Kids

పంజరంలో రామచిలుక

పంజరంలో రామచిలుక

కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతనికి నలుగురు స్నేహితులున్నారు. ఆ స్నేహితుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వారిని ఉమ్మడిగా వరప్రసాదులని అందరూ పిలిచేవారు. వారు దేశాటనలో భాగంగా లాట దేశం చేరుకున్నారు. అక్కడ పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా మార్చిన కానీనుడు అనే తిక్కరాజుకు.. గాలిని చూపించి, దేవతావస్త్రాలని నమ్మబలికి తగిన రీతిగా బుద్ధి చెప్పారు.

దేవతా వస్త్రాలు కట్టించి, కానీన మహారాజుకు బుద్ధి చెప్పిన తరువాత… ఆ రాజ్యం నుంచి బయలుదేరిన వరప్రసాదులు అయిదుగురూ ఎడతెగని ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో ఊళ్లు, ఏళ్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ… క్రూరమృగాలను చంపుతూ మూడురోజులపాటు ఎక్కడా ఆగకుండా సాగిపోయారు.

మూడోనాటి మధ్యాహ్నం దప్పిక తీర్చుకోవడం కోసం ఒక సరోవర ప్రాంతంలో విడిది చేశారు. ఆ సరోవర తీరంలో ఒక వింతైన మర్రిచెట్టును చూశారు. ఆ చెట్టు కొమ్మలు ఆకాశంలోకి దూసుకు పోయినట్లున్నాయి. ఆ చెట్టుచుట్టూ తిరిగి ఎంతగా పరిశీలించినా ముఖ్యంగా… నాలుగు కొమ్మలకు చివర ఎంతదూరంలో ఉన్నదో పోల్చుకోలేకపోయారు వారు.

“మిత్రులారా! ఈ మర్రిచెట్టు ఊడలను పరిశీలించారా?! ఉక్కు స్తంభాల్లా ఉన్నాయి. ఈ కొమ్మలపై మనం ఇదివరకు చూడని వింత పక్షులెన్నో గూళ్లు కట్టుకుని నివసిస్తున్నట్లున్నాయి. ఆ నాలుగు కొమ్మలనూ పరిశీలించారా? వీటిపై ఎవరైనా రథాలు సైతం తేలిగ్గా నడుపుకుంటూ పోవచ్చు. సరదాగా ఈ కొమ్మల పొడవెంతో చూసివద్దామా?” అన్నాడు రాముడు.

మిగిలినవారంతా ‘సరే’నంటూ ఉత్సాహం చూపించారు. అప్పుడు తిరిగి రాముడే, “అందరం ఒకే కొమ్మను చూసినట్లయితే చాలారోజుల సమయం పట్టవచ్చు. అందువల్ల నలుగురం నాలుగు కొమ్మల పైకి ఎక్కుదాం. వింతలు చూస్తూ, వాటిమాయల్లో పడకుండా వీలైనంత వేగంగా తిరిగి రావాలి. అందరూ తిరిగి వచ్చేవరకూ ఒకరు ఈ చెట్టువద్దనే ఉండాలి” అన్నాడు.
తాము తెచ్చుకున్న గుర్రాలను, ఇతర సామగ్రిని కాపలా కాసేందుకు సాంబుని నియమించి ఒక్కొక్కరూ ఒక్కో కొమ్మపైకి ఎక్కారు.

రాజకుమారుడైన వసంతుడు తూర్పుదిక్కున ఉన్న కొమ్మమీదకు ఎక్కాడు. భూమిమీద నడిచినంత సులువుగా రెండు రోజులపాటు ఆ కొమ్మపై నడుస్తూనే ఉన్నాడు. అప్పటికి కొమ్మ కొంచెం సన్నబడింది. నిలబడి నడిచే వీలులేక నాలుగు దినాలపాటు చేతులమీద పాకుతూ ముందుకు వెళ్లాడు. అప్పటికి ఆ కొమ్మకు చివళ్లు కానవచ్చాయి. కానీ అది మేఘాల మధ్యలో మాయమైపోయింది. అక్కడ కళ్లు మిరుమిట్లు గొలిపేలా విచిత్రమైన కాంతులు గోచరిస్తున్నాయి. అటువంటి చోట దిగడమా, వెనక్కు పోవడమా తెలియక వసంతుడు తబ్బిబ్బు అయ్యాడు.

కొంతసేపటికి మేఘాలు చెదిరిపోయాయి. అక్కడ ఒక పట్టణం ఉన్నట్లు కనిపించింది.

“ఓహో! ఈ మాయానగరం ప్రభావం వల్లనే ఇంతసేపూ నేను భ్రమపడి ఉంటాను. ఏమైనా సరే… ఈ పట్టణంలో వింతలేమిటో చూసిన తర్వాతే వెనక్కు పోతాను” అనుకుంటూ వసంతుడు అందులో అడుగుపెట్టాడు.

అక్కడ మానవుడు గానీ, జంతువు, పక్షి గానీ ఏదీ కనబడలేదు. ఆ పట్టణంలో అనేక ఇళ్లున్నాయి. అన్ని ఇళ్లకూ తాళాలు వేసివున్నాయి. అన్ని ఇళ్లూ ఒకేరీతిగా ఉండడం వల్ల తిరిగిన వీధిలోనే తిరుగుతూ వసంతుడు చాలాసేపు గడిపాడు. చివరకు తాను ఎక్కడినుంచి వచ్చాడో కనిపెట్టడం కష్టమై పోయిందతనికి.

కొంతసేపటికి అతనికో విశాలమైన కొత్తవీధి కనిపించింది. దాని సంగతి కూడా చూద్దామనుకుంటూ ముందుకు వెళ్లాడు. అక్కడ ఒక అందమైన కోట ఉంది. ఆ కోటగుమ్మం ఎక్కడుందో తెలుసుకోవడం కోసం దానిచుట్టూ వసంతుడు మూడుసార్లు తిరిగాడు. కానీ గుమ్మం కనిపించలేదు.

గుమ్మం లేకుండా కోట ఎలా ఉంటుంది?! అని ఆశ్చర్యపడుతూనే మరోసారి దానిచుట్టూ తిరుగుతూ… నేల నెరియల వంక పరీక్షగా చూసుకుంటూ వెళ్లాడు. ఒకచోట గడప, దానికి గొళ్లెం కనబడ్డాయి. ఆ గొళ్లాన్ని తీసి, గడపను పైకెత్తగానే కోట లోపలికి మార్గం కనిపించింది.

కోటలో ప్రవేశించిన వెంటనే ముందుగా ఒక ఉద్యానవనం దర్శనమిచ్చింది. పూలు, పళ్లు, కాయలతో… తుమ్మెదలు, వివిధ రకాల పక్షులతో ఆ ఉద్యానవనం నందనవనంలా శోభిల్లుతోంది. దానిలో మరింత ముందుకు పోగాపోగా ఒక దేవతాభవనంలాంటిది కనిపించింది. కానీ అక్కడ మనుషుల అలికిడి మాత్రం తెలియలేదు.

ఆ భవంతి అంతటా సంచరిస్తూ వసంతుడు ఒక చక్కని అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. అందులో సూర్యుడు చొరబడలేని శుద్ధాంతఃపురంలో హంసతూలికా తల్పంపై శయనించి ఉన్న ఒకానొక అద్భుత సౌందర్యరాశిని చూశాడు. తాను చూస్తున్నది కలయో నిజమో తెలియని స్థితిలో… విభ్రమ గొలిపే ఆమె సౌందర్యానికి తబ్బిబ్బు పడుతూ చాలాసేపు ఆ మంచం వద్దనే తచ్చాడాడు వసంతుడు.

ఆ చక్కెరబొమ్మ మేనిసొంపులను తనలో తాను వర్ణించుకుంటూ ఎంతసేపు అలా గడిపాడో తెలియదు. మరికొంతసేపటికి ఆమె నిద్ర లేచింది.

వసంతుని చూసి, అదరిపాటుతో మంచం మీదనుంచి పైకి లేచింది. దూరంగా జరిగి పైట సర్దుకుంది. ఆ తరువాత, “స్వామీ! మీరెవరు?! ఎక్కడివారు? ఈ రాక్షస శుద్ధాంతంలోనికి ఎలా రాగలిగారు?! దయచేసి నా ఆతిధ్యాన్ని స్వీకరించి, నన్ను ధన్యురాలిని చేయండి” అన్నది.

అందుకు వసంతుడు నవ్వుతూ, “యువతీ! నీ పేరు, కుటుంబ వివరాలు చెప్పకుండా ఆతిథ్యం తీసుకోవడం సాధ్యంకాదు. నీ తల్లిదండ్రులెవరు?! నిన్నిక్కడ బంధించిన రాక్షసుడెవ్వరు? భయపడకుండా యదార్థం చెప్పు” అని అడిగాడు.

“రాజకుమారా! నా పేరు కళావతి. మాది అవంతీ దేశం. నాకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒక బ్రహ్మరాక్షసి నన్ను ఎత్తుకొని వచ్చి ఈ పట్టణంలో దాచిపెట్టింది. ఇక్కడ వేరే మనుషులు ఉండరు. ఆ రాక్షసి అనేక దేశాల నుంచి ఎత్తుకొచ్చిన సొమ్ములన్నింటినీ ఇక్కడ దాచిపెడుతూ ఉంటుంది. నన్ను కూతురిలా పెంచుకుంటోంది. నేను కూడా దాన్ని తల్లిగానే భావిస్తున్నాను. నాకు ఆ రాక్షసి చదువు చెప్పింది. నానాదేశాల చరిత్రలూ చెప్పింది. అందువల్లనే మిమ్మల్ని చూడగానే మర్యాదగల పురుషరత్నమని పోల్చుకోగలిగాను. మా అమ్మ నిన్ననే దేశాటనకు పోయింది. మరో వారం రోజుల వరకూ తిరిగిరాదు” అని కళావతి తన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చింది.

ఆమె ఆతిథ్యం అతడికి అంగీకారయోగ్యం అయింది. అతడి సన్నిధిలో ఆమె మోహపరవశ అయింది. తామిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోవాలనే అవగాహనకు రావడానికి వాళ్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ మాయానగరం వారి పాలిట శృంగార సామ్రాజ్యంగా మారింది.

ఏడురోజుల పాటు వాళ్లిద్దరూ ఆనందోత్సవాల్లో తేలియాడారు.

ఏడోనాటి ఉదయాన్నే కళావతి, “స్వామీ! ఈరోజు మా అమ్మ వచ్చేస్తుంది. మీ జాడ పసిగడితే మండిపడుతుంది. మిమ్మల్ని బతకనీయదు. కనుక మీరు రహస్యంగా దాక్కోవాలి” అని వసంతునితో చెప్పింది.

ఆమె చెప్పినట్లే వసంతుడు, ఆ రాక్షసి కంటబడకుండా దాక్కున్నాడు. అనుకున్నట్లుగా రాకాసి రానేవచ్చింది. కళావతిని ముద్దుచేసి, ఆమెతో కలిసి సుష్టుగా భోంచేసింది. మంచంపై పరుండి, కూతురి చేత పాదాలను ఒత్తించుకుంటూ, తాను చూసి వచ్చిన వింతలన్నీ ఏకరవు పెట్టసాగింది.

అలా కబుర్లు చెబుతూ మధ్యలో ఉన్నట్లుండి, “అమ్మాయీ! ఏమిటిది?! ఈవేళ మనింట్లో మనిషి వాసన వస్తోంది?! నేను లేని సమయంలో ఇక్కడికెవ్వరూ రాలేదు కదా! చెప్పు… వాడెవడైనా ఒక్కపోటుతో చంపి, నమిలేస్తాను” అన్నది రాక్షసి ఊగిపోతూ.

“అమ్మా! ఈ నట్టడివిలోకి మనుషులు ఎలా వస్తారు? వచ్చినా ఈ కోట రహస్యం భేదించగలరా?! అయినా నేను కూడా మనిషినే కదా! నా వాసనే కొట్టిందేమో!! పిచ్చి ఆలోచనలు మాని, హాయిగా నిద్రపో” అన్నది కళావతి సర్దిచెబుతూ.

రాక్షసి నిజమే కాబోలనుకున్నది. తల్లి నిద్రపోయిందని ఖరారు చేసుకుని, కళావతి మళ్లీ సింగారించుకుని, వసంతుని వద్దకు వెళ్లింది.

కళావతి కోసం దిగులుపడి కూర్చున్న వసంతుడు ఒక్క ఉదుటన వచ్చి ఆమెను కౌగిట పొదువుకున్నాడు. “కళా! మనకిలా చాటుగా కలుసుకోవాల్సిన అగత్యం ఏముంది? ఆ రాక్షసి నిద్ర లేచేలోగా ఈ అడివిలో నుంచి తప్పించుకుని పారిపోదాం” సలహా చెప్పాడు వసంతుడు.

అందుకామె, “స్వామీ! దానిగురించి మీకు తెలియదు. మనం ఎక్కడున్నా వెతికి పట్టుకుని తినేయగలదు. అయినా వారానికి ఒక్కరాత్రి మాత్రమే కదా మనకు ఎడబాటు?! మిగిలిన ఏడురోజులూ అదిక్కడ ఉండనే ఉండదాయె” అన్నది.

“అలాకాదు. మనమిక్కడి నుంచి తప్పించుకు పోనైనా పోవాలి. లేదా ఆ రాక్షసిని అంతం చేసి శాశ్వతంగా దాని పీడ వదిలించుకోవాలి” నిశ్చయంగా అన్నాడు వసంతుడు.
కళావతి కొంతసేపు మౌనంగా ఊరుకున్నది.

“ఈవేళ కాకపోతే రేపైనా నన్నిక్కడ చూస్తే ఆ రాక్షసి బతకనీయదు. మనిషి మాంసానికి అలవాటు పడ్డది కనుక, రేపొద్దున ఎప్పుడైనా దాని ఆకలికి నీవు కూడా బలికావచ్చు. కనుక…”
“కనుక… ఎదురుపడి దానిని చంపుతానంటారా? అది సరైన పని కాదు.” భయపడింది కళావతి.

వసంతుడు కొద్దిసేపు ఆలోచించాడు. “ఇటువంటి రాక్షసులు సాధారణంగా ప్రాణాలు ఎక్కడైనా దాచిపెడుతూ ఉంటారు. మెత్తగా మాట్లాడి దాని ప్రాణరహస్యాన్ని తెలుసుకో. ఆ తరువాత తేలికగా పని సాధించవచ్చు.” ఉపాయం చెప్పాడు వసంతుడు.

వారి ముద్దుముచ్చట్లలో రేయి త్వరగా తెల్లవారిపోయింది. బ్రహ్మరాక్షసి నిద్రలేచే సమయానికి కళావతి తన స్వస్థానానికి వెళ్లిపోయింది.

యధావిధిగా రాక్షసి దేశాటనకు బయలుదేరింది. నవ్వుతూ ఎదురు రావాల్సిన కళావతి దిగాలుపడి కూర్చుంది. ఆమె ముఖం చూసేసరికి ఆ రాక్షసికి గుండె పిండేసినట్లయింది. “ఏమిటే పిచ్చిదానా?! ఈవేళ ఏమైంది నీకు?!” అని చిన్నపిల్లలా దగ్గరకు తీసుకుంది.

కళావతి తనలోపలి దిగులునంతా మాటల్లో వెలిబుచ్చుతూ, “అమ్మా! వారానికి ఒక్కరోజు తప్ప నువ్వు నాతో ఉండనే ఉండవు. మిగిలిన రోజులన్నీ ఎక్కడుంటావో తెలియదు. నువ్వు తిరిగి వచ్చేవరకూ నాకు భయంగానే ఉంటుంది. కాలం కలిసిరాక నీకేదైనా జరిగితే… ఇక్కడ ఒంటరిగా నాకు దిక్కేంటి?” అన్నది.

ఆ మాటలకి రాళ్లవాన కురిసినట్టు రాక్షసి పెద్దపెట్టున నవ్వింది. “ఓసి పిచ్చిదానా! ఇదా నీ భయం?! ఇటు చూడు… నన్ను చంపేవాడు ముల్లోకాల్లోనూ లేడు. అసలు నేనెక్కడ తిరుగుతున్నా నా ప్రాణం నాతోపాటు తిరగదు. నన్ను కొట్టి, గాయపరిచినా నా ప్రాణాలు మాత్రం పోకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. నా ప్రాణం రహస్యంగా దాచిపెట్టాను. ఆ మర్మాన్ని తెలిసినవాడు తప్ప వేరొకడు చంపలేడు” అని చెప్పింది.

ఆ మాటలతో కళావతి కళ్లు విప్పార్చి ఆశ్చర్యాన్ని ప్రకటించింది. “నిజమా! ప్రాణాలను రహస్యంగా దాచిపెట్టడం నిజంగా సాధ్యమేనా?!” అన్నది.

“నిజమే. కానీ అందరికీ ఆ విద్య రాదు. ఇటు చూడు. మన నగరానికి ఉత్తరాన నవరత్న సోపానాలు కలిగి, స్వర్ణకమలాలతో శోభిల్లే ఒక తటాకం ఉంది. ఆ తటాకానికి పడమటి దిక్కున ఒక అరటితోట ఉంది. ఆ అరటితోటలో ఒక రాతి వేదిక ఉంది. దానికి ఇనుప కవాటం బిగించి ఉంటుంది. ఆ కవాటాన్ని తెరిచే తాళంచెవి నువ్వు రోజూ నిద్రించే పరుపు కింద ఉంటుంది. ఆ తాళంచెవితో కవాటాన్ని తెరిచి లోపలికి వెళితే ఒక మణిమయ స్తంభానికి వేలాడగట్టిన పసిడి పంజరం కనిపిస్తుంది. ఆ పంజరంలోని రామచిలుకలో నా ప్రాణం నిక్షిప్తమైంది. దానిని చంపివేసినప్పుడే నేను కూడా చనిపోతాను. ఈ రహస్యం మూడోకంటి వాడికి కూడా తెలియదు. కనుక నాకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న బెంగ మానుకో. హాయిగా ఉండు. ఒక్క వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా! నన్ను నవ్వుతూ పంపించవూ!” అన్నది కళావతిని బతిమాలుతూ రాక్షసి.

కళావతి తన మనసులోని భావాన్ని రాక్షసి కనిపెట్టకుండా, ఆమెను జాగ్రత్తగా సాగనంపింది.

వసంతుడు కళావతి తిరిగి కలుసుకున్నారు. కళావతి తాను తెలుసుకున్న విషయాన్ని వసంతునికి తెలియచేసింది.

రాక్షసి చెప్పిన గుర్తుల ఆధారంగా వసంతుడు ఆ తటాకం వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి కదళీవనంలోని రాతివేదికకు చేరుకుని, ఇనుప కవాటాన్ని తెరిచి లోనికి వెళ్లాడు. పంజరంలోని రామచిలుకను సమీపించబోయేంతలోనే… చెవులు బద్దలు చేసేలా భీకరమైన ఆర్తనాదాలు వినవచ్చాయి.

ఆ అరుపు వింటూనే వసంతుడు తన వేగం పెంచాడు. పసిడి పంజరాన్ని తెరిచి, రెప్పపాటులో చిలుక గొంతు నులిమేశాడు.

ఆ వెనువెంటనే ఆర్తనాదాలు చావుకేకలుగా మారి క్రమేపీ తగ్గాయి. చిలుకను చంపిన తరువాతే రాతి వేదికలోపలి నుంచి అతడు బయటకు వచ్చాడు. అక్కడ బ్రహ్మరాక్షసి వెల్లకిలా పడి ఉండడాన్ని గమనించాడు వసంతుడు.

హమ్మయ్య అనుకుంటూ కళావతి వద్దకు తిరిగి వెళ్లాడు.

జరిగిన విషయం ఆమెకు వివరించాడు. ఆ వార్త వింటూనే కళావతి కళ్లనీళ్లు పెట్టుకుంది. “నాకు ఊహ తెలిసినప్పటినుంచి నన్ను కన్నతల్లిలా పెంచింది. మనుషులెవరూ లేనిచోట పెరగాల్సి వచ్చిందే తప్ప… నాకు ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చూసుకుంది. నేను ఏది కోరుకుంటే అది తెచ్చిపెట్టేది” అంటూ చనిపోయిన బ్రహ్మరాక్షసితో తనకు గల అనుబంధాన్ని నెమరువేసుకుంది.

వసంతుడు ఆమెను ఓదార్చి, “పాముకు పాలు పోసి పెంచితే ఎప్పటికైనా అది కాటు వేయకమానదు. ఆ రాక్షసితో మమకారం పెంచుకోవడం కూడా అలాంటిదే. ఇప్పటికైనా దాని బందిఖానా నీకు తప్పిపోయిందని సంతోషించు. నాతో రా. మా రాజ్యానికి పోదాం” అని చెప్పాడు.

“స్వామీ! మళ్లీ మనం ఇక్కడకు వస్తామో లేదో!! మరికొన్నాళ్లు ఈ ఏకాంత ప్రదేశంలోనే ఆనందంగా గడుపుదాం. ఆ తరువాత మీరన్నట్లే చేద్దాం” అని కళావతి అతడిని బతిమాలింది.
అందుకు వసంతుడు ఒప్పుకొన్నాడు. కళావతిలోని దిగులు పోగొట్టడానికిగానూ… ఆమెతో కలిసి ఆ నగరమంతా స్వేచ్ఛగా విహరించసాగాడు. ఆ విహారంలో భాగంగా తమకు సమీపంలోని సముద్ర తీరానికి వాళ్లిద్దరూ వెళ్లారు.

ఆ సముద్రజలాల్లో చాలాసేపు కేరింతలు కొట్టారు. బ్రహ్మరాక్షసి చావుతో తమకు ఇకపై ఎలాంటి ప్రమాదమూ లేదని భావిస్తున్న ఆ జంటకు… మరో పెనుప్రమాదం త్వరలోనే రాబోతున్నదని అప్పటికింకా తెలియదు.