Health

వట్టి వేరు.. గట్టి మేలు

వట్టి వేరు.. గట్టి మేలు

పూల వాసనలన్నీ పరిమళ తైలాలనిస్తాయా … ఇవ్వవు కదా . అలాగే మొక్కల వేర్లన్నీ కూడా మట్టివాసనకే పరిమితమైపోవు . తవ్వి తీస్తే కొన్ని ఔషధాలవుతాయి . మరికొన్ని పోషకాలను అందిస్తాయి . ఇంకొన్ని సుగంధాన్నీ వెదజల్లుతాయి . చాలాకొన్ని మాత్రమే చల్లదనాన్నీ పంచిస్తాయి . కానీ వట్టి వేరు … సకల సుగుణాలకూ పెట్టింది పేరు . పరిమళాన్నీ ఔషధగుణాల్నీ చల్లదనాన్నీ అందించే వట్టివేరు ( ఖస్ ) తో చేసే చాపల్ని కిటికీలకు కట్టడం , కూలర్లలో వాడటం తెలిసిందే . కానీ గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లతో వేసవి పానీయాన్నీ తయారుచేస్తారు . ఇది శరీరంలోని అధిక వేడిని చేత్తో తీసినట్లుగా లాగేస్తుందట . ఐరన్ , మాంగనీస్ పుష్కలంగా ఉండే వట్టివేళ్ల షర్బత్ రక్తప్రసరణను పెంచి , బీపీని తగ్గిస్తుంది . కళ్లు మండుతున్నా , దాహం తీరకున్నా డీహైడ్రేషన్తో బాధపడుతున్నా ఖస్ పానీయం తాగితే మేలు . ఖస్ సిరపన్ను లస్సీలూ మిల్క్ షేక్లూ ఐస్క్రీములూ పండ్లరసాల తయారీలో కలుపుతారట .