటుగా ఎదుర్కొన్న మోహన్‌రావు 2020 ఆగస్టు15న పీఎంజీ (పోలీసు మెడల్‌ అవార్డు)ను ఐజీ రవిదీప్‌సింగ్‌ సాహీ నుంచి అందుకున్నారు. జగన్మోహన్‌రావును ఎంపీ కింజరాపు రామ్మోహనరావు, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అభినందలు తెలిపారు

*తెలంగాణలో యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి ఇక్కడికి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ-రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద, నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన వద్ద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద రెండు లారీలు, రెండు ట్రాక్టర్లను అధికారులు గురువారం అడ్డుకుని వెనక్కి పంపారు.

*రేషన్‌ కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే నగదు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో ‘ఏబీఎన్‌-ఆంరఽధజ్యోతి’తో మంత్రి మాట్లాడారు. బియ్యం వద్దు.. డబ్బులు కావాలని కార్డుదారులు డిక్లరేషన్‌ ఇస్తే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. మళ్లీ బియ్యమే కావాలనుకుంటే కూడా సరుకే ఇస్తామని స్పష్టం చేశారు

*కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్‌ జీవితకాలం పోరాటం చేశారు. అణగారిన వర్గాలకు అండగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవి’’ అని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ అన్నారు. భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 131వ జయంతి సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో గవర్నర్‌ ఆయనకు ఘనంగా నివాళులు ఆర్పించారు. ‘‘బీసీ వర్గానికి చెందిన నేను స్పీకర్‌ స్థానంలో ఉండటానికి ఆయన కల్పించిన రిజర్వేషనే కారణం’’ అని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్నారు. గురువారం అమరావతి అసెంబ్లీ హాలులో అంబేడ్కర్‌ 131వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

*మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు గురువారం తమకు కేటాయించిన చాంబర్లలో పదవీ బాధ్యతలు చేపట్టారు. పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని నగరాలను సమానంగా అభివృద్ధి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. తొలిగా… రాష్ట్రంలోని 74 పట్టణ ప్రాంతాల్లో రూ.1,145 కోట్లతో ఘన వ్యర్థాలను 100ు శుద్ధి చేసే 228 ఎస్టీపీల ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారు. పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ‘‘ఐదు ఎకరాలకు పైబడిన ఆక్వా సాగుకు మాత్రమే యూనిట్‌ రూ.3.50 చొప్పున వసూలు చేస్తాం. విద్యుత్‌ కొనుగోలు ధర, వినియోగ డిమాండ్‌ను బట్టి యూనిట్‌ రూ.3.50 అనేది చాలా తక్కువ ధరే’’ అని కోరారు. సీఎం తనపై పెట్టిన బాధ్యతలను తూ.చా.తప్పకుండా నిర్వహిస్తానని పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బడుగువర్గాల అభ్యున్నతికి, శిశువులు, మహిళలు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని, సీనియర్‌ సిటిజన్లకు అండగా నిలుస్తానని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ చెప్పారు.

*‘ఏపీటీఎఫ్‌ ప్లాటినం జూబ్లీ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని పోలీసులు నిరంకుశంగా అడ్డుకోవడం గర్హనీయం’’ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌ విమర్శించారు. మహసభలు జరుగుతున్న శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఐదువేల మంది ర్యాలీకి హాజరయ్యారన్నారు. పోలీసులు అడ్డుకున్నా కొన్ని వందలమంది ర్యాలీ చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం, ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీని నిరోధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నియంతృత్వ విధానాలను విడనాడాలని ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

*భారతీయ రైల్వే ఏప్రిల్‌ 20 నుంచి హుబ్లీ- విజయవాడ మధ్య ప్రతి రోజూ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడుపాలని నిర్ణయించింది. హుబ్లీ నుంచి 19.30గంటలకు బయలుదేరే రైలు (17329) తర్వాత రోజు 12.20 గంటలకు విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. అలాగే విజయవాడ నుంచి 21వ తేదీన 13.50గంటలకు బయలుదేరే రైలు హుబ్లీకి తర్వాత రోజు 5.30గంటలకు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

* మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్‌ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఓటీటీ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. తమిళం కోసం అయితే నేను ఏ సమయంలోనైనా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ ఓటీటీ పేరు కూడా ఆహా అని ఉంది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు ‘ఆహా’ అంటారని అందరికీ తెలుసు. సమాజానికి ఉపయోగపడేవిధంగా ఈ ఆహా పనిచేయాలని కోరుకుంటున్నా. అందరికీ ‘సిత్తిరై తిరునాళ్‌’ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్‌ దర్శకుడు భారతిరాజా తదితరులు పాల్గొన్నారు.

* నిజామాబాద్: జిల్లాలోని బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*పలుసార్లు ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన నేపాలీ పర్వతాధిరోహకుడు మరణించాడు. మృతుడ్ని 38 ఏండ్ల నెగ్మి టెన్జీ షెర్పాగా గుర్తించారు. ఎవరెస్ట్‌ శిఖరం సమీపంలోని ఖంబు మంచుపాతం వద్ద ఫుట్‌బాల్‌ మైదానంగా పిలిచే సురక్షిత ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని గుర్తించారు. నెగ్మి టెన్జీ మృతదేహాన్ని ఎవరెస్ట్‌ శిఖరం నుంచి కిందకు తరలించినట్లు అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్వత గైడ్‌ కంపెనీకి చెందిన ప్రతినిధి తెలిపారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగలేదని, ఎత్తుకు చేరినప్పుడు వాటిల్లే అనారోగ్యం కారణాలతో ఆయన చనిపోయి ఉండవచ్చన్నారు. క్యాంప్‌ 2కు సామాగ్రిని మోసుకెళ్తున్న షెర్పా ఎవరెస్ట్‌పై కూర్చొన్న స్థితిలో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ కంపెనీ పేర్కొంది. షెర్పా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది.

*తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెస్సుల పేరుతో చార్జీలు పెంచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ రిజర్వేషన్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్‌ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పెరిగిన రిజర్వేషన్‌ చార్జీలు మార్చి 27 నుంచి అమలు కానున్నట్టు సమాచారం.